డైరెక్టర్స్‌ హీరో | Venkatesh and sudha special interview for guru movie | Sakshi
Sakshi News home page

డైరెక్టర్స్‌ హీరో

Published Sat, Apr 1 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 7:41 AM

డైరెక్టర్స్‌ హీరో

డైరెక్టర్స్‌ హీరో

పదిమందిలో మంచి పేరు తెచ్చుకోవడానికి
నైజం ఏదైనా నిజం బయట పడకుండా
పబ్లిక్‌ లైఫ్‌లో యాక్ట్‌ చేసేస్తుంటారు.
వెంకటేశ్‌ అలా కాదు.
సత్యాన్ని అన్వేషించాలనుకుంటాడు.
 అందుకే... సత్యానికి దగ్గరగా
ఉండాలనుకుంటాడు.
అందుకే ఆయన డైరెక్టర్స్‌ హీరో అయ్యాడు.
పాత్రల్లో ఎలాగూ మంచి నటన ఉంటుంది.
జీవితంలో మంచి పాత్ర చాలు.
నటన అక్కర్లేదు.
వెంకీ పాలసీ, ఫిలాసఫీ కూడా ఇదే.


వెంకీగారు... మెయి న్‌స్ట్రీమ్‌ హీరోల్లో ఇద్దరు లేడీ డైరెక్టర్స్‌తో సినిమాలు చేసింది మీరే. ఫీమేల్‌ డైరెక్టర్స్‌ని ఎంకరేజ్‌ చేయాలనా?
వెంకీ: (నవ్వుతూ) నేను మంచి సినిమాలను ప్రోత్సహిస్తాను. క్రమశిక్షణ, అంకితభావానికి ప్రాధాన్యం ఇస్తాను. అది ఎవరిలో ఉన్నా ఎంకరేజ్‌ చేస్తా. సుధలో నేను ఆ లక్షణాలు చూశా. 24 గంటలూ ఆమె సినిమా గురించే ఆలోచిస్తుంది. ప్లస్‌ తను తీసుకొచ్చిన కథ బాగుంది.

ఫీమేల్‌ డైరెక్టర్, స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌... సుధ హ్యాండిల్‌ చేయగలుగుతుందా? అని చిన్న సందేహం కూడా కలగలేదా?
వెంకీ: ఇప్పుడు మీరు అడుగుతుంటే ఆలోచిస్తున్నాను. యాక్చువల్‌గా సుధ వచ్చినప్పుడు నాకేమీ అనిపించలేదు. ఫీమేల్‌ డైరెక్టర్‌ అని ఆలోచించలేదు. స్టోరీ నచ్చింది. ముందు సినిమాల్లో చేసినట్టు కాకుండా కొత్తగా, నేను టోటల్‌ డిఫరెంట్‌గా కనిపించాలని, నటించాలని అను కుంది సుధ. ఆ విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పింది.

‘అమ్మాయిలు అవకాశాలు రాలేదు... అంటుంటారు. వస్తే ఉపయోగించుకోరు’ అని  ‘గురు’ సినిమాలో ఓ డైలాగ్‌ చెప్పారు. ఇన్‌ జనరల్‌ విమెన్‌ గురించి చెప్పండి?
వెంకీ: సహజంగా మహిళలు మగవాళ్ల కన్నా స్ట్రాంగ్‌. అందులో సందేహం లేదు. 20– 30 ఏళ్లుగా మహిళలు సమాజంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. వాళ్లకు ఓ ఛాన్స్‌ ఇచ్చి చూడండి... అద్భుతాలు సృష్టిస్తారు. సమాజం మహిళల పాత్రను గుర్తించి అంగీకరించాలి. నేనెప్పుడూ మహిళలను ఎంకరేజ్‌ చేస్తాను. వాళ్లు ఏం చేసినా బాగా చేస్తారు. లైఫ్‌లో ఏం చేయాలనుకుంటున్నారనే ఛాయిస్‌ వాళ్లకే ఇవ్వాలి.

మరి... ఈ సినిమాలో రితికా సింగ్‌ను కాలితో తన్నే సీన్‌ చేయడానికి ఇబ్బంది పడలేదా?
వెంకీ: ఆ సీన్‌ కుదరదంటే కుదరదని సుధతో అన్నాను. కానీ, చేయకపోతే సీన్‌ పేలవంగా ఉంటుందని చెప్పింది.
(మధ్యలో సుధ కల్పించుకుంటూ)... మామూలుగా వెంకీ ఏ సీన్‌ అయినా సింగిల్‌ టేక్‌లో చేసేస్తారు. కానీ, ఈ సీన్‌కి టేక్స్‌ మీద టేక్స్‌ తీసుకున్నారు. రితిక ఏమో ‘కమాన్‌ హిట్‌ మి’ అన్నప్పటికీ వెంకీ చేయడానికి ఇష్టపడలేదు. చివరికి ఎలాగో ఒప్పించాం. ఇష్టం లేకుండా చేసిన సీన్‌ కాబట్టి, ఎక్కువ టేక్స్‌ తీసుకున్నారు.

‘గురు’ పాత్రకు వెంకీయే కరెక్ట్‌ అని ఎలా ఊహించారు?
సుధ: నిజం చెప్పాలంటే... నేను గుడ్‌ యాక్టర్స్‌తోనే పని చేయడానికి ఇష్టపడతాను. అలాంటివాళ్లు పక్కన ఉంటే నాకు ఎనర్జీ వస్తుంది. బ్యాడ్‌ యాక్టర్స్‌ను భరించలేను. వెంకీ జీనియస్‌ యాక్టర్‌. ‘క్షణ క్షణం’లో వెంకీ యాక్టింగ్‌ ఇష్టం. ఆయనకు ఓ క్యారెక్టర్‌ ఇస్తే అందులోంచి అటూ ఇటూ వెళ్లరు. ఆ పాత్రకు ఏం చేయాలో అదే చేస్తారు. ఆయన సినిమాలు చూసి, నేను తెలుసుకున్న విషయం అది. అందుకే ‘గురు’గా ఆయనే కరెక్ట్‌ అనుకున్నా. ఒకవేళ వెంకీ చేయకపోతే ‘గురు’ వచ్చేది కాదు.

తమిళంలో ఈ సినిమాని మాధవన్‌తో తీశారు. తెలుగులో వెంకీ పెద్ద స్టార్‌ కాబట్టి, మీకేమైనా భయం అనిపించిందా?
సుధ: మొదట ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరిస్తే... సగం యుద్ధం గెలిచినట్టే అనుకున్నా. కథకు తగ్గట్టు ఎలా నటించాలో తర్వాత ఎలానూ చెబుతారు. అఫ్‌కోర్స్‌... భయం ఉంటుంది. కొత్త వ్యక్తిని ఎవర్ని కలిసినా నాలో భయం ఉంటుంది. అయితే సినిమా బాగా రావాలనే స్వార్థమే... ఆ భయాన్ని తీసి పక్కన పడేసింది.

(వెంకటేశ్‌ మధ్యలో కల్పించుకుంటూ) మొదట్లో కొన్ని నా దగ్గర చెప్పలేదు. వారం తర్వాత ఓ రోజు ‘మీరు ఫుల్‌ స్క్రిప్ట్‌ చదవాలి. అది కూడా షూటింగ్‌కి ముందే మొత్తం చదవాలి. పక్కన ఆర్టిస్టులుంటారు. వాళ్లతో కలసి రిహార్సల్స్‌ చేయాలి’ అంది. సరే చూద్దామన్నా. చాలాసార్లు రిహార్సల్స్‌ చేయాలని అడిగింది. నేనెప్పుడూ అలా చేయలేదు. దాంతో ఇబ్బందిగా ఉంటుందేమో అనిపించింది. ఇంపార్టెంట్‌ సీన్స్‌ ఇంటికి తీసుకువెళ్లి ప్రిపేర్‌ కావడం కామనే. కానీ, నా లైఫ్‌లో ఫుల్‌ స్క్రిప్ట్‌ ఎప్పుడూ చదవలేదు. అసలు నాకు తెలుగు రాదు. ఫుల్‌ స్క్రిప్ట్‌ చదవడం, రిహార్సల్స్‌.. ఇదంతా ఎప్పటికి పూర్తవుతుందని సుధని అడిగితే... ‘ఏం ఫర్వాలేదు’ అంది. ఇంటికి వెళ్లి బాగా ఆలోచించాను. ఎక్కడో కొడుతుందేమో, డేంజర్‌ అవుతుందేమో అనుకున్నా. కానీ, ఒక్కసారి స్క్రిప్ట్‌ చదవి, షూటింగ్‌ మొదలు పెట్టాక ఎంతో ఎనర్జీ వచ్చింది. ఏదో ఐఏయస్, ఐపీయస్‌ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్‌ అయినట్లు అనిపించింది.

భల్లాలదేవ (వెంకీ అన్న సురేశ్‌బాబు కొడుకు)తో మీ రిలేషన్‌ గురించి?
వెంకీ: తను నా కొడుకులాంటివాడే. ‘సాలా ఖడూస్‌’ గురించి చెప్పి, ‘ఈ సినిమా చూడు’ అన్నాడు. అంతకుముందే సుధ నాకు ఈ సినిమా గురించి చెప్పింది. ‘నేను కూడా ఇదే చేయాలనుకుంటున్నార్రా’ అన్నాను. అన్నయ్య, నేను బాగా డిస్కస్‌ చేసుకుంటాం. రానా కూడా తన సినిమాల గురించి చెబుతుంటాడు.

సుధ: 2010లో ఇదే రూమ్‌లో రానాకి ‘గురు’ కథ చెప్పాను. రానా యంగ్‌ కాబట్టి, కొంచెం లవ్, రొమాన్స్‌ యాడ్‌ చేశాను. స్క్రిప్ట్‌ నచ్చినప్పటికీ అప్పట్లో రానాకి ఈ సినిమా చేయడం కుదరలేదు. తర్వాత రెండేళ్లకు వెంకీకి ఈ కథ చెప్పా. నా ఫ్రెండ్‌ ఒకరు రమణ మహర్షి డైరీ ప్రతి ఏడాదీ ఇస్తుంటారు. ప్రతి రోజూ ఆ డైరీలో రాసుకుంటాను. వెంకీ దగ్గర కథ చెప్పడానికి వెళ్లినప్పుడు ఆ డైరీ తీసుకెళ్లాను. రమణ మహర్షి డైరీ ఏంటి? అని అడిగారాయన. ఏదో శక్తి నడిపించినట్లుగానే ముందు రానా దగ్గరకు వచ్చిన కథ... ఆ తర్వాత మూడేళ్లకు వెంకీకి కుదరడం భలే గమ్మత్తుగా అనిపించింది.

సుధ: సాధారణంగా వెంకీ ఉదయం తొమ్మిది పదింటికి షూటింగ్‌ చేయడానికి ఇష్టపడతారు. మేము 7 గంటలకే రమ్మన్నాం. ఆయన 6.45కే వచ్చి... ‘‘నేను ఎలా చేస్తే బాగుంటుంది? నువ్వేం అనుకుంటున్నావ్‌?’ అనడిగేవారు. యాక్టర్‌ అలా రెస్పాండ్‌ కాకపోతే డైరెక్టర్‌ ఏమీ చేయలేరు.

హిందీ హీరోల్లా తెలుగు హీరోలు ప్రయోగాలు చేయరంటారు. ‘దంగల్‌’కి ఆమిర్‌ఖాన్‌ పొట్ట పెంచినట్లుగా ఏదైనా క్యారెక్టర్‌ డిమాండ్‌ చేస్తే మీరూ చేస్తారా?
వెంకీ: అలాంటి కథ వస్తే తప్పకుండా చేస్తాను. రైటర్స్, డైరెక్టర్స్‌ రావాలి. ఒకప్పుడు నేను చేసిన సినిమాలు తీసుకోండి. ‘చంటి’ ఒప్పుకున్నప్పుడు, ‘నువ్వేమో మ్యాన్లీగా ఉంటావ్‌. అమాయకుడి పాత్ర వర్కవుట్‌ కాదని చాలామంది అనుకుంటున్నార్రా. జాగ్రత్త’ అన్నారు నాన్నగారు. ఇండస్ట్రీలో చాలామంది వద్దన్నారు. నాకు సబ్జెక్ట్‌ నచ్చింది. అప్పట్లో అదో ప్రయోగం. అలాగే, ‘శ్రీను’ సినిమా కూడా. నాకు సబ్జెక్ట్‌ ముఖ్యం. డిఫరెంట్‌గా యాక్ట్‌ చేసే స్కోప్‌ ఉందనిపిస్తే కచ్చితంగా ఒప్పుకుంటా. ‘గురు’ విషయానికొస్తే... అందరూ ప్రశంసిస్తున్నారు. చిరంజీవిగారైతే ‘హ్యాట్సాఫ్‌ టు యు. ఆ లుక్, నాన్నలాంటి వయసు అనే డైలాగ్‌ ఒప్పుకోవడం... మామూలు విషయం కాదు. చాలా రిస్క్‌. నువ్వు ఎప్పుడూ రిస్క్‌ తీసుకుంటావ్‌’ అన్నారు. మెగాస్టార్‌కి నా ఛాయిస్‌ నచ్చింది. హీరోగా నేను తీసుకున్న రిస్క్‌ని ఆయన చాలా అభినందించారు.

సుధ: యాక్చువల్లీ చిరంజీవిగారి వైఫ్‌ (సురేఖ) ఈ సినిమా చూడ్డానికి పెద్ద ఆసక్తి చూపలేదు. ‘బాక్సింగ్‌ మూవీ కదా, ఏముంటుందిలే’ అనుకున్నారట. సినిమా చూశాక... ‘ఇది బాక్సింగ్‌ మూవీ కాదు.. మంచి ఎమోషన్‌’ అంటూ ఏడ్చారు. ఆమెకు అంత బాగా నచ్చింది.

వెంకీగారూ! ఆ మధ్య దాదాపు ఒకే రకం సినిమాలు చేశారు. అప్పుడు బోర్‌ అనిపించలేదా?
వెంకీ: నాకైతే ‘ఇక చాలు.. రిటైర్‌ అయిపోతే బెస్ట్‌’ అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. చేసే నాకూ, చూసే ప్రేక్షకులకూ విసుగు అనిపించే సినిమాలు చేయడం ఎందుకు? కొన్ని సినిమాలు ఆడినా, కిక్‌ అనిపించలేదు. నన్ను నేను డిఫరెంట్‌గా చూసుకోవాలని ఉంది. కొత్తగా ఏదైనా చేయాలి. అలా కుదరనప్పుడు ‘ఇక చాలు’ అనుకుంటుంటాను. అలా అనుకున్న ప్రతిసారీ మంచి ఛాన్స్‌ వస్తుంటుంది. ఆ సినిమా భలే కిక్‌ ఇస్తుంది. ఆ ఉత్సాహంతో మళ్లీ చేస్తుంటా.

30 ఏళ్లుగా సినిమాలు చేస్తూ, రిటైర్‌ అవ్వడం అంత ఈజీయా?
వెంకీ: మంచి సినిమాలు రానప్పుడు ఏం చేస్తాం? లైఫ్‌ ఎలా వెళితే అలా తీసుకోవాలి. పెద్దగా ఆలోచించకూడదు.

అంటే.. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలను ఇష్టపడడంలేదా?
వెంకీ: కమర్షియల్‌ అంటే ఏంటి? ఇప్పుడు ‘గురు’ కమర్షియల్‌ సినిమానే. క్లాస్, మాస్, కమర్షియల్‌ అనేది ఎప్పుడో పోయింది. కథలో ఉన్న ఎమోషన్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయితే అది కమర్షియల్‌ సినిమానే.

ఓకే... మీ రియల్‌ లైఫ్‌ గురువుల గురించి తెలుసుకోవాలని ఉంది!
వెంకీ: మైసూరులో ఒక గురువుగారు ఉండేవారు. ఆయన తిరిగి రాని లోకాలకు వెళ్లారు. హిమాలయాలవీ తిరిగాను కదా. రామకృష్ణ పరమ హంస, వివేకానంద, పరమహంస యోగానంద... వీళ్ల టీచింగ్స్‌ చదివి, చాలా ఇన్‌స్పైర్‌ అయ్యాను. రమణ మహర్షి టీచింగ్స్‌ చదవడం మొదలుపెట్టాక, అవి నాకు పర్‌ఫెక్ట్‌ అనిపించాయి. మహమ్మద్‌ ప్రవక్త, రూమీ, జీసెస్‌ల టీచింగ్స్‌లా ఆయనవి కూడా ఉంటాయి. దేహానికి మించినది ఏదో ఉందని తెలుసుకున్నాను. భూమి మీద పుట్టాం కాబట్టి, ఈ ఫిజికల్‌ డ్రామా చేయాల్సిందే. కర్మానుసారం అన్నీ జరుగుతుంటాయి. శ్రీరాముడు–శ్రీకృష్ణుడు రాజ్యాలు ఏలారు. సేమ్‌ టైమ్‌ సత్యం తెలుసుకున్నారు. మనిషి ఈ రెండూ చేయాలి. ఇప్పుడు వాళ్ల దారిలో వెళుతూ నేను చేస్తున్నది అదే. శరీరీం–ఆత్మ... ఈ రెండింటి బాధ్యతలనూ బ్యాలెన్స్‌ చేసుకుంటూ వెళ్లాలి.

మీ గురువు సుధగారు?
సుధ: సాయిబాబా. ప్రతి రోజూ ఆయన పుస్తకంలో ఒక పేజీ చదువుతాను. డిస్ట్రబ్డ్‌గా ఉన్నప్పుడు పుస్తకం తెరిస్తే, సమాధానం దొరుకుతుంది. నా విషయంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఏదో పవర్‌ ఉందని నమ్ముతాను.

క్రికెట్‌ బాగా ఆడతారు కదా! ఈ మధ్య ఎప్పుడు ఆడారు?
వెంకీ: ఈ మధ్య ఎక్కువగా చూడటమే. ఆడటంలేదు. స్పోర్ట్స్‌ ఇంజ్యూరీస్‌ తగ్గడానికి చాలా టైమ్‌ పడుతోంది. దానివల్ల షూటింగ్‌కి ఇబ్బందవుతుందేమో అని పెద్దగా ఆడటంలేదు. ఈ 5న జరగబోయే ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాను. ఇంకొన్ని రోజులు నేను ఈ మ్యాచ్‌లు చూస్తూ, బిజీగా ఉంటా. ఆ తర్వాతే సినిమాలు.

సినిమాల్లో సెంచురీ కొట్టేస్తారా?
వెంకీ: అది నా చేతుల్లో లేదు. చేసే పని సిన్సియర్‌గా చేయాలి. ఇప్పుడు ‘గురు’ చేశాను కాబట్టి, నాకోసం కొత్త స్క్రిప్ట్స్‌ రెడీ చేస్తారని నమ్ముతున్నాను.

శారీరకంగా, మానసికంగా బలహీనమైనప్పుడు..?
వెంకీ: ‘వేకప్‌ స్టేట్‌’, ‘స్లీపింగ్‌ స్టేట్‌’ అని రెండు ఉంటాయి. మెలకువ దశలో ఉన్నప్పుడు జరిగినవన్నీ నిద్ర స్థితిలో మరచిపోతాం. ఉదాహరణకు, కోట్లకు కోట్లు అప్పు ఉందనుకోండి. నిద్రపోయేటప్పుడు అది గుర్తుకు రాదు కదా. అలాగే పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు, మెలకువగా ఉన్నంత వరకూ ఆందోళనపడతాం. నిద్రపోయాక మరచిపోతాం. వేకప్‌ స్టేట్‌లో జరగాల్సిన డ్రామా జరుగుతూ ఉంటుంది. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కాకపోతే ‘వేకప్‌ స్టేట్‌’, ‘స్లీపింగ్‌ స్టేట్‌’ గురించి అర్థం చేసుకున్నవాళ్లు వీటికి తక్కువ రియాక్ట్‌ అవుతారు. మనిషిగా పుట్టాం కాబట్టి, సమస్యలు తప్పవు. పుట్టేటప్పుడు మన బ్యాగేజ్‌లో ఏం రాసి ఉందో అవన్నీ అనుభవించాల్సిందే.  మనం బలంగా ఉండాలంటే తప్పించలేని వాటి గురించి ఎక్కువగా ఆందోళన పడటం అనసవరం.

అన్నీ ఉన్న మీలాంటివాళ్లు ఎన్నైనా చెబుతారు..
వెంకీ: (నవ్వుతూ).. ఏదైనా రోగం వస్తే అన్నీ ఉన్నోళ్లు డబ్బూ పేరూ... ఏమీ వద్దు. ఆ రోగం పోతే చాలనుకుంటారు కదా. అసలు మనం రేపు చచ్చిపోతాం అనుకుంటే, ప్రపంచం గురించి తక్కువ ఆలోచిస్తాం. రేపు మనం చచ్చిపోతాం అనుకుని బతికితే ఇవాళ వర్రీ అవ్వం. ఎందుకంటే రేపు అనేది ఉండదు. ఇదిగో నేనిప్పుడు మీతో మాట్లాడుతున్నాను. బిస్కెట్స్‌ తిన్నాను, మంచినీళ్లు తాగాను, టీ తాగాను. ఈ క్షణం వరకూ అంతా బాగానే ఉంది కదా. రేపటి గురించి ఎందుకు అనుకుంటే,æలైఫ్‌ లీడ్‌ చేయడం ఈజీ.

మీకు ఎక్కువ హిట్లు ఉన్నాయి. అయినప్పటికీ అభిమానులు పెద్దగా హడావిడి చేసినట్లు కనిపించరెందుకు?
వెంకీ: ఫ్యాన్స్‌ వాళ్ల కుటుంబాలతో గడపాలని కోరుకుంటాను. అది రైటో రాంగో తెలియదు కానీ, నేను బాగా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు వాళ్లు చాలా హంగామా చేయాలనుకున్నారు. నేను ఒప్పుకునేవాణ్ణి కాదు. ‘మీ ఫ్యామిలీస్‌ చూసుకోండి’ అనేవాణ్ణి. ఫ్యాన్స్‌ నిరుత్సాహపడేవాళ్లు. ఎలాంటి హడావిడీ చేసేవాళ్లు కాదు. అది అలా కంటిన్యూ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే... నేను రికార్డ్స్‌ గురించి అంత పర్టిక్యులర్‌గా ఎప్పుడూ ఆలోచించను.  

మీ ఫ్యాన్స్‌లో ఎక్కువమంది ఆడవాళ్లు ఉన్నారు కదా!
వెంకీ: అది కరెక్టే. ఫస్ట్‌ డే వాళ్లు సినిమా చూడ్డానికి రారు. అందరూ ఇంట్లో ఉంటారు. ప్లస్‌ హంగామా, హడావిడి చేయరు (నవ్వుతూ). ఒక యాక్టర్‌ తను చేసే సినిమాల పట్ల తను హ్యాపీగా ఉండాలి.
సుధ: మొన్న పబ్లిక్‌ థియేటర్‌కి వెళితే, ఒక ప్రెగ్నెంట్‌ లేడీ సినిమా చూడ్డానికి వచ్చింది. కొడుకు పుడితే ‘జూనియర్‌ వెంకటేశ్‌’ అని పేరు పెట్టుకుంటా అంది. ఇంకా చాలామంది లేడీస్‌ సినిమా చూడ్డానికి వచ్చారు. వాళ్లు మాట్లాడుతుంటే, వెంకీకి ఎంత మంచి ఫీమేల్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో అర్థమైంది.

నెక్ట్స్‌ మీ ప్రాజెక్ట్స్‌ గురించి?
వెంకీ: ఇప్పుడు నేను హాలిడే మూడ్‌లో ఉన్నాను. సురేశ్‌ ఏవేవో స్రిప్ట్స్‌ వింటున్నాడు. నేను కొన్నాళ్లు రిలాక్స్‌ అయ్యాక వాటి మీద దృష్టి పెడతా.
సుధ: ఇంకా ఏమీ అనుకోలేదు. అవకాశాలైతే ఉన్నాయి.
– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement