ఫ్యాషన్‌కే గురువు
విజయం
కొందరు నేర్పితే నేర్చుకుంటారు. కానీ కొందరికి ఎవరూ ఏదీ నేర్పాల్సిన పని లేదు. వాళ్లకి వాళ్లే గురువులు. వాళ్లకి వాళ్లే మార్గదర్శకులు. అనామిక ఖన్నా కూడా అంతే. ఆమెకి గురువులెవరూ లేరు. కానీ ఇప్పుడు ఎందరికో ఆమే గురువు అయ్యింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రతో ముందుకు దూసుకుపోతోంది.
ఏదైనా చేయాలన్న తపన మనిషిని ఎంత ఎత్తుకైనా తీసుకెళ్తుంది. ఏదో ఒకటి సాధించాలన్న కసి, దేనినైనా సాధ్యమయ్యేలా చేస్తుంది. అందుకే ఏకలవ్యుడు అంత గొప్ప విలుకాడు అయ్యాడు. అనామిక ఖన్నా ప్రపంచ ప్రఖ్యాతి ఫ్యాషన్ డిజైనర్ అయ్యింది.
కోల్‌కతాలో, 1977లో పుట్టింది అనామిక. ఊహ తెలియగానే ఆమెకు కళలతో పరిచయం అయ్యింది. తల్లి, ఇద్దరు అక్కలు కూడా చిత్రకారిణులే. దాంతో చిన్న వయసులోనే కుంచె పట్టింది అనామిక. ఆ రంగులు ఆమెను ఏవేవో లోకాల్లోకి తీసుకెళ్లేవి. ఆ చిత్రాలు ఆమెకు ఏవో చిత్రమైన ఆలోచనలు రేకెత్తించేవి. రంగుల కలబోతలో కొత్త కొత్త ప్రయోగాలు చేసేది. అరె, ఈ రంగులో నాకో డ్రెస్ ఉంటే బాగుండేదే అనుకునేది. వెంటనే కాగితమ్మీద ఓ అందమైన అమ్మాయి బొమ్మ సిద్ధం. దానికి తనకు నచ్చిన డ్రెస్ వేసింది. రంగులు అద్దేది. చూసుకుని మురిసిపోయింది. ఇరవయ్యేళ్ల తరువాత వాటిని చూసి ప్రపంచమే మురిసిపోతుందని ఆమెకు తెలీదు. అసలు తాను చేసేది ఫ్యాషన్ డిజైనింగ్ అన్న విషయమే అప్పటికామెకు తెలీదు.
మరీ డబ్బున్న కుటుంబమేమీ కాదు అనామికది. అలా అని కష్టాలు పడుతూ కూడా పెరగలేదు. అయితే ఆడపిల్లలకు ఉండే అన్ని హద్దులూ ఉన్నాయి.
అదృష్టంకొద్దీ ఆమె ఆశకు ఏదీ అవరోధం కాలేదు. అసలు తనకు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని ఉందన్న విషయమే అనామిక ఎవరికీ చెప్పలేదు. ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోవాలని కూడా అనుకోలేదు. తనకు తానుగా కొత్త కొత్త డిజైన్లను కాగితాల మీద సృష్టించేది. తాను కొత్త బట్టలు తీసుకున్నప్పుడల్లా, తన డ్రెస్ తానే డిజైన్ చేసి కుట్టించుకునేది. వాటిని చూసినవాళ్లు ‘భలే ఉందే’ అంటే చాలు... అంతర్జాతీయ డిజైనర్ అయిపోయినంత సంబరపడిపోయేది.
మౌత్ పబ్లిసిటీని మించినదేదీ లేదు కదా! ఒక్కసారి ఒక విషయం గురించి తెలిస్తే... అది మాటల్లో మెల్లమెల్లగా పాకి, అందరికీ తెలిసిపోతుంది. అనామిక దుస్తుల డిజైనింగ్ గురించి కూడా అందరికీ తెలిసిపోయింది. చాలామంది ఆమె దగ్గర సలహాలు తీసుకునేవారు. తమకు ఒక్క డ్రెస్ డిజైన్ చేసి పెట్టమని ఆమె దగ్గరకు వస్తూండేవారు. దాంతో తనమీద తనకు నమ్మకం పెరిగింది అనామికకి. తన చేతిజోరును పెంచింది. కుంచెకు మరింత పని చెప్పింది. రంగులతో ఆడుకోవడం మొదలుపెట్టింది.
విజయం వైపు పయనం...
లక్ష్యం ఎంత బలమైనదైతే, దాన్ని సాధించడం అంత కష్టమవుతుంది. కాకపోతే కృషి చేసే సత్తా ఉన్నవారికి, కష్టాన్ని ఇష్టంగా స్వీకరించేవారికి అది పెద్ద పని కాదు. ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేయాలన్న తనప అనామికతో అడుగులు వడివడిగా వేసింది. కోల్‌కతాలో తన డిజైనర్ స్టోర్‌ని పెట్టడంతో ఆమె ప్రయాణం మొదలైంది. అయితే గమ్యాన్ని చేరేందుకు ఆమె పడిన కష్టం అంతా ఇంతా కాదు. వారానికో డ్రెస్సు కూడా అమ్ముడవని రోజులు ఉన్నాయి. తన కలెక్షన్స్‌ను జనానికి చేరువ చేయడానికి ఆమెకు చాలా కాలమే పట్టింది. చివరికి విజయం సాధించింది. తన డిజైన్స్‌కు ప్రాచుర్యం పెరగ్గానే ఆమె ఫ్యాషన్‌కి ఆలవాలమైన ముంబైపై దృష్టి పెట్టింది.
భారతీయ సంప్రదాయ వస్త్రాల డిజైన్లకు పాశ్చాత్య ధోరణులను మిక్స్ చేసి అనామిక తయారుచేసే దుస్తులు సెలెబ్రిటీలను ఆకర్షించాయి. సోనమ్‌కపూర్, సోనాక్షి సిన్హా, దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్ లాంటి వాళ్లంతా ఆమె దుస్తుల్లో దేవకన్యల్లా వెలిగిపోసాగారు. దాంతో అనామిక పేరు దేశమంతా తెలిసిపోయింది. ఆపైన ప్రముఖ డిజైనర్ మనీష్ అరోరాతో కలిసి ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌కి వెళ్లింది అనామిక. తన సత్తా ఏమిలో విదేశీయులకీ చూపించింది. తన బ్రాండ్ నేమ్‌ని పలు దేశాల్లో విస్తరింపజేసి, తిరుగు లేని ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రశంసలు కొట్టేస్తోంది.
- ప్రకాష్ చిమ్మల