హస్నా జరూరీ హై | Hasna Zaroori Hai | Sakshi
Sakshi News home page

హస్నా జరూరీ హై

Published Thu, Jan 8 2015 11:58 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

హస్నా జరూరీ హై - Sakshi

హస్నా జరూరీ హై

కనబడుట లేదు
 రూపం: తెల్లగా అందంగా ఉంటుంది వయసు: తగ్గిస్తుంది
 బరువు: దించుతుంది వెడల్పు: కనీసం మూడు అంగుళా
 తత్వం: తియ్యగా చల్లగా ఉంటుంది పేరు: చిరునవ్వు
 పై లక్షణాలున్న చిరునవ్వు హైదరాబాద్ నగరంలో కనబడుట లేదు. నగరంలోని ఒత్తిళ్లను తట్టుకోలేక మాయం అయిపోయింది. కనిపించిన వారు వెంటనే పెదాలపైకి చేర్చుకోగలరు.

 
నవ్వు అందంగా ఉంటుంది. కావాలంటే అద్దంలోకి నవ్వి చూడండి. నవ్వు తెల్లగా ఉంటుంది- నవ్వితే అది తేటతెల్లం అవుతుంది. నవ్వు తియ్యగా ఉంటుంది- రుచి చూడాలంటే నవ్వాల్సిందే. ఆ నవ్వుకి ఎవరైనా సరే తియ్యగా మాట్లాడాల్సిందే. నవ్వు చల్లగానూ, వెచ్చగానూ ఉంటుంది  ఆశ్చర్యంగా..! కోపంలో చల్లగా, కష్టాల్లో వెచ్చగా ఉంటుంది. ఇది రాస్తూ నేనూ నవ్వుతున్నా,  చదువుతూ మీరు ఓ చిరునవ్వేసుకోండి.
 
దరహాస దాతా ! సుఖీభవ..

స్మైల్ ప్లీజ్.. మన మహానగరంలో ఉన్న లక్షలాది బైకుల్లో ఒకానొక బైక్‌పై కనిపించిన క్యాప్షన్ ఇది. ఆ సమయానికి యధాలాపంగా డ్రైవ్ చేస్తున్న నన్ను ఆ వ్యక్తి ప్రశ్నిస్తున్నట్టు అనిపించింది. వెంటనే నా ముఖంపై ఏ ఎక్స్‌ప్రెషన్ ఉందో గమనించాను. కనుబొమ్మలు ముడిపడి, పెదాలు ముడుచుకుని, బుగ్గలు ఒకింత బిగుసుకుని.. సీరియస్‌గా ఉన్నానేమో అనిపించింది. ఇలా ఉన్నానేంటబ్బా అనుకున్న మరు క్షణంలో ఎక్స్‌ప్రెషన్ మారిపోయింది. మనసున తొణికిన చిరునవ్వు పెదాలపైకి వచ్చేసింది. ముఖం విచ్చుకుంది. ఆ అజ్ఞాత బైకు వీరుడికి నా థ్యాంక్స్. ఇలా రోజులో కొంత మందికైనా చిరునవ్వు పంచి పెడుతున్నందుకు. నవ్వుదాతా సుఖీభవ.
 
ఏడ తానున్నాదో నవ్వు..

నేను రేడియో జాకీగా పని చేసిన కొద్ది కాలంలో రోజూ ఉదయాన్నే చిరునవ్వుతో ఆఫీస్ చేరేదాన్ని. ఆ నవ్వు ఆ రోజంతా నన్ను ఫ్రెష్‌గా ఉంచేది. ఓ రోజు షోలో పంచుకున్న ఈ విషయానికి ఎందరో కనక్ట్ అయ్యారు. ప్రస్తుతం.. బస్‌స్టాప్‌లో అలసిన ముఖాలు, ఫుట్‌పాత్‌పై బరువైన పేదరికం, ట్రాఫిక్‌లో చిరాగ్గా చోదకులు.. చిరునవ్వు జాడ కనిపించడం లేదు. ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్న చోట చిరునవ్వు చిందేయడం తేలికే. కానీ ఒక్కరే ఉన్న చోట చిరునవ్వు చిరునామా లేదు. పోనీ ఒక్కరే తమలో తాము నవ్వుకుంటే సచ్చిదానందం అనుకోరు సరికదా.. మెంటల్ కేస్ అని ఫిక్స్ అవుతారు. మనలో మనం అటుంచండి, పక్క వ్యక్తిని చూసి కూడా నవ్వకపోతే ఏమనాలి.
 
నవ్వులు రువ్వే నవ్వమ్మా..

తెలియని వారిని చూసి నవ్వితే ఏమనుకుంటారో అని నవ్వం. తెలిసిన వారిని చూసి నవ్వితే ఏం అడిగేస్తారో అని భయం. ఇలా నవ్వును దాచేస్తే ఏలా. నవ్వితే తిరిగి నవ్వే సమాధానంగా వస్తుంది. చిరునవ్వులో మ్యాజిక్ ఉంది. నవ్వితే మీరు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తారని రీసెర్చ్‌లు ఘోషిస్తున్నాయి. నేను మా అమ్మగారు కొన్నేళ్ల కిందట ఓ ఎక్స్‌పరిమెంట్ చేశాం. పర్సనల్
 ఇష్యూస్‌లో కోర్టుకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం అంతా బరువుగా ఉండేది. దీనికి చెక్ పెడుతూ మా అమ్మగారు నవ్వులు పంచే ఏంజిల్ అవతారం ఎత్తారు. నేనూ ఓ నవ్వు కలిపాను. ఎవరిని చూసినా కళ్లలో మెరుపుతో, చిరునవ్వుతో పలకరించేవాళ్లం. ఆ రకంగా కోర్టు  వాతావరణాన్ని మార్చేశాం.
 
నవ్వే మంత్రమూ..

‘రానీ రానీ కష్టాల్ కోపాల్ తాపాల్’ అన్న మహాకవి ‘హాసం లాసం’ కూడా రానీ అన్నాడు. ఎంతటి బరువైన సమస్యకైనా ఎంతటి డిప్రెషన్‌కు అయినా చిరునవ్వే మంత్రం అని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఒక చిరునవ్వు మెదడులోని సెరొటోనిన్ అనే కెమికల్‌ని విడుదల చేస్తుందట. దాని వల్ల రిలాక్స్ అవుతామట. పెద్దగా హాయిగా మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల ఎండోర్ఫిన్స్ విడుదలై ఉత్తేజపరుస్తాయట. మరింక ఆలస్యం దేనికి.. ఖర్చు పెట్టక్కర్లేకుండా రిఫ్రెష్ అవ్వడానికి చిరునవ్వే వరం. పాశ్యాత్య దేశాల్లో ఎవరైనా ఎదురుపడితే చాలు తెలిసినా, తెలియకపోయినా పలకరింపుగా ఓ చిరునవ్వు విసురుతూ వెళ్లిపోతుంటారు. వాళ్లు మన నగరానికి వస్తే అయోమయానికి గురి కావడం ఖాయం.
 
నగరం నవ్వుల వనం..

ఉరుకుల పరుగుల మన నగరానికి నవ్వడం నేర్పించాలి. అందుకు పెద్ద ప్రణాళిక ఏమీ అక్కర్లేదు. జస్ట్ మీరొక్కరు నవ్వండి చాలు అంతే చిరునవ్వు పాకిపోతుంది. బ్రెజిల్‌లోని నిటెరోయ్ అనే  నగరాన్ని ‘ద స్మైలింగ్ సిటీ’ అని ముద్దుగా పిలుస్తారు. ఆ నగరాన్ని ఎప్పటికైనా చూడాలని నాకు కోరిక. ఆ సిటీ తిరిగి నవ్వుతుందట అంటే, అక్కడి జనాభా అంతా సంతోషంగా ఉన్నట్టే కదా. మన హైదరాబాద్‌ను కూడా భారతదేశానికి స్మైల్ క్యాపిటల్‌గా మారుద్దాం. కష్టంలో ఉంటే చిరునవ్వు కష్టం అంటారా, ఒక్కసారి నవ్వి చూడండి మీ కష్టం తేలికైపోతుంది. కష్టాల్, నష్టాల్, ఉరుకుల్, పరుగుల్ ఎన్ని ఉన్నా కూడా మనం పూయిద్దాం నవ్వుల్ పువ్వుల్. మిషన్ ‘హైదరాబాద్ స్మైల్’ మీరు నవ్వండి పక్క వ్యక్తినీ నవ్వించండి. స్మైల్ ప్లీజ్.
 
 facebook.com/anchorjhansi
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement