కిచిడీ: ఇక ఉల్లి కోస్తే కన్నీళ్లు రావు!
ఉల్లిపాయలు లేకుంటే ఇంట్లో వంటే ఉండదు. అంటే... అది ఒక అత్యావశ్యక నిత్యావసర వస్తువు. కానీ, దాన్ని కోస్తే కన్నీళ్లొస్తాయి. రోజూ ఈ కళ్ల మంట భరించాల్సిందేనా? ఆ బాధ నుంచి తప్పించుకునే ఓ మంచి అవకాశం వచ్చింది. ఉల్లిగడ్డలు కోసేటపుడు వాటి ఘాటు కళ్లకు తగలకుండా ప్రత్యేక కళ్లద్దాలు వచ్చాయి. వీటిని పెట్టుకుని ఎంత ఘాటున్న ఉల్లిగడ్డలయినా కోసేయొచ్చు. కంటిని చుట్టూ కవర్ చేసి ఏ విధంగానూ వాటి ఘాటు కంటికి చేరకుండా చేయడంలో ఇవి సహాయపడతాయి. అమెజాన్.కామ్, ఇబే.కామ్‌లోకి వెళ్తే మీరు సులువుగా వీటిని కొనేసుకోవచ్చు. ధర వెయ్యి రూపాయల లోపే ఉంది.
వీసా అడగని దేశాలు!
మీకో విషయం తెలుసా? ప్రపంచంలో 52 దేశాలకు భారతీయులు వీసా లేకుండానే కేవలం పాస్‌పోర్ట్ చేతిలో పెట్టుకుని ఫ్లైట్ ఎక్కొచ్చు. ఈ జాబితాలో మళ్లీ 28 దేశాలకు వీసా అవసరమే రాదు. మిగతా దేశాల్లో మాత్రం అక్కడ దిగాక వాళ్లే వీసా సులువుగా ఇచ్చేస్తారు. కానీ అక్కడే ఉండి ఉద్యోగం చేయాలంటే మాత్రం వర్క్ పర్మిట్ వీసా ఉండాలి. ఇక నేపాల్, భూటాన్ దేశాల్లో అయితే అది కూడా మనకు అవసరం ఉండదు. మన సంగతి అలా ఉంచితే, బ్రిటనీయులు ప్రపంచంలో సుమారు 173 దేశాలకు వీసా లేకుండానే వెళ్లే అవకాశం ఉంది.