రీడ్ - లీడ్
‘సదా మీ సేవలో..’ అంటూ సాక్షి సిటీప్లస్ ఇచ్చిన పిలుపునకు స్వచ్ఛంద సంస్థల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సిటీ జీన్స్‌లోనే చారిటీ ఉందంటూ.. నగరం వేదికగా తాము నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను పంపిస్తున్నాయి. సదా మీ సేవలో మేము సైతం అంటూ చేతులు కలిపి... తమ చేతల వివరాలను పంచుకుంటున్నాయి. ఈ వరుసలో ప్రచురితమవుతున్న రెండో కథనమిది. చదువు చదువు అంటూ పిల్లల వెంటపడటమే తప్ప చదువుపై, అసలు పుస్తకాలపై వారిలో ఆసక్తిని పెంచడమెలా అని ఆలోచించే వారున్నారా? మేమున్నాం అంటున్నారు జాయ్ ఆఫ్ రీడింగ్ గ్రూప్ సభ్యులు. పిల్లలకు చదువులోని ఇంపును, గ్రహించే శక్తిని అందిస్తూనే.. ఆ ఆసక్తి కొనసాగేందుకు అవసరమైన పుస్తకాలతో లైబ్రరీలను అందిస్తున్న ఈ సంస్థ పరిచయమిది.
పాఠ్యపుస్తకాలే అరకొరగా ఉండే గవర్నమెంటు స్కూళ్లు, ఫీజులకు తప్ప అన్నింటికీ లోటే అన్నట్టుండే ప్రైవేటు స్కూళ్లలో లైబ్రరీ గురించి వెతకడం ఎడారిలో నీటిజాడ కోసం తాపత్రయపడటమే. అలాంటి నిరర్థక యత్నాలు చే యకూడదని తెలిసిన సిటీ యువత తమ వంతుగా జాయ్ ఆఫ్ రీడింగ్‌ను అందించడానికి నడుం క ట్టింది.
బుక్స్ ఫర్ స్కూల్స్..
‘ఏ పనైనా ఆనందంగా చేస్తే అది మనకు ఇష్టంగా మారుతుంది. సహజంగానే అందులో నేర్పు కూడా వస్తుంది. అందుకే చిన్నారులకు చదవడంలోని ఆనందాన్ని నేర్పడానికి ఈ లైబ్రరీల ఏర్పాటు’ అన్నారు మనీష్. మైక్రోసాఫ్ట్‌లో పనిచేసే మనీష్, గగన్, హరిణి, సీఏ టెక్నాలజీస్ ఉద్యోగులైన మొహక్, ప్రవేష్ ఐఎల్‌ఎస్ నుంచి శ్రీధర్‌లతో పాటు అమెరికాలోని ఎన్‌జీవోలో పనిచేస్తున్న మధు ఈ అంశంపై పని చేసేందుకు చేతులు కలిపారు. ఊహ తెలిసిన దగ్గర్నుంచి పరీక్షల భయాన్ని పెంచే పాఠ్యపుస్తకాలే తప్ప పఠనంలోని సంతోషాన్ని అందించే పుస్తకాలు లేకపోవడమే చిన్నారుల్లో పఠనాసక్తి కొరవడటానికి కారణం అంటోంది మనీష్ అండ్ కో. అందుకే రీడింగ్ కల్చర్‌ను పెంచాలనే ఉద్దేశంతో సిటీలో ఏడాదిన్నర క్రితం ఈ ‘జాయ్ ఆఫ్ రీడింగ్’ ఇనీషియేటివ్‌కు శ్రీకారం చుట్టింది. దీనిలో తొలి అడుగుగా కళ్యాణ్‌నగర్‌లో ఒక పూర్తిస్థాయి లైబ్రరీని ప్రారంభించారు. అక్కడ నుంచి దశలవారీగా బస్తీల్లోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు లైబ్రరీ సదుపాయం లేని ప్రైవేటు పాఠశాలల్లో కూడా పరిమిత స్థాయి పుస్తకాలతో లైబ్రరీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టారు. ‘కనీసం 200-300 వరకూ పుస్తకాలు సేకరించి పాఠశాలలకు అందిస్తున్నాం. ఇప్పటికి 9 ప్రభుత్వ, 3 ప్రైవేటు పాఠశాలలకు ఇచ్చాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలకల్లా 100 పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం లక్ష్యం’ అంటూ చెప్పారు మనీష్. ఆన్‌లైన్‌లో సేకరించడంతో పాటు దాతలు ఎవరైనా సరే పుస్తకాలు అందిస్తే వాటిని ఇలా విద్యార్థుల్లో విజ్ఞానం పెంచడానికి ఉపయోగిస్తామని చెబుతున్నారు.
రీడ్ ఫర్ జాయ్...
చదవడంలోని ఆనందం గురించి తెలిస్తేనే కదా చిన్నారులు పుస్తకాలను ఇష్టపడేది? అందుకే కేవలం పుస్తకాలు ఇచ్చేసి ఊరుకోకుండా ఆయా పాఠశాలల్లో వీకెండ్స్‌లో రీడింగ్ సెషన్లు కూడా వీరు నిర్వహిస్తున్నారు.‘టీచ్ ఫర్ ఇండియా మాకు వాలంటీర్ల విషయంలో హెల్ప్ చేస్తోంది. వాలంటీర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుని రీడింగ్ సెషన్ల అనుభవాన్ని ఇంప్రూవ్ చేయడం. వాలంటీర్లు, కార్పొరేట్ కంపెనీల నుంచి అంగీకారం పొందడం. దీర్ఘకాలం నిలిచేలా ఒక బలమైన రీడర్స్ కమ్యూనిటీని నిర్మించడం లక్ష్యాలుగా ముందుకు సాగుతున్నాం’ అని మనీష్ వివరించారు. ఆన్‌లైన్‌లో రిక్వెస్ట్‌లతో పాటుగా వ్యక్తిగతంగా ఇచ్చేవారు, సంస్థల నుంచి బుక్స్ సేకరిస్తున్నారు. ‘స్పందన బాగుంది. ఇప్పటికి 27 వేలకు పైగా బుక్స్ కలెక్ట్ చేశాం’ అని చెప్పారాయన. బుక్స్ ట్రాక్ చేయడానికి, డేటా నిర్వహణ, లైబ్రరీ స్టాక్‌ను తరచుగా రీప్లేస్ చేయడం వంటి లైబ్రరీ నిర్వహణ బాధ్యతలను కూడా ఎంపిక చేసిన వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇక వీరు తొలుత ఏర్పాటు చేసిన కళ్యాణ్‌నగర్ లోని సెంట్రల్ లైబ్రరీని విద్యార్థులు ఉచితంగా వినియోగించుకోవచ్చు.
వాలంటీర్లు కావాలి...
తమకు ఇతరత్రా చేయూత కన్నా పిల్లలకు మంచి విషయాలు చెప్పాలని, పఠనంలోని గొప్పతనాన్ని వివరించాలనే ఆసక్తి కలిగిన వాలంటీర్ల అవసరం ఉందని మనీష్ అంటున్నారు. నెలలోని 3, 4వ శనివారాల్లో రీడింగ్ సెషన్ల నిర్వహణకు స్కూల్స్‌కు వెళ్లిగాని లేదా ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్ ద్వారా కూడా వాలంటీర్లు వర్క్ చేయవచ్చంటున్నారు. ఉదయం 11-మధ్యాహ్నం 1 గంట మధ్య ఇవి ఉంటాయని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు భవిష్యత్తులో ఆర్ఫన్ హోమ్స్, హౌసింగ్ కమ్యూనిటీస్, ఎన్‌జీవోలకు సైతం బుక్స్ అందించాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. వాలంటీర్లు www.joyofreading.org వెబ్‌సైట్ గానీ, 7702711124, 9966655697 ఫోన్ నంబర్లలో గానీ సంప్రదించవచ్చు. info@joyofreading.orgకి అభిప్రాయాలు మెయిల్ చేయొచ్చు.
ప్రెజెంటేషన్: సత్యబాబు
satyasakshi@gmail.com