
ఆ గోల్డెన్ ఛాన్స్ తమన్నాకా? సమంతకా?
సినిమా రంగం అంటేనే అదో వింతైన పోటీ ప్రపంచం. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలగాలంటే అందం, అభినయం ముఖ్యం. ఈ రెండే కాకుండా అదృష్టం కూడా కలసి రావాలని చాలామంది భావిస్తుంటారు. హీరోలకంటే హీరోయిన్లు అధికంగా ఉండే ఈ రంగంలో వారిమధ్యనే పోటీ తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి పోటీ ఇప్పుడు తమన్నా, సమంత మధ్య నెలకొంది. ఈ పోటీలో ఎవరు నెగ్గుతారా అని చిత్రపరిశ్రమలో పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తెలుగు, తమిళ, హిందీ భాషల చిత్రాలలో నటిస్తూ తమన్నా మంచి ఫామ్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలుగులో ఆగడు, బాహుబలి, హిందీలో ఇట్స్ ఎంటర్‌టైన్మెంట్, హమ్ షకల్స్, నో ఎంట్రీ మై ఎంట్రీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా బిజీగా ఉన్న ఈ పాలపిల్లకు మళయాళం, కన్నడంలో కూడా అవకాశాలు వస్తున్నాయి.
ఏ మాయ చేశావె చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన సమంత తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు,అత్తారింటికి దారేది, రామయ్యావస్తావయ్యా వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలలో నటించింది. తమిళంలో కూడా అదే రేంజ్ చిత్రాలలో నటించింది.
ఇంతకీ అసలు కథేంటంటే సూపర్ స్టార్ అజిత్తో కలసి నటించాలని చాలామంది హీరోయిన్లు ఆశపడుతుంటారు. అజిత్తో కలిసి నటించే హీరోయిన్కి కోలీవుడ్లో మంచి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం అజిత్ శివ అనే కొత్త డైరెక్టర్ నిర్మించే చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. అయితే ఈ చిత్రంలో అజిత్కు జంటగా నటించే హీరోయిన్ను ఇంకా ఎంపిక చేయలేదు. ఎవరిని ఎంపిక చేయాలా? అని ఆ చిత్ర నిర్మాతలు, దర్శకుడు, హీరో అందరూ తెగ ఆలోచిస్తున్నారు. వీరం సినిమాలో అందాల ముద్దుగుమ్మ తమన్నా అజిత్తో జతకట్టి హిట్ కొట్టింది. దాంతో కొందరి చూపు ఆమెపై పడింది. తమన్నా అయితే బెటర్ అని భావిస్తున్నారు.
ఈ చిత్రం హీరోయిన్ ఎంపిక విషయంలో తమన్నాకు పోటీగా సమంత నిలిచింది. టాలీవుడ్లో వరుస హిట్లతో దూసుకుపోతోన్న ఈ బ్యూటీకి కోలీవుడ్లో కూడా ఫుల్ క్రేజ్ ఉంది. అందుకే సమంతను ఓకే చేస్తే ఎలా ఉంటుందా? అన్న ఆలోచనలో ఆ చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. మరి వీరిద్దరిలో ఆ గోల్డెన్ ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో వేచిచూడాలి. ఇప్పటికే ఒకసారి తమన్నా అజిత్తో నటించినందున, ఈసారి సమంతకే అవకాశం దక్కుతుందని కోలివుడ్లో పలువురు భావిస్తున్నారు.