కెరీర్ బయోగ్రఫీలో ఇంకా చెప్తాను! | Senior journalists ABK Prasad | Sakshi
Sakshi News home page

కెరీర్ బయోగ్రఫీలో ఇంకా చెప్తాను!

Published Wed, Oct 22 2014 12:38 AM | Last Updated on Fri, May 25 2018 6:35 PM

కెరీర్ బయోగ్రఫీలో ఇంకా చెప్తాను! - Sakshi

కెరీర్ బయోగ్రఫీలో ఇంకా చెప్తాను!

సీనియర్ పాత్రికేయులు ఎబికె ప్రసాద్. ఒక తరం తెలుగు పత్రికలన్నింటిలోనూ ఆయన ముద్ర ఉంది. ఆయన వేసిన బీజాలతో మొలకెత్తిన మొక్కలు శాఖోపశాఖలుగా విస్తరించి మహావృక్షాలయ్యాయి. విస్తృతమైన జీవితాన్ని, సమాజాన్ని చూసిన అనుభవం ఆయనది, అభ్యుదయ భావాల ఈ కలం వీరుడి అంతరంగ వీక్షణానికి ఓ ప్రయత్నం.

కమ్యూనిస్టు పార్టీ కోసం, మార్క్సిస్టు పార్టీ పత్రిక ‘జనశక్తి’ని నడపడంలో 15 ఎకరాల పొలాన్ని కరిగించేశాను. పాత్రికేయులకు ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకున్నాను. తర్వాత ఆ ఇంటినీ అమ్మేసి ఆ డబ్బుతో నేను, నా భార్య సుధ ఇద్దరం హైదరాబాద్, కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌లో జీవిస్తున్నాం.
 ఎబికె ప్రసాద్ - అంతర్వీక్షణం

మీరు పుట్టింది ఎప్పుడు? ఎక్కడ?
 1935వ సంవత్సరం ఆగస్టు ఒకటవ తేదీన కృష్ణాజిల్లా ఉయ్యూరులో పుట్టాను.

మీ సొంతూరు ఉయ్యూరా? అమ్మానాన్నలు...
 సొంతూరు కృష్ణాజిల్లా ఉప్పలూరు. మా మేనమామ చలసాని వాసుదేవరావు ఉయ్యూరు దగ్గర భట్ల పెనుమర్రులో ఉండేవారు. అమ్మ చంద్రావతమ్మ, నాన్న బుచ్చివీరయ్య. నాన్న నా ఐదవయేటనే పోయారు. నన్ను అమ్మ పెంచింది.

మీరు ఏం చదివారు?  
ఎం.ఎ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిస్‌కంటిన్యూ చేశాను. ఎందుకలా?... నాగపూర్‌లో ఎం.ఎ చదువుతూ అక్కడ తెలుగువారు జరుపుకునే సాంస్కృతిక కార్యక్రమాలను  ‘విశాలాంధ్ర’ పత్రికకు రిపోర్ట్ చేసేవాడిని. అలా ఫైనలియర్‌కి వచ్చేటప్పటికి నాకు కావలసింది ఈ కోర్సులో ఏమీ ఉండదనిపించి చదువు మానేసి ఉద్యోగంలో చేరాను.

మీ తొలి ఉద్యోగం ఎక్కడ?
విజయవాడలో, ‘విశాలాంధ్ర’ పత్రికలో.

మీ పాత్రికేయ జీవితానికి ఎన్నేళ్లు?
1958లో విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌గా చేరాను. అప్పటి నుంచి లెక్కిస్తే 56 ఏళ్లు. నా కలం మరో నాలుగేళ్లు పెద్దది. బి.ఎ రోజుల్నుంచి రాస్తున్నాను.

మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు?
కమ్యూనిస్టు ఉద్యమాన్ని కళ్లారా చూశాను. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మా మేనమామ వాసుదేవరావు, మద్దుకూరి చంద్రశేఖరరావు, మాకినేని బసవపున్నయ్య లాంటి ప్రముఖుల చర్చలను ప్రత్యక్షంగా చూశాను. నన్ను వాళ్లు చాలా ప్రభావితం చేశారు.

అప్పటి రాజకీయాలతో మీకు ప్రత్యక్ష సంబంధాలుండేవా?
పునాదిపాడులో ఎనిమిది- తొమ్మిది తరగతులు చదువుతున్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల పట్ల ఆకర్షితుణ్ణయ్యాను. కొద్దికాలానికే బయటికొచ్చేశాను.

ఆర్‌ఎస్‌ఎస్ నచ్చలేదా?
గాంధీజీ హత్యతో ఆర్‌ఎస్‌ఎస్ పట్ల విముఖత కలిగింది.

గాంధీజీ హత్య మిమ్మల్ని తీవ్రంగా గాయపరచినట్లుంది!
నిజమే. ఊరు ఊరంతా అట్టుడికిపోయింది. పెద్దవాళ్లందరూ గాంధీజీ దేశం కోసం జీవితాన్ని అర్పించడాన్ని చెప్పుకోవడం విని నేను కన్నీళ్లు పెట్టుకున్నాను.
 
సంపాదకులుగా ఎన్ని పత్రికలను నడిపించారు?
ఆంధ్రపత్రిక, సాక్షిలో తప్ప తెలుగులో అన్ని పత్రికలకూ పనిచేశాను. ఈనాడు, ఉదయం, వార్త(విజయవాడ, వైజాగ్ ఎడిషన్లు) పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కూడా.

వృత్తిపరమైన ఒడుదొడుకులు...!
‘జనశక్తి’ సంపాదకుడిగా నా మీద కేసులు ఫైలయ్యాయి. జైలుకెళ్లాను కూడ.

జైలు జీవితం దుర్భరంగా అనిపించిందా?
పుస్తకాలు చదువుకునే వాడికి జైలు దుర్భరంగా ఉండదు. కావలసినంత సమయం దొరికినట్లవుతుంది. అక్కడ జక్కా వెంకయ్య, డాక్టర్ శేషారెడ్డి వంటి పార్టీ సీనియర్ నాయకులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం వచ్చింది.

వందలాది అంశాల మీద వేలాదిగా వ్యాసాలు రాసి ఉంటారు? తాజాగా ఏం రాస్తున్నారు?
నా కెరీర్ బయోగ్రఫీ ఈ డిసెంబర్‌లో మొదలు పెడతాను. అందులో చాలా విషయాలను చెప్తాను.

సంతోషం కలిగించే విషయం!
అనేక పత్రికలకు ప్రారంభ సంపాదకుడిని కావడం.

తరచూ పత్రికలు మారతారనే అపప్రథ కూడా ఉంది కదా!
కొత్తగా పత్రిక పెట్టే వారికి నా సేవలు కావాలి. బండి పట్టాలెక్కిన తర్వాత నా ముక్కుసూటితనాన్ని భరించాల్సిన అవసరం వారికి ఉండకపోవచ్చు. రాజీ పడి ఉద్యోగం చేయడం నాకిష్టం లేదు.

జీవితంలో రాజీ పడాల్సిన సందర్భం వచ్చిందా?
రాజీ పడాల్సిన సందర్భాలు ఎవరికైనా సరే చాలానే వస్తాయి. రాజీ పడి ఉంటే పొలాలు, ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరమే వచ్చేది కాదు. ఉద్యోగాలు మారేవాడినీ కాదేమో.

రాజీలేని జీవితంతో తృప్తి కలుగుతోందా?
చాలా తృప్తిగా ఉన్నాను. తృప్తిని మించిన ఆస్తి లేదు.

సంపాదకుడి ప్రతిభకు కొలమానం ఉంటుందా?
ఉంటుంది. పత్రిక అమ్మకాలు పెరగడం, తగ్గడం- రెండూ సంపాదకుడి ప్రతిభకు గీటురాళ్లే.

విమర్శలను ఎలా స్వీకరిస్తారు?
కుత్సితాల లోయలోకి వెళ్లేకొద్దీ మనలోని నైపుణ్యాలు అణగారిపోతాయి. కుహనా విమర్శను అక్కడితోనే వదిలేయాలి. మనసులోంచి తుడిచేయాలి. అప్పుడే లక్ష్యాలను చేరగలం.

మీరు నమ్మే సిద్ధాంతం?
ఎన్ని అడ్డంకులు ఎదురైనా మానసికంగా దెబ్బతినకూడదు. ఎంచుకున్న బాటను వదల కూడదు.

పాత్రికేయులకు మీరిచ్చే సందేశం?
ప్రతి వాక్యాన్నీ బాధ్యతగా రాయాలి. ఆ సంస్థను వదిలి వెళ్లేటప్పుడు రాసిన చివరి వాక్యం కూడా ఉద్యోగంలో ఉన్నప్పుడు రాసినట్లే రాయాలి. రాసిన ప్రతి వాక్యానికీ బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉండాలి.
 - వాకా మంజులారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement