శ్రీశ్రీశ్రీ... శ్రీదేవి | sridevi special story | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీశ్రీ... శ్రీదేవి

Sep 25 2015 11:33 PM | Updated on Sep 3 2017 9:58 AM

శ్రీశ్రీశ్రీ...  శ్రీదేవి

శ్రీశ్రీశ్రీ... శ్రీదేవి

శ్రీదేవి...శ్రీశ్రీశ్రీ... శ్రీదేవి అని పిలిపించుకోవడానికి

శ్రీదేవి...
శ్రీశ్రీశ్రీ... శ్రీదేవి అని పిలిపించుకోవడానికి
మహారాణి పాత్రలు వేయనక్కర లేదు.
తెలుగువారి గుండెల్లో తనెప్పుడూ మహారాణే!
పీక్‌లో ఉన్నప్పుడు బోనీ కపూర్‌తో... పెళ్ళి జీవితానికి శ్రీకారం చుట్టి...
ఆల్‌మోస్ట్ అజ్ఞాతంలోకి జారుకున్నారు.
మళ్ళీ ‘ఇంగ్లిష్... వింగ్లిష్’తో... సర్‌ప్రైజింగ్లీ సూపర్బ్ రీ-ఎంట్రీ ఇచ్చారు.
అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు వెండితెరపై కనబడతారా అని...
ఎదురుచూస్తున్న తెలుగు గుండెలకు త్వరలో రాణీదర్శనం ఇవ్వనున్నారు.

 
►‘ఇంగ్లిష్-వింగ్లిష్’ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ‘పులి’కే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏంటి?

 ‘ఇంగ్లిష్-వింగ్లిష్’ చూసినవాళ్లందరూ ‘చాలా గ్యాప్ తర్వాత చేసినా మంచి సినిమా చేశారు’ అని అభినందించారు. ఇప్పుడు నేను ఏ సినిమా చేసినా అలాంటి అభినందనలే అందుకోవాలి. అందుకే ఆ సినిమా తర్వాత చాలా అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేదు. ‘పులి’ ఫ్యాంటసీ స్టోరీ. అలాంటివి చేయడం ఆసక్తిగా ఉంటుంది. నా పాత్ర బాగా నచ్చడంతో చేశాను.
 
► చిత్రదర్శకుడు శింబుదేవన్ ఈ కథ చెప్పినప్పుడు ఏమనిపించింది?

 కథ అద్భుతం. నా పాత్ర చాలా బాగుంటుంది. ఇలాంటి పాత్రలు చేసే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. అందుకే, కథ వినగానే నటించడానికి ఒప్పుకున్నా. పెద్దలు మాత్రమే కాదు... పిల్లలు కూడా చూసే విధంగా ‘పులి’ ఉంటుంది.

షూటింగ్ వాతావరణం గురించి?
 ఇందులో నాది రాణి పాత్ర. షూటింగ్ లొకేషన్లో కూడా నన్ను అందరూ రాణిలానే చూసేవారు. అలా స్పెషల్‌గా ట్రీట్ చేయడం చాలా స్వీట్‌గా అనిపించేది.

► మీ పిల్లలు (జాన్వి, ఖుషి) మీ సినిమాలు చూసి, ఏమంటారు?
 చాలా గర్వపడతారు. నేను సాధించినది చాలా తక్కువ. ఆ తక్కువ విషయానికే వాళ్లు ఆనందపడడం చూసినప్పుడు నాకు భలే ఉంటుంది.

► తెలుగులో స్ట్రయిట్ చిత్రం ఎప్పుడు?
మంచి కథ, పాత్ర దొరికితే చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు.

► ఆ మధ్య రచయిత కోన వెంకట్ మీకు కథ చెప్పారు కదా... అదేమైంది?
 కథ బాగుంది. ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ సినిమా ఉంది. బహుశా రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

మీ అమ్మాయి జాన్వి ఇప్పుడప్పుడే కథానాయికగా చేయదట కదా?
 అవును. కానీ, ఎవరికి వాళ్లు మా అమ్మాయి ఫలానా సినిమా ద్వారా పరిచయమవుతోందని ఊహాగానాలు చేస్తున్నారు. జాన్వి ఇంకా చిన్నపిల్ల.

జాన్వి ఇప్పుడేం చేస్తోంది?
 ఈ మధ్యే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఇంకా చదువుకోవాలనుకుంటోంది. యూఎస్‌లో చదవాలనుకుంది. మేం కాదనలేదు. జాన్వి కంఫర్ట్‌గా సెటిలయ్యేవరకూ నేనూ అక్కడే ఉంటా. ప్రస్తుతానికైతే నెలరోజులు యూఎస్‌లో ఉండాలని ప్లాన్ చేసుకున్నా.

ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం.. ఇప్పుడైతే కథానాయికలు వీలైనంత సన్నగా ఉండాలి. అప్పట్లో బొద్దుగా ఉండేవాళ్లంటే క్రేజ్. మీరు మాత్రం ఈ తరం నాయికలా సన్నగా ఉండేవారు. మరి అప్పుడు...?
యాక్చువల్‌గా మా అమ్మగారి నుంచి నాకది అలవాటైంది. అమ్మ ఆలోచనలన్నీ చాలా ఫార్వార్డ్‌గా ఉండేవి. ఫ్రైడ్ ఫుడ్ తిననిచ్చేది కాదు. ఆయిలీ ఫుడ్‌ను ఎంకరేజ్ చేసేది కాదు. యోగా అలవాటు చేసింది. అమ్మ ప్రభావం వల్ల ఆరోగ్యం పట్ల నాకు శ్రద్ధ పెరిగింది. వాకింగ్, జాగింగ్ చేసేదాన్ని. టెన్నిస్ బాగా ఆడేదాన్ని. ఇప్పటికీ యోగా, వాకింగ్, టెన్నిస్ - అన్నీ కంటిన్యూ చేస్తున్నా.

టీలు, కూల్ డ్రింక్స్‌లాంటివి మీరు తీసుకునేవారా?
 చెబితే నమ్మరేమో కానీ, ఇప్పటివరకూ నాకు టీ రుచి ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కటంటే ఒక్క చుక్క కూడా తాగలేదు. కూల్‌డ్రింక్స్‌కి కూడా నేను చాలా చాలా దూరం.

మరి... కాఫీ సంగతి?
మా యోగా మాస్టర్ చెప్పడం వల్ల కాఫీ అలవాటు చేసుకున్నాను. అది కూడా ‘బ్లాక్ కాఫీ’. ఆయన ఎందుకు సజెస్ట్ చేశారంటే, నాకు జలుబు చేసేది. అలాంటి సమయాల్లో బ్లాక్ కాఫీ తీసుకుంటే రిలీఫ్‌గా ఉంటుందన్నారు. అలా కాఫీ అలవాటైంది.

బక్కపలచగా ఉన్నావేంటని ఎవరైనా కామెంట్ చేసేవారా?
ఎన్టీఆర్‌గారు ‘ఏమండీ... ఆరోగ్యం బాగాలేదా.. అలా చిక్కిపోతున్నారు’ అనేవారు. నవ్వేసి ఊరుకునేదాన్ని. అప్పట్లో సన్నగా ఉండడం అంటే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అనుకునేవాళ్లు.

ఎన్టీఆర్, ఏయన్నార్ వంటి సీనియర్ హీరోల సరసన నటిస్తున్నప్పుడు భయంగా ఉండేదా?
చాలా. ఇద్దరూ సీనియర్లు కాబట్టి, టెన్షన్ పడేదాన్ని. భయంతో కూడిన మర్యాద ఉండేది. కానీ, ఇద్దరూ కూల్‌గా ఉండేవాళ్లు. దాంతో టెన్షన్ తగ్గేది. వాళ్లతో కంటిన్యూస్‌గా సినిమాలు చేయడం మొదలుపెట్టాక భయం తగ్గిపోయింది.

ఏయన్నార్‌తో నటించిన మీరు ఆయన తనయుడు నాగార్జునతోనూ  నటించారు. ఎలా అనిపించేది?
మీరిప్పుడు అడుగుతుంటే ‘ఓహో తండ్రి, కొడుకు - ఇద్దరి పక్కనా నటించానా?’ అనిపిస్తోంది. అప్పట్లో ఏదీ ఆలోచించే తీరిక ఉండేది కాదు. మంచి సినిమాలు సెలక్ట్ చేసుకోవడం, ఒప్పుకున్న పాత్రలకు పూర్తిగా న్యాయం చేయడం... వీటి మీదే దృష్టి ఉండేది. అయితే, ఒకే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే... తండ్రి సరసన యాక్ట్ చేసినప్పుడు ఉన్న టెన్షన్ కొడుకుతో చేసినప్పుడు ఉండేది కాదు.

మీ కన్నా వయసులో చాలా పెద్దవాళ్లయిన ఎన్టీఆర్, ఏయన్నార్‌ల సరసన నటించినప్పుడు మీ ఫీలింగ్?
 అదో అదృష్టం. ఇద్దరూ లెజెండ్రీ యాక్టర్స్. పైగా, మా మధ్య ఉన్న వయసు వ్యత్యాసం గురించి ఆలోచించేంత మానసిక పరిపక్వత కూడా నాకు ఉండేది కాదు. వాళ్లకు తగ్గట్టుగా ఎలా నటించాలి? అని మాత్రమే ఆలోచించేదాన్ని.

పోనీ.. స్కూల్‌కి వెళ్లాల్సిన వయసులోనే సినిమాలతో బిజీ  కావడం, కథానాయిక అయ్యాక షిఫ్టులవారీగా పని చేయడం వల్ల, జీవితంలో ఎక్కువ కష్టపడ్డాం అనే పశ్చాత్తాపం ఏదైనా ఉందా?
నెవర్... మనం ఏదైనా సాధించాలంటే ఏదో ఒకటి కోల్పోవాల్సిందే. కాలేజ్ ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు. కానీ, అంతకన్నా ఎక్కువ పాఠాలు సినిమా పరిశ్రమ నేర్పించింది. సినిమా అనేది నాకో బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. లోకజ్ఞానం అంతగా లేని వయసులో నలుగురిలో గుర్తింపు పొందడం, వయసు పెరిగే కొద్దీ నలుగురి అభినందనలు అందుకోవడం, ఎదరో అభిమానుల్ని సొంతం చేసుకోవడం ఓ వరం. ఈ అదృష్టం అందరికీ దక్కదు.

మీ కెరీర్‌లో ఎప్పుడైనా భారీ పారితోషికం కోసం... బాగాలేని పాత్రలు చేసిన సందర్భాలున్నాయా?
అస్సలు లేదు. మంచి పాత్రల కోసం పారితోషికం తగ్గించుకున్న సందర్భాలే ఉన్నాయి. ఇవాళ నటిగా వెనక్కి తిరిగి చూసుకుంటే, పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు నాకు. పారితోషికం విషయంలో రాజీపడ్డానే కానీ, పారితోషికం కోసం రాజీపడ లేదు. లక్కీగా నేను చేసినవన్నీ మంచి పాత్రలే.

మీరు పెళ్లి చేసుకుని ముంబయ్ వెళ్లిపోయినా, అడపా దడపా ఇక్కడికొచ్చినప్పుడు అందరూ ఎంతో ఆత్మీయంగా ఉంటారు. అప్పుడు తెలుగువాళ్లకి దూరం అయ్యామనే ఫీలింగ్ కలుగుతుంటుందా?
ఒకవేళ లైఫ్ కరెక్ట్‌గా లేకపోతే అలా అనిపించి ఉండేదేమో. వీలు కుదిరినప్పుడల్లా నేనిక్కడకు వస్తున్నాను. ఏ ఫంక్షన్‌నీ వదిలిపెట్టడం లేదు. ఏ కార్యక్రమాన్నీ విస్మరించడం లేదు. ఇక్కడివాళ్లు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుతుంటారు. ఇదంతా ఆ దేవుడి ఆశీర్వాదమే.
 - డి.జి. భవాని

చాలా బరువు మోశా!
 ‘పులి’ చిత్రంలో రెండువేల ఆరువందల గ్రాఫిక్స్ షాట్స్ ఉండటం విశేషం. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఇన్ని వేల షాట్స్ ఉన్న తొలి చిత్రం ఇదే.  గ్రాఫిక్స్ ప్రాధాన్యంగా సాగే సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకే దాదాపు ఆరు నెలలకు పైగా తీసుకున్నారు. ‘ఈగ’ చిత్రానికి గ్రాఫిక్స్ చేసిన ‘మకుట’ సంస్థే ‘పులి’కి కూడా విజువల్ ఎఫెక్ట్స్ చేసింది.  నాటి విఠలాచార్య చిత్రాలను తలపించే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ పాతికేళ్లలో ఇలాంటి కంప్లీట్ ఫ్యాంటసీ మూవీ రాలేదని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement