‘నేనే ప్రధాని అయితే...’
అప్పుడు సాయంత్రం ఐదుగంటలు... బీజేపీ ఆఫీసులో ఇరవై మంది వరకు అర్జీలు పట్టుకుని కిషన్‌రెడ్డి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వచ్చిన వెంటనే ఒకరొకరుగా సాయం కోరడం... కిషన్‌రెడ్డి వెంటనే పి.ఎ. ద్వారా సంబంధిత అధికారులకు ఫోన్‌లో మాట్లాడి పరిష్కరించడం, వాళ్లు సంతృప్తిగా వెళ్లడం... జరిగిపోతున్నాయి. వచ్చిన వారిలో ఒకతను తన రౌడీషీట్ తీయించమంటున్నాడు. మరో వ్యక్తి ఇరవై ఏళ్ల కిందట వదిలేసిన ఉద్యోగాన్ని తిరిగి ఇప్పించమంటున్నాడు. ‘చూడన్నా... నువ్వొచ్చి నన్నడిగినంత సులభంగా నేను అధికారిని అడగకూడదు. ఇది సాధ్యమా కాదా అని వచ్చినోడికి తెల్వకపోయినా ఎమ్మెల్యేకైనా తెలియాలి కదా అనుకుంటారు. నీకు ఇంకేదన్నా కావాలంటే రా’ అని సముదాయించి పంపేశారు.
ఈ అష్టావధానం రోజూ ఉంటుందా?
ఇప్పుడు తక్కువ. మరో గంటకు ఆఫీసు నిండిపోతుంది.
అందరినీ సమాధాన పరచాలంటే సహనం ఉండాలేమో!
చాలా. ఎమ్మెల్యే చెబితే ఏ పనయినా అవుతుందనుకుంటారు. కోర్టులో కేసు రాజీ చేసుకోక ముందే రౌడీ షీట్ తొలగించమని ఎలా చెబుతాం. ఇరవై ఏళ్ల కిందట వదిలేసిన వ్యక్తిని ఆ ఉద్యోగంలో మళ్లీ చేర్చుకోమని అధికారులకు చెప్పాలంటే ముందు నా మనసుకు అది కరెక్టేననిపించాలి కదా?
అంతరాత్మ సమ్మతించని పనిని చేయరన్న మాట?
ఎంత వేగంగా పనులు చేస్తానో అంత కచ్చితంగానూ ఉంటాను. జరగని పనిని చేస్తానంటూ తిప్పుకోను.
రాజకీయ రంగం, ఉద్యమాల గురించి తెలిసిందెప్పుడు?
నేను ఆరవ తరగతికి రాకముందే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఎస్‌పీఎల్‌గా క్లాసులు బాయ్‌కాట్ చేయడం వంటివన్నీ జరిగిపోయాయి. పరీక్షలు లేకుండానే అందరినీ ప్రమోట్ చేసేశారు.
కాలేజ్‌కొచ్చాక బుద్ధిమంతుడిలా చదువుకున్నారా?
చదువుకున్నాను అంతే. కాలేజ్ నుంచి వచ్చి బీజేపీ ఆఫీసులో గడపడం, ఏ రాత్రికో అక్క వాళ్లింటికి వెళ్లడం! అప్పుడు పార్టీ ఆఫీసు వి.రామారావు గారింట్లో ఉండేది. దత్తాత్రేయ, రామారావు ఓ రోజు... ‘ఇక్కడికే వచ్చేయరాదా’ అన్నారు. ఇంటికి వెళ్లి పుస్తకాలు, దుస్తులు సర్దుకుని పార్టీ ఆఫీసుకొచ్చేశాను.
వారలా అనకపోయి ఉంటే...
బహుశా ఉద్యోగం చేసుకుంటూ ఉండే వాణ్ణేమో!
రాజకీయరంగంలో ఆత్మసంతృప్తినిచ్చిన సంఘటన...
తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంద కృష్ణతో కలిసి గుండె జబ్బుల పిల్లలకు వైద్యం కోసం ఉద్యమం చేశాం. గుండె ఆపరేషన్‌కు ఐదారు లక్షలు ఖర్చవుతుంది. ఆ ఖర్చును భరించే స్తోమత లేని వారే అందరూ. పుట్టపర్తిలో ఉచితంగా ఆపరేషన్లు చేసేవారు. కానీ ఆరేళ్ల తర్వాత కానీ ఆపరేషన్ తేదీ వచ్చేది కాదు. చాలా మంది ఈ లోపే చనిపోయేవారు. ఈ పరిస్థితుల్లో శోభన్ అనే పదేళ్ల కుర్రాడు అక్కడే మరణించాడు. ఇక ఏదయితేనేం పూర్తిగా తేల్చుకోకుండా వదలకూడదని శోభన్ పార్థివదేహంతో ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చున్నాం.
ఆ ఉద్యమంతో అనుకున్నది సాధించారా?
నూటికి నూరు పాళ్లు. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ‘‘మీరు కోరినట్లే గుండె జబ్బు పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తాను. కానీ నేనిప్పుడు ఢిల్లీలో ఉన్నాను. మెడ మీద కత్తి పెడితే ఎలా?’’ అన్నారు. ఈ ఉద్యమం కారణంగానే ఆరోగ్యశ్రీ ఆలోచన వచ్చిందని అసెంబ్లీలో చెప్పారు.
మీరే కనుక ప్రధానమంత్రి అయితే చేసే మొదటి పని?
పై అధికారి నుంచి కింద వరకు ప్రభుత్వ యంత్రాంగంలో జవాబుదారీ తనం తక్కువ. తక్కువ అనేకంటే లేదనడమే సబబు. ఎమ్మెల్యే, కార్పొరేటర్ వంటి ప్రజా ప్రతినిధులలోనూ ఉండడం లేదు. అయితే మేము ఐదేళ్లకోసారి ప్రజల మధ్యకు వెళ్లి వారిని సమాధాన పరిచి ఓట్లడగాలి. ఉద్యోగికి ఆ అవసరం కూడా లేదు.
రాజకీయరంగంలో స్ఫూర్తి?
చిన్నప్పుడు అనుకోకుండా ఆర్‌ఎస్‌ఎస్ కవాతు చూశాను. అది నా కంట పడకపోతే వేరుగా ఉండేవాడినేమో. జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ విప్లవం పిలుపుతో స్ఫూర్తి పొందాను. జనతాపార్టీలో చేరి 1977లో యువజన విభాగం అధ్యక్షుడినయ్యాను. 1980లో జనతాపార్టీ నుంచి బీజేపీ ఆవిర్భవించినప్పుడు అందులోకి మారాను.
హైదరాబాద్ పార్టీ ఆఫీస్ జీవితానికీ, ఢిల్లీ పార్టీ ఆఫీసు జీవితానికీ తేడా ఎలా ఉండేది?
ఢిల్లీ సెంట్రల్ ఆఫీసులో 11 ఏళ్లు ఉన్నాను. గోవిందాచార్య, నరేంద్రమోదీ, నేను ముగ్గురం మూడు గదుల్లో ఉండేవాళ్లం. హైదరాబాద్ ఆఫీసులో ఉన్నప్పుడు మరీ చిన్నవాణ్ణి. కీలకమైన బాధ్యతలేవీ ఉండేవి కాదు. ఇక్కడి ఆఫీసులో దత్తాత్రేయ, నేనూ స్థిరనివాసులం. మా ఇద్దరి కోసం చిన్న మెస్ కూడా నడిచేది. దత్తాత్రేయ ఎజ్‌డీ మీద రాత్రి 10-11 గంటల వరకు స్నేహితులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లే వాళ్లం. మొదట్లో నేను బండి తుడిస్తే ఆయన నడిపేవారు. తర్వాత నేనే తుడిచి నేనే నడపడం మొదలైంది.
అదే క్రమాన్ని పార్టీని నడపడంలోనూ పాటించినట్లున్నారు?
నిజమే. ఆయన ముందు, నేను తర్వాత.
స్వచ్ఛ్ భారత్ దేశానికి కొత్తగానీ మనకు గతంలో క్లీన్ అండ్ గ్రీన్ వంటి పేర్లతో పరిచయమే కదా?
అది ఉద్యోగులతో చేయించిన కార్యక్రమం. ఇది ప్రజల భాగస్వామ్యంతో చేయిస్తున్న సామాజిక చైతన్య కార్యక్రమం.
మిగతా రాజకీయ నాయకులకూ మీకూ తేడా ఏదైనా ఉందా?
నా దగ్గరకు గణేశ్ చందాలని, గుడి కట్టుకోవడానికి విరాళాలని ఎవరూ రారు. ‘ఆయన ఎవరి దగ్గరా ఏమీ తీసుకోడు, ఇక ఆయనేం ఇస్తాడు’ అని బాహాటంగానే అంటారు.
మరి ఎన్నికలకు ఇంటి నుంచి కావ్యగారు డబ్బు సర్దాల్సిందేనా?
ఎన్నికలప్పుడు విరాళాలు తీసుకుంటాను. ‘నువ్వెప్పుడూ ఏమీ అడగలేదు సార్! ఈ పదివేలు దగ్గర పెట్టుకోండి, ఈ ఐదువేలు తీసుకోండి’ అంటూ తోచినంత ఇచ్చి వెళ్తారు.
మీ దినచర్య ఎలా ఉంటుంది?
ఆరు గంటలకు నిద్ర లేచేటప్పటికే జనం వచ్చి ఉంటారు. వారందరితో మాట్లాడిన తర్వాత నా పనులు. పూజ చేసుకుని మరోసారి (ఈ మధ్యలో వచ్చిన వారిని) జనాన్ని కలవడం, బ్రేక్‌ఫాస్ట్ చేసి తొమ్మిదింటికి బయటపడడం. హైదరాబాద్‌లో ఉంటే ప్రతిరోజూ నియోజకవర్గంలో ఏదో ఒక చోట పర్యటిస్తాను.
రాముణ్ణి మాత్రమే పూజిస్తారా?
అలా అని ఏమీ లేదు. సాయిబాబా, వెంకటేశ్వరస్వామి, అయ్యప్పస్వామి అందరినీ ఇష్టపడతాను. మా ఊళ్లో (రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్) రాముడికి గుడి కట్టాను. శ్రీరామనవమికి, బ్రహ్మోత్సవాలకు తప్పకుండా ఊరికి వెళ్తాను.
సినిమాలు చూస్తారా?
పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు చూశాను. కమలహాసన్, శ్రీదేవి, కె.విశ్వనాథ్ సినిమాలిష్టం. ఇప్పటివాళ్ల పేర్లే గుర్తుండడం లేదు.
మీతో కలసి బయటకు వెళ్లాలని ఇంట్లో వాళ్లకుంటుందిగా!
బంధువుల ఫంక్షన్‌లకు వెళ్తాం. రెండేళ్లకోసారి టూర్‌లకెళ్తాం. మా ఆవిడ ఏమీ అనదు కానీ మా పాప మాత్రం ‘టూర్‌లో కూడా ఈ దుస్తులేంటి? మోడరన్‌గా వేసుకో నాన్నా’ అని కోప్పడుతుంది.
మీ ఆవిడ కోప్పడే సందర్భాలు ఉండవా?
నాకు వేగంగా తినడం అలవాటు. పొరమాలినప్పుడు ‘‘మెల్లగా తింటే కొంపలు మునుగుతాయా’’ అని నీళ్లందిస్తుంది.
మీరు ఏమేమి ఇష్టంగా తింటారు?
వైట్ రైస్, గడ్డ పెరుగు ఉంటే ఇంకేమీ చూడను.
అభిమాన నాయకుడు?
వాజ్‌పేయి. ఆయన వస్తున్నారంటే ఆ మీటింగులకు వెళ్లేవాడిని. 1980లో తొలిసారి ఆయన గురించి విన్నాను. పదహారేళ్ల వయసులో పడిన ముద్ర! అది ఎప్పటికీ చెరగదు.
ఇంటర్య్వూ : వాకా మంజులారెడ్డి