
ఆయన రోగాలు నాకు వస్తే?
నాకు ఈమధ్యే పెళ్లయింది. పెద్దలు చూసిన సంబంధం.
సందేహం
నాకు ఈమధ్యే పెళ్లయింది. పెద్దలు చూసిన సంబంధం. అయితే నాకు కొత్తగా ఒక విషయం తెలిసింది. పెళ్లి కాకముందు నా భర్త చెడు తిరుగుళ్లు తిరిగేవాడట. ఈ విషయాన్ని ఒకరిద్దరు కాదు... చాలామంది చెప్పారు. ఇప్పుడు నాకు భయం పట్టుకుంది. ఆయన ద్వారా నాకు ఏమైనా రోగాలు వచ్చే అవకాశం ఉందా? ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఆయన ద్వారా ఏదైనా సోకింది లేనిది నిర్ధారణ చేసుకోవడం ఎలా? – కె.వి, ఖమ్మం
గిట్టనివాళ్లు ఎన్నో కల్పించి చెపుతూ ఉంటారు. వాటిని నమ్మి భయపడే కంటే నిర్ధారణ చేసుకోవటం మంచిది. చెడు తిరుగుళ్ల వల్ల, లైంగిక జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. కాని, గ్యారంటీగా రావాలని లేదు. కొన్ని వచ్చినా, చికిత్సతో తర్వాత తగ్గిపోతాయి. జీవితాంతం ఆ జబ్బులు శరీరంలోనే ఉండిపోయి, భార్యకు సంక్రమించాలని ఏమీ లేదు. హెచ్‌ఐవీ, హెపటైటిస్, సిఫిలిస్ వంటి కొన్ని లైంగికంగా సంక్రమించిన వ్యాధులు మాత్రమే ఎక్కువ కాలం శరీరంలో ఉండి, భార్యకు సంక్రమించే అవకాశాలు ఉంటాయి. నీకు అంతగా సందేహంగా ఉంటే, నువ్వు ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి, సీబీపీ, హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, వీడీఆర్‌ఎల్ వంటి అవసరమైన రక్త పరీక్షలు చేయించుకోవచ్చు. మనసులో సందేహం ఉంటే, రోజూ నరకంలా అనిపిస్తుంది. దానివల్ల జీవితంలో ప్రశాంతతను కోల్పోవలసి ఉంటుంది. లేకపోతే ఒకసారి మీ వారితో, మామూలుగా ఇద్దరి ఆరోగ్యం ఎలా ఉందో రక్త పరీక్షలు (జనరల్ చెకప్) చేసుకుందాం అని అనుమానం రాకుండా చెప్పి పరీక్షలు చెయ్యించుకుని నీ అనుమానం తీర్చుకోవచ్చు.
నాకు ఈమధ్య విచిత్రమైన సమస్య ఏర్పడింది. ఎవరికైనా చెప్పుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు ఎక్కువగా తాగకపోయినా తరచుగా మూత్రం వస్తుంది. కొన్నిసార్లయితే ఆపుకోలేకపోతున్నాను. ఫంక్షన్స్‌కు వెళ్లాలంటే కూడా భయంగా ఉంది. ఇంట్లోనే ఉండాలనిపిస్తుంది. – సి.జి, కర్నూల్
మీరు మీ వయస్సు రాయలేదు. వివాహం అయ్యిందా? పిల్లలు ఉన్నారా? సాధారణ కాన్పులా, ఆపరేషన్ ద్వారానా... అని అనేక విషయాల మీద, మీ సమస్యకు గల కారణం, చికిత్స ఆధారపడి ఉంటుంది. ఈ సమస్య ఎప్పటినుంచి ఉంది. రోజులా, నెలలా అనేది కూడా తెలియడం ముఖ్యం. మూత్రంలో ఇన్‌ఫెక్షన్ వల్ల ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, అవసరమైతే యూరిన్ కల్చర్ చెయ్యించుకుని, దానికి తగ్గ యాంటీ బయాటిక్స్ వారం నుంచి పది రోజుల కోర్సు వాడి చూడవచ్చు. మందులతో పాటు రోజూ మంచినీరు మూడు నుంచి నాలుగు లీటర్లు తాగవలసి ఉంటుంది. కొంతమందిలో యూరినరీ బ్లాడర్‌లో ఇన్‌ఫెక్షన్, వాపు కంతులు, దాని నరాలు, కండరాలు బలహీనపడి, పటుత్వం తగ్గడం వంటి కారణాల వల్ల, యూరినరీ బ్లాడర్‌తో కొద్దిగా మూత్రం నిండగానే, బ్లాడర్ మూత్రాన్ని ఎక్కువసేపు ఆపుకోలేకపోవటం, ఎక్కువ సార్లు వెళ్లాలనిపించడం జరుగుతుంది. కొంతమంది ఆడవారిలో సాధారణ కాన్పుల వల్ల కొన్నిసార్లు కండరాలు బలహీనపడి సమస్య రావచ్చు. కొందరిలో మెనోపాజ్ దగ్గరకు వచ్చేకొద్దీ ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల బ్లాడర్ కండరాలు బలహీనపడి సమస్య రావచ్చు.
నేను అప్పుడప్పుడూ బ్యూటీ పార్లర్‌కు వెళుతుంటాను. మొన్న ఒకసారి వెళ్లినప్పుడు... అవాంఛిత రోమాల గురించి లేజర్ చికిత్స చేసుకోవాలనే ఆలోచన వచ్చింది. అయితే ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ సమయంలో లేజర్ చికిత్స చేయించుకోవడం మంచిది కాదని ఒకరిద్దరు చెప్పారు. ఇది నిజమేనా? అలాగే నేను రకరకాల క్రీమ్‌లు వాడుతుంటాను. ఈ సమయంలో క్రీమ్‌లను వాడకూడదు అని కూడా అంటున్నారు. ఈ విషయంలో మీ సలహా కోరుతున్నాను. ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్లు సౌందర్య సాధనాలు వాడే విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? అనేది చెప్పగలరు. – రుక్మిణి, విజయవాడ
లేజర్ అనేది కాంతి కిరణాల ద్వారా పనిచేస్తుంది. అవాంఛిత రోమాల కోసం, ప్రెగ్నెన్సీ సమయంలో లేజర్ చికిత్స తీసుకోకపోవడమే మంచిది. దీనివల్ల గర్భంలో పిండానికి హాని కలిగే అవకాశాలు ఉంటాయి. రిస్క్ తీసుకుని లేజర్ చికిత్స తీసుకునే అంత ఎమర్జెన్సీ ఏమీ లేదు. కాబట్టి, ఈ చికిత్స డెలివరీ తర్వాతకి వాయిదా వెయ్యటం మంచిది. అందులోనూ ఇది ఒక సిట్టింగ్‌లో అయ్యేది కాదు కాబట్టి ప్రెగ్నెన్సీలో తీసుకోకపోవటమే మంచిది. ప్రెగ్నెన్సీలో హార్మోన్ల ప్రభావం వల్ల కొద్దిగా అవాంఛిత రోమాలు కొందరిలో పెరిగే అవకాశం ఉంటుంది. మరీ ఇబ్బందిగా ఉంటే, ఎప్పుడైనా ఒక్కటి రెండుసార్లు వ్యాక్సింగ్, హెయిర్ రిమూవింగ్ క్రీమ్స్ (ఎక్కువ సేపు పెట్టకుండా) వాడుకోవచ్చు. ఇక కాస్మొటిక్ క్రీమ్స్ విషయానికి వస్తే, అన్నీ క్రీమ్స్ వల్ల సమస్య రావాలని ఏమీ లేదు. వీలైనంత వరకు, తక్కువ రసాయనాలు, తక్కువ సాంద్రత, శక్తి ఉన్నవాటిని వాడటం మంచిది. వాటి మీద ఎఫ్‌డీఏ కేటగిరీ చూసి వాడటం మంచిది.
డా‘‘ వేనాటి శోభ
లీలా హాస్పిటల్
మోతీనగర్, హైదరాబాద్