కలిసి తిరిగితే?
ఇంటర్వ్యూ
హీరోల చుట్టూ తిరిగే సినిమా పరిశ్రమను... తన చుట్టూ కూడా తిరిగేలా చేసుకుంది ప్రియాంకాచోప్రా.
యాషన్, మేరీ కోమ్ లాంటి చిత్రాల్లో నట విశ్వరూపాన్ని ప్రదర్శించి... దర్శకులు తనను దృష్టిలో పెట్టుకుని కథలు అల్లే స్థాయికి చేరుకుంది.
ఆమెకు ప్రతి విషయంలోనూ క్లారిటీ ఉంటుంది.
తన మాటలు వింటే... ఎవరికైనా ఆ విషయం అర్థమవుతుంది!
♦ ఆడపిల్లలు తమను తాము వీక్ అనుకుంటే నచ్చదు నాకు. ప్రపంచమంతా చూడండి... ఎంతమంది మహిళలు ఎంత ఉన్నత పదవులు అలంక రించారో! అలా అని వాళ్లు మనం ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కోలేదా? కచ్చితంగా ఎదుర్కొనే ఉంటారు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి చోటా మగాడి కంటే ఆడది బలహీనురాలు అన్న ఆలోచన ఉంది. అయినా బయటి కొచ్చి తామేంటో చూపించారు వాళ్లు. ప్రయత్నిస్తే మీరూ చూపించగలరు.
♦ ఎంత స్టార్‌ని అయినా నేనూ అమ్మా యినే. మామూలు అమ్మాయిలానే ఆలోచిస్తాను. వినయంగా ఉంటాను. సంప్రదాయాలను గౌర విస్తాను. పెద్దల ముందు తల వంచుతాను. ఆడపిల్ల ఎంత ఎదిగినా ఇలా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నమ్ముతాను.
♦ ఒక్క సినిమా సూపర్ హిట్ అయితే గోల్డెన్ లెగ్ అంటారు. రెండు ఫ్లాపులు వరుసగా వచ్చాయంటే ఐరన్ లెగ్ అంటారు. కెరీర్ అయిపోయినట్లే అని డిసైడ్ చేసేస్తారు. మమ్మల్ని ఎత్తడం ఎందుకు, పడేయడం ఎందుకు! మేం ఎప్పుడూ ఒకేలా ఉంటాం. మీరూ ఎప్పుడూ ఒకేలా అభిమానించొచ్చుగా!
♦ నేను వృత్తిపరంగా పబ్లిక్ ఫిగర్‌ని. కానీ వ్యక్తిగతంగా మామూలు మనిషిని. నా జీవితం నాకు ఉండాలని కోరు కుంటాను. నేను వండుకునే వంట, పడుకునే విధానం కూడా ఇతరులతో పంచుకోవాలని అనుకోను. అది అర్థం చేసుకుని నా మానాన నన్ను వదిలేస్తే చాలు. ప్రియాంక ఏం చేస్తోంది అని ప్రతిక్షణం నా జీవితంలోకి తొంగిచూస్తే మాత్రం నేను ఊరుకోను.
♦ ఒక హీరోయిన్ ఓ హీరోతోనో మరో అబ్బాయితోనో క్లోజ్‌గా ఉంటే వాళ్ల మధ్య ఏముంది అంటూ ఆరాలు తీస్తూ ఉంటారు. మా అమ్మల గురించి, నాన్నల గురించి, అన్నలు అక్కల గురించి అంత ఆసక్తి చూపరే? మేం వాళ్లతో ఎలా గడుపుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అంటూ వెంటపడి అడగరే? అయినా కలిసి తిరిగితే ప్రేమేనా? స్నేహమో మరోటో అవ్వకూడదా?
♦ సమయానికి తగ్గట్టుగా మారిపోయే వాళ్లు, పరిస్థితులకు తలవంచి పిరికి తనాన్ని ప్రదర్శించేవాళ్లు నాకు నచ్చరు. నా చేయి పట్టేవాడు దేనినైనా గెలిచే వాడు కావాలి. అతనికో లక్ష్యం ఉండాలి, దాన్ని సాధించాలన్న పట్టుదల ఉండాలి. జీవితంలో క్లారిటీ లేని వాళ్లంటే నాకు చిరాకు.
♦ నాకు కొన్ని విచిత్రమైన ఇష్టాలున్నాయి. ఉన్నట్టుండి కొత్త ప్రదేశానికి వెళ్లి పోవడం ఇష్టం. అర్ధ రాత్రి సముద్రం దగ్గరి కెళ్లడం ఇష్టం. ఐస్‌క్రీమ్‌లో కోకో కోలా కలుపుకోవడం ఇష్టం. వింతగా ఉన్నా నాకు అవి ఇష్టం... ఏం చేయను?!
♦ మనం అందరికీ నచ్చాలని లేదు. కాబట్టి ప్రతి ఒక్కరినీ శాటిస్‌ఫై చేయాలన్న ఆరాటం అనవసరం. మన పని మనం చేసుకుపోవాలి. మనల్ని ఇష్టపడాలా వద్దా అన్న ఆప్షన్ అవతలివాళ్లకే వదిలేయాలి.
♦ ఈ ఇండస్ట్రీ నాకు నేర్పిన గొప్ప సత్యమిది.
♦ నువ్వు నువ్వుగా ఉండు. ఎవరి కోసమూ నిన్ను మార్చేసుకోకు. మార్చుకోవాల్సి వస్తే ఆ వ్యక్తి అందుకు అర్హుడేనా అన్నది ఆలోచించు. ధైర్యంగా ఉండు. అది నిన్ను విజయపథం వైపు నడిపిస్తుంది. స్వార్థంగా ఉండకు. అది నిన్ను దిగజారిపోయేలా చేస్తుంది. ఇదే నేను ఫాలో అయ్యే సిద్ధాంతం.
♦ నేను విధిని నమ్ముతాను. ఏదీ మన చేతుల్లో ఉండదు. నేను ఇంజినీరింగ్ చదవాలనుకుంటే మా అమ్మ, తమ్ముడు నా ఫొటోలు మిస్ ఇండియా కాంటెస్ట్‌కి పంపారు. ఆ సంగతి నాకు తెలియనే తెలియదు. కానీ చూడండి... పోటీలో గెలిచాను. ఇప్పుడీ స్టార్‌డమ్. ఇవన్నీ అనుకోకుండా జరిగినవి. అదే విధి.
♦ పడిపోయానని కంగారుపడే మనిషిని కాను. పడతాను... లేస్తాను. మళ్లీ పడతాను... మళ్లీ లేస్తాను. పడిలేవడం ఓ విజయం. అయినా మనం మను షులం, మహానుభావులం కాదు. తప్పులు చేయాలి. పాఠాలు నేర్చు కోవాలి. కానీ ఒక్కసారి చేసిన తప్పును మరోసారి చేయకూడదు. లేదంటే అంతిమంగా ఓటమి తప్పదు!!