కిడ్స్ కా ఖలేజా
తెగిపడ్డ నింగి చుక్కలైనా.. తెగువ నేర్చి తరగని కీర్తి సంపాదిస్తున్నారు వాళ్లు. చెత్తకుండీల దగ్గర అనాథలైన బతుకులు.. బాలసదనం ఆసరాతో భవిష్యత్తుపై భరోసా పొందుతున్నాయి. కలలు కనే కన్నవారు కాదనుకున్నా..! అభాగ్యులం మేం కాదు.. మా విజయాలకు మురిసే భాగ్యం వాళ్లు కోల్పోయారంటున్నారు ఆ ఆడపిల్లలు.
అన్ని విద్యల్లో ఆరితేరుతున్నారు. ఆత్మరక్షణ కోసం కుంగ్‌ఫూ నేర్చుకుంటున్నారు.. లలిత కళల్లో రాణిస్తున్నారు. ప్రోత్సహించే పేగుబంధం కరువైనా.. అవార్డులు గెలుచుకుంటున్నారు. నుదిటి రాతను గేలి చేసి గాలికి వదిలేసిన తల్లిదండ్రుల కాఠిన్యాన్ని మరచిపోయి.. అన్నింటా దూసుకుపోతున్న బాలసదనం బంగారు బిడ్డలను సాక్షి సిటీప్లస్ తరఫున స్టంట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ స్టార్ రిపోర్టర్లుగా పలకరించారు.
రామ్: హాయ్ తల్లులూ.. ఎలా ఉన్నారు.
పిల్లలు: హాయ్.. వి ఆర్ ఫైన్.
లక్ష్మణ్: పుట్టినరోజుకు రావడం తప్ప మిమ్మల్నందరినీ ఇలా స్పెషల్‌గా కలుసుకుని ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది.
మౌనిక: మాకూ చాలాహ్యాపీగా ఉంది.
లక్ష్మణ్: ముందుగా కేంద్ర ప్రభుత్వం నుంచి బాలశ్రీ అవార్డులందుకున్న నిహారిక, శాంతిప్రియలతో మొదలుపెడదాం. చెప్పమ్మా నిహారిక.. నీకు ఈ అవార్డు ఎందుకొచ్చింది?
నిహారిక: పెయింటింగ్‌లో వచ్చింది సార్.
లక్ష్మి (బాలసదనం ఇన్‌చార్జ్): నేను చెబుతాను సార్. నిహారిక మా దగ్గరికి వచ్చేసరికి నాలుగు రోజుల పిల్ల. చేతులు వంకరగా ఉన్నాయని తల్లి ఎక్కడో వదిలేసి వెళ్లింది. ముందుగా అలా మా దగ్గరకు వచ్చిన పిల్లలను శిశువిహార్‌లో చేరుస్తాం. తర్వాత చదువుకునే వయసుకు బాలసదన్‌కు వచ్చేస్తారు. అలా వచ్చిన అమ్మాయే నిహారిక.
రామ్: అవునా.. నువ్వు బాలరత్న అవార్డు తీసుకుంటుంటే.. చూసి మురిసే అదృష్టాన్ని పోగొట్టుకుందమ్మా నిన్నుకన్న తల్లి.
లక్ష్మణ్: వైకల్యం ప్రతిభకు అడ్డుకాదని నిహారికను చూసి అందరూ గర్వపడాలి. అన్ని అవయవాలు బాగున్నవారు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలి.
లక్ష్మి: అవును సార్.
లక్ష్మణ్: మీకు అమ్మానాన్న లేరన్న భావన ఎప్పుడూ రానివ్వకండి. చక్కని చదువు, అన్ని రకాల సదుపాయాలు, అద్భుతమైన భవిష్యత్తు.. ఇలా మీకు అన్నీ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే మీరే మరో పది మందికి నీడనివ్వగలరు. మా చిన్నతనంలో ఇలా సాయం చేసేవారు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం.
రామ్: ఇక్కడ ర్యాంక్‌లు, అవార్డులు తెచ్చుకున్న విద్యార్థులతో పాటు కరాటే, కుంగ్‌ఫూ నేర్చుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారని విన్నాం.
లక్ష్మణ్: మీరు ఎప్పటి నుంచి ఇలాంటి విద్యలు నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు?
మధుస్మిత: ఏడాదిగా నేర్చుకుంటున్నాం సార్. మా మాస్టార్ పేరు కళ్యాణ్. మాకు ఉచితంగా నేర్పిస్తున్నారు.
రామ్: అవునా.. ఎక్కడ కళ్యాణ్?
కళ్యాణ్: నేను సర్.
లక్ష్మణ్: నువ్వు చాలా గ్రేటయ్యా.
కళ్యాణ్: నేను దీన్ని ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. డబ్బున్నవారు ఎలాగైనా, ఎక్కడైనా నేర్చుకోగలరు. వీళ్లకు నేర్పిస్తే వీరి జీవితాలకు ఉపయోగపడుతుంది. నాకూ గుర్తింపు ఉంటుంది కదా సార్.
అస్మియ: ఎవరూ ఉన్నా.. లేకున్నా ఆడపిల్లకు రక్షణ కరువైందన్న వార్తలు రోజూ వింటూనే విన్నాం కదా సార్.
లక్ష్మణ్: అస్మియ.. కుంగ్‌ఫూ నేర్చుకోక ముందు, తర్వాత నీలో మార్పు?
అస్మియ: భయం పోయింది సార్. ఎవరైనా దాడి చేస్తే సమర్థంగా ఎదుర్కోగలనన్న నమ్మకం వచ్చింది.
రామ్: ఆత్మరక్షణకు కావాల్సిన శారీరక స్థైర్యం అందరికీ ఉండాల్సిందే. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువ ఉండాలి.
లక్ష్మణ్: మీలో స్కేటింగ్ రాణులు కూడా ఉన్నారట!
లక్ష్మి: అవును సార్. అందరూ ఉన్నారు. సాహసాలు, ఆటలు, పాటలు అన్నిట్లో ఉన్నారు.
రామ్: మార్కుల గురించి చెప్పండి మేడమ్?
లక్ష్మి: గతేడాది పదో తరగతిలో ఇద్దరు విద్యార్థులు 90 శాతం మార్కులు సాధించారు. ఇలా మెరిట్‌తో పాసైనవారిని దాతలు ముందుకొచ్చి చదివిస్తున్నారు. మా దగ్గరున్న చిన్నారుల్లో ఎనిమిది మంది కేంద్రీయ విద్యాలయాల్లో చదువుతున్నారు.
లక్ష్మణ్: వావ్.. చాలా గ్రేట్. అయితే మా పిల్లలు చాలా లక్కీ. చూడండి తల్లులూ మీరు కూడా మంచి మార్కులు తెచ్చుకుంటే ఇలాంటి స్కూల్స్‌లో చదువుకోవచ్చు. అమ్మానాన్న అందరూ ఉన్న పిల్లలు కూడా ఇలాంటి స్కూళ్ల గడప తొక్కలేకపోతున్నారు.
రామ్: చదువులైపోయాక వీరి భవిష్యత్తు ఏంటి మేడమ్?
లక్ష్మి: ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలొచ్చి సెటిల్ అయినవారు ఉన్నారు. విద్యార్హతకు తగ్గట్టు ప్రభుత్వమే ఉద్యోగం ఇస్తుంది. ఇల్లు కూడా ఇస్తుంది.
లక్ష్మణ్: ఉద్యోగం తర్వాత?
లక్ష్మి: ఇంకేం ఉంటుంది సార్? పెళ్లి.
రామ్: మేం అప్పుడప్పుడు పేపర్లలో చదువుతుంటాం. చాలా గ్రాండ్‌గా చేస్తారు కదమ్మా !
లక్ష్మి: మా అమ్మాయిల పెళ్లిళ్లకు కలెక్టర్లు, కమిషనర్లు, మంత్రులు.. ఇలా ఎందరో వీఐపీలు హాజరవుతారు
(నవ్వుతూ...)
లక్ష్మణ్: మరి సంబంధాలు ఎవరు చూస్తారు?
లక్ష్మి: అమ్మాయి కావాలని అబ్బాయిలే క్యూలో ఉంటున్నారు సార్..
రామ్: ఎందుకు రారు.. మా అమ్మాయిలకు ఏం తక్కువని?
లక్ష్మణ్: లాంఛనాల సంగతేంటి మేడమ్?
లక్ష్మి: ఉద్యోగం, ఇల్లు, ఇంట్లోకి కావాల్సిన వస్తువులూ అన్నీ మేమే ఇస్తాం.
రామ్: కన్నవారు కూడా ఇవ్వలేనన్ని ఇస్తున్నారు. ఇంకా ఏం కావాలి మా తల్లులకు.
లక్ష్మణ్: మహిళా శిశు సంక్షేమ శాఖలో అడుగుపెట్టిన ఏ ఆడపిల్లయినా మామూలు అమ్మాయని అనిపించుకోవద్దు. ఎవరికి వారు దీటుగా ముందుకెళ్లాలి. మీరేంటో నిరూపించుకోవాలి. మీ వెనుక ప్రభుత్వాధికారులున్నారు.. మాలాంటి ప్రజలున్నారు. మీ అందరికీ శుభం కలగాలని కోరుతున్నాను.
రామ్: బాయ్ అమ్మలూ...
థ్యాంక్యూ సార్....