నరకబాధల్ని పోగొట్టే పండుగ | tomorrow naraka Chaturdasi | Sakshi
Sakshi News home page

నరకబాధల్ని పోగొట్టే పండుగ

Published Thu, Oct 27 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

నరకబాధల్ని పోగొట్టే పండుగ

నరకబాధల్ని పోగొట్టే పండుగ

రేపు నరక చతుర్దశి


‘ధన త్రయోదశి’ మరునాడే నరక చతుర్దశి. నరకం నుంచి విముక్తి కోసం చేసే యమ ధర్మరాజు ప్రీత్యర్థం జరుపుకొనే పండుగగా ‘నరక చతుర్దశి’ మొదలైందట. కానీ, ఆ తరువాతి కాలంలో ప్రాగ్జ్యోతిష పురాన్ని (ఇవాళ్టి అస్సామ్ ప్రాంతం) పాలించిన నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన సందర్భాన్ని పురస్కరించుకొని, ‘నరక చతుర్దశి’ జరుపుకోవడం ప్రాచుర్యంలోకి వచ్చింది.

 
అనేక పేర్లు... అనేక ఆచారాలు: నరక చతుర్దశికి ఒకటి కాదు... అనేక పేర్లున్నాయి. దీనికే ‘ప్రేత చతుర్దశి’ అని కూడా పేరు. సంస్కృతంలో ‘కాళ చతుర్దశి’ అనీ అంటారు. ‘కాళ’ అంటే అంధకారం అని అర్థం! అలా ఇది ‘అంధకారపు చతుర్దశి’. గుజరాతీయులు ‘కాల చౌదశ్’ అంటారు. ఆ రోజుకూ, కాళీ మాతకూ సంబంధం ఉందనేవారూ ఉన్నారు. దీన్ని ‘కాళీ చౌదశ్’గా పేర్కొంటూ, అంధకారాన్ని రూపుమాపే కాళీ దేవతను ఆ రోజు పూజిస్తారు. మంత్ర తంత్రాల సిద్ధికి ఆ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు.


నరకాసుర కథ: పురాణాల ప్రకారం భౌమాసురుడు లేదా నరకాసురుడు దేవతల్నీ, మానవుల్నీ హింసించేవాడు. అనేక రాజ్యాలను జయించి, 16 వేల మంది రాకుమార్తెల్ని చెరపట్టాడు. విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడు దేవతల, మానవుల ప్రార్థన మేరకు నరకాసురునితో యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుని భార్య సత్యభామ యుద్ధక్షేత్రంలో భర్తకు సహకరించింది. కృష్ణుడు నరకాసురుణ్ణి వధించి, రాకుమార్తెలను చెర నుంచి విడిపించాడు. ‘ఈ తిథి నాడు ఎవరైతే మంగళస్నానం చేస్తారో, వారికి నరకలోక భయం లేకుండా ఉండేలా అనుగ్రహించాల్సింది’ అంటూ నరకుడు, శ్రీకృష్ణుణ్ణి వరం కోరాడు. ఆయన అనుగ్రహించాడు. అందుకే ‘నరక చతుర్దశి’ నాడు ప్రధాన కర్తవ్యం తెల్లవారగట్టే లేచి తలంటి స్నానం చేయడం!

 
గోవాలో... నరకాసుర దహనం: మహారాష్ట్రీయులకు ఇది ముఖ్యమైన పండుగ. పశ్చిమ బెంగాల్‌లో పందిళ్ళు వేసి, దేవతా విగ్రహాలను పెట్టి, పూజలు జరుపుతారు. గోవా లాంటి చోట్ల ఈ పండుగను ‘దసరా’ లానే జరుపుకొంటారు. దసరాకు రావణాసురుడి దిష్టిబొమ్మలు చేసి, దహనం చేస్తారు. నరక చతుర్దశికేమో నరకాసురుడి బొమ్మ దహనం చేస్తారు. వేకువనే బొమ్మ దహనం చేసి, టపాకాయలు కాల్చి, ఇంటికి వచ్చి తలంటు స్నానం చేస్తారు.

 
తలంటు స్నానం... యమతర్పణం... దీపదానం: తెల్లవారే తలంటు పోసుకొని, పాపక్షయం కోసం ప్రార్థించాలి. యమధర్మరాజుకు తర్పణం ఇవ్వాలి. దీపం వెలిగించాలి. అలాగే, ఆ రోజున నరకం నుంచి ముక్తి కోసం సాయంకాలం ప్రదోషకాలంలో యమ ధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని ‘వ్రతచూడామణి’ చెబుతోంది. దేవాలయాల్లో, మఠాల్లో దీపాలను వరుసగా ఉంచాలి. అందుకే, నరక చతుర్దశినే ‘యమ దీపదాన్’ అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి సంప్రీతి కోసం ఇలా నరక చతుర్దశి, దీపావళి, కార్తిక శుద్ధ పాడ్యమి - వరుసగా మూడు రోజులూ దీపప్రదానం చేయాలి. ఈ పండుగ 14వ తిథి నాడు జరుగుతుంది కాబట్టి, 14 రకాల కూరగాయలతో వంటకాలు చేస్తారు. దేవుడి సంప్రీతి కోసం ఒక సద్బ్రాహ్మణుణ్ణి దేవుడిగా భావించి, అతనికి భోజనం పెడతారు. ఆ తరువాత అందరూ భోజనం చేస్తారు.

 
నాలుగు వత్తుల దీపంతో... ప్రదోషపూజ: సాయంత్రమయ్యాక ప్రదోషకాలంలో పూజ చేస్తారు. నరకం పాలు కాకుండా ఉండేందుకూ, పాపాలన్నీ పోగొట్టుకొనేందుకూ ఆ సమయంలో నాలుగు వత్తులతో సంప్రదాయబద్ధంగా ఒక దీపం వెలిగిస్తారు. ‘దత్తో దీప శ్చతుర్దశ్యామ్ నరక ప్రీతయే మయా, చతుర్వర్తి సమాయుక్తః సర్వపాపాపనుత్తయే’ అంటూ ‘లింగ పురాణం’లోని శ్లోకం చదువుతారు. ఈ చతుర్దశికి నరకాధిపతి ప్రీతి కోసం, పాపాలన్నీ పోగొట్టుకోవడం కోసం ఈ నాలుగువత్తుల దీపం వెలిగిస్తున్నానని అర్థం. అలాగే శివపూజ చేస్తారు.

 
బెంగాల్‌లో... కాళీపూజ: దీపావళి అనగానే ఎక్కువగా లక్ష్మీపూజ గుర్తొస్తుంది. కానీ, బెంగాల్ ప్రాంతంలో నరక చతుర్దశి రోజు రాత్రి అంతా కాళీపూజ చేస్తారు. అందుకే, అక్కడ ఆ రోజును ‘కాళీపూజా దినం’గా పిలుస్తారు. మొత్తం మీద నరకం అంటే, అజ్ఞానమనీ, అంధకారమనీ, పాపాల కూపమనీ కూడా అర్థం చెప్పుకోవచ్చు. వీటన్నిటి నుంచి విముక్తి కోరుకొనే పండుగ కాబట్టే, దీనికి ఇంత విశిష్టత.  
- రెంటాల జయదేవ

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement