భర్త ప్రాణాల కోసం భార్యలు అపర శక్తి స్వరూపిణులు అవుతారు. ఒక్కోసారి యముని మహిషంపై కొమ్ములు కూడా విసురుతారు. వారి నిశ్శబ్ద సంగ్రామాలు చాలా మటుకు లోకానికి తెలియవు. తెలిసినవి విస్మయం కలిగించకమానవు. చెన్నైకి చెందిన 66 ఏళ్ల లలిత తన భర్త కోసం మృత్యువు సమక్షంలో 8 రోజులు గడపడం సామాన్యం కాదు.
జూన్ 19. చెన్నై. రెడ్‌హిల్స్‌లో ఆ ఇంట్లోని 76 ఏళ్ల భర్త మదనగోపాల్ తన భార్య లలితను పిలుద్దామనుకున్నాడు. కాని మాట జారిపోయింది. మళ్లీ పిలుద్దామనుకున్నాడు. గొంతు పెగల్లేదు. కుడి చేత్తో సైగ చేసి పిలుద్దామనుకున్నాడు. చేయి కదలడం లేదు. అయితే వంట గదిలో ఉన్న ఆయన భార్య లలితకు మనసులో ఏదో ఆరాటంగా అనిపించింది. బయటకొచ్చి చూసింది. భర్త పరిస్థితి ఆందోళనగా ఉందని అర్థమైంది. ఆమె భయపడలేదు. వెంటనే భర్త బంధువు ఒకరికి ఫోన్ చేసింది. అతను డాక్టర్. ‘అది స్ట్రోక్‌లా ఉంది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకొచ్చేయండి’ అని చెప్పాడతను. లలిత తన భర్తను ఆఘమేఘాల మీద హాస్పిటల్‌కు తీసుకెళ్లి జాయిన్ చేసింది. వైద్యులు ఆ మైల్డ్ స్ట్రోక్‌కి వెంటనే వైద్యం చేశారు. ఇది కోవిడ్ సమయం కనుక ఆ టెస్ట్ కూడా చేశారు. పాజిటివ్ వచ్చింది. కంగారు పడి లలితకు కూడా చేశారు. నెగెటివ్ వచ్చింది. ‘ఇప్పుడేం చేద్దాం’ అన్నారు లలితతో. ‘ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాను’ అందామె. ‘అది క్షేమం కాదు. ఆయన హాస్పిటల్‌లో ఉండాలి’ అని చెప్పారు.
వెంటనే మదన గోపాల్‌ని పొన్నేరిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మదన గోపాల్ ఐసొలేషన్‌లో ఉండాలి. కాని మదన గోపాల్‌కు అప్పటికే బి.పి, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయి. దానికితోడు ఆయనకు మతి స్థిమితం సరిగా ఉండదు. ‘ఆయన నేను లేకపోతే ఉండడు. ఉండలేడు’ అంది లలిత. ‘నేను కూడా ఆయనతో పాటే ఉంటాను’ అని కూడా అంది. ఆయనతో పాటు ఉండటం అంటే కోవిడ్‌ను కొని తెచ్చుకోవడం. మృత్యువుకు గడపదాకా ఆహ్వానం పలకడం. ఎందుకంటే ఆమె కూడా రిస్క్ ఏజ్ గ్రూప్‌లోనే ఉంది. కాని డాక్టర్లకు వేరే దారి కనిపించలేదు. ‘సరే ఉండండి’ అన్నారు. లలిత ఆ వయసులో తన భర్త కోసం నిలబడింది. అతనితోపాటు 8 రోజుల పాటు ఐసొలేషన్‌వార్డులో ఉండి పోయింది. ప్రతి క్షణం మాస్క్ ధరించి తనను తాను కాపాడుకుంటూ భర్తను కాపాడుకుంది. ‘అక్కడ మా బట్టలు నేనే ఉతుక్కున్నాను. రాత్రంతా అతని పక్కనే కూచుని కాపు కాచాను’ అంది లలిత.
డాక్టర్లు ఎందుకైనా మంచిదని లలితకు కూడా మల్టీ విటమిన్ టాబ్లెట్లు, కొన్ని బూస్టర్లు ఇచ్చారు. ‘అలా ఉండటం కష్టం కాలేదా?’ అని లలితను అడిగితే ‘పెద్ద కాలేదు. కాని ఆయనకు టీ అలవాటు. టైమ్‌కు టీ అందకపోతే విసుక్కుంటారు. ఆయన అడిగినప్పుడు టీ ఏర్పాటు చేయడం కష్టమైంది’ అని మెల్లగా నవ్విందామె. ‘మీకు కోవిడ్ వచ్చి ఉంటే?’ అనడిగితే ‘వస్తే ఏం చేస్తాం? ఎన్నోసార్లు అతనిని కాపాడుకున్నాను. ఈసారి అది వచ్చినా కాపాడుకోవాలనుకున్నాను. కాని నాకు రాలేదు’ అందామె. మదనగోపాల్ అసింప్టమేటిక్ కావడం వల్ల డాక్టర్లు ఇంటికి పంపించారు. ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాలని చెప్పారు. మదనగోపాల్‌కు ఏం భయం... ఏం బెంగ? అలాగే ఉంటాడు. లలిత ఉందిగా. – సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment