
వచ్చే నెలలోనే తెలంగాణ!
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్రం త్వరపడుతోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్రం త్వరపడుతోంది. విభజనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్ అధిష్టానంతోపాటు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ప్రజలకు ద్రోహం చేయడానికి సిద్దపడ్డారు. కిరణ్ నాటకం, చంద్రబాబు అండతో రాష్ట్రాన్ని చీల్చడానికి కేంద్రం సన్నద్ధమైంది. సీమాంధ్రుల గోడును కాంగ్రెస్ అధిష్టానం గానీ, కేంద్రం గానీ పట్టించుకునే పరిస్థితిలేదు. తెలుగువారిని వచ్చే నెలలోనే అన్యాయంగా చీల్చడానికి కేంద్రం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ పాల్వాయి గోవర్ధన రెడ్డిలు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. జనవరి 1లోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతుందని జైపాల్‌రెడ్డి చెబితే, జనవరిలో రెండు రాష్ట్రాలు ఏర్పడతాయని పాల్వాయి చెప్పారు. అంతేకాకుండా రాష్ట్ర విభజనకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించినట్లు కూడా పాల్వాయి గోవర్ధన రెడ్డి తెలిపారు.
ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 21న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు బిల్లును కేంద్ర మంత్రివర్గ ఆమోదిస్తుంది. ఈ నెల 18న జరిగే మంత్రుల బృందం (జిఓఎం) సమావేశం చివరిదయ్యే అవకాశం ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఈ సమావేశాలు డిసెంబరు మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పార్లమెంటులో ఆమోదించిన రోజునే బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపుతారు.
ఆ తరువాత ఆ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయం కోసం పంపుతారు. ఈ ప్రక్రియకు రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. శాసనసభను సమావేశపరచడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించినట్లు తెలుస్తోంది. శాసనసభలో బిల్లును ఆమోదించినా, ఆమోదించకపోయినా రాష్ట్రపతి ఆమోదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. రాష్ట్రాన్ని విభజించాలన్న గట్టి పట్టుదలతో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నందున డిసెంబరు నెలాఖరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఖాయం అని తెలుస్తోంది. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర కానుకగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లభించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో సంబరాలు జరుపుకుంటుంటే, సీమాంధ్రలో ఆందోళనలు, అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది.