తెలంగాణ ప్రభుత్వం 2018–19 నుండి రైతులకు ఎకరానికి రూ. 4 వేలు పెట్టుబడి రాయి తీలు రైతుబంధు పేరుతో అమలు చేస్తున్నది. వానా కాలం 4 వేలు, వేసంగి 4 వేలు ప్రతి ఎకరాకు ఇస్తారు. వాస్తవ భూమి హక్కు కలిగి, పట్టా పాస్ పుస్తకం ఉన్న వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు ఈ నిర్వహణా బాధ్యతలు చూస్తాయి. రెవెన్యూ శాఖ నిర్వహించిన సర్వేలో 71.25 లక్షల మంది రైతులు ఉన్నట్లు తేలింది. కానీ, ఇందులో చాలా మందికి భూముల పై పట్టా హక్కులు లేవు.
మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం పరిశీలించిన భూమి 2.56 కోట్ల ఎకరాలు కాగా ఇందులో 2.38 కోట్ల ఎకరాలు ఎలాంటి సమస్యలు లేకుండా క్లియర్‌గా ఉన్నాయి. ఇందులో సాగుభూమి 1.43 కోట్ల ఎకరాలు ఉన్నది. 1.43 కోట్ల ఎకరాలకు రుణ రాయితీ యివ్వడానికి 2018–19 బడ్జెట్‌లో వ్యవసాయ బడ్జెట్ కింద రూ. 12,733 కోట్లు కేటాయించారు. ఈ రాయితీ లేక ముందు 65 వేల కోట్లు కేటాయించారు. 2014 నుండి 2017 మార్చి నాటికి రైతుల రుణమాఫీ కింద రూ.16,630 కోట్లు కేటాయించి రైతుల ఖాతాలలో జమ చేశారు. 2018– 19లో కేటాయించిన వ్యవసాయ బడ్జెట్‌లో రూ.8,9 81 కోట్లు కేటాయించారు. వాస్తవానికి పాస్ బుక్కులు ఉన్న వారి లెక్కలు తీస్తే 57,24,115 మంది రైతులు ఉన్నారు. భూములు ఉండి పాస్ పుస్తకాలు లేని వారు 14.01 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి.
వీరికి పాస్ పుస్తకాలు ఇస్తామని, వారి భూ సమస్యలు పరిష్కరిస్తామని, వీరిని పార్ట్–2లో చేర్చారు. ఎన్నికలు రావడంతో పార్ట్–2 జాబితాలోని రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పాస్ పుస్తకాలున్న 57,24,115 మందికి రూ. 5,618.51 కోట్లు వానా కాలం రాయితీ కింద పంపిణీ చేశారు. వేసంగి రాయితీ కొంత మేరకు రైతుల ఖాతాలో జమచేయడంతో ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపిన కార ణంగా నిలిపివేశారు. రుణాలు రద్దు చేసినా, పెట్టుబడి రాయితీ యిచ్చినా రైతుల ఆత్మహత్యలు సాగుతూనే ఉన్నాయి. రూ. 34 లక్షల అప్పు కాగానే పేద రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధానంగా ప్రైవేటు రుణ భారమే కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 20 వేల కోట్లు ప్రైవేటు రుణాలున్నాయి. 36 శాతం నుండి 50 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసినప్పటికీ నేటికీ రూ. 37 వేల కోట్ల రుణాలలో రైతులు కూరుకుపోయి ఉన్నారు. రైతు పెట్టుబడి రాయితీ కొంత లాభించినా పూర్తిగా సమస్యలు పరిష్కరించలేదు. కొంత మంది వాస్తవ సాగుదారులు కాని వారికి వేల కోట్ల లబ్ధి కలిగింది. భూములు సాగు చేసినా, సాగుచేయకున్నా ప్రస్తుతం ప్రభు త్వం పాస్ పుస్తకాలున్న వారికి రాయితీలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కింద భూములు కొనుగోలు చేసినవారికి కూడా రాయితీలు ఇస్తున్నారు. గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసే అవకాశాలున్నప్పటికీ వారు పెద్దగా పట్టించుకోవడం లేదు.
నేడు రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ధర రావడం లేదు. ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా ఉత్పత్తి ఖర్చులపై 50 శాతాన్ని కలిపి నిర్ణయించినవి కావు. ఉపకరణాల ఖర్చు, కుటుంబ ఖర్చులు మాత్రమే లెక్కలోకి తీసుకొని ఆ మొత్తానికి 50 శాతం కలిపి ధర ప్రకటించారు.
ఆ విధంగా ధాన్యానికి క్వింటాలుకు రూ. 1166లు వ్యయం కాగా దానికి 50 శాతం కలిపి క్వింటాల్‌కు రూ. 1770 రూపాయలు ధర నిర్ణయించారు. వాస్తవానికి క్వింటాల్ వ్యయం రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రూ. 2000లు అవుతుంది. 50 శాతం కలిపి రూ. 3 వేలుగా ధర నిర్ణయించాలి. భూమిపై కౌలు, వడ్డీ, యంత్రాల అరుగుదల తదితర అంశాల వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందువల్ల ప్రధాని నిర్ణయించిన ధర ఉత్పత్తి వ్యయంపై 50 శాతానికి తక్కువగా ఉన్నది. ప్రధాని ప్రకటించిన ధరలు కూడా అమలు కావడం లేదు. క్వింటాల్‌కు రూ.1300–1400 లు మాత్రమే మార్కెట్‌లో వ్యాపారులు చెల్లిస్తున్నారు. ప్రధాని ప్రకటించిన ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కేంద్రం చెబుతున్నది. కేంద్రం ప్రకటించింది కాబట్టి మార్కెట్‌లో వచ్చే లోటును కేంద్రమే రాష్ట్రాలకు ఇవ్వాలని రాష్ట్రాలు చెప్తున్నాయి. ధరల అమలు బాధ్యతను ఏ ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల రైతులు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ విధంగా నష్టపోయిన రైతుకు ఎకరా రూ. 4 వేల రైతుబంధు రాయితీ కొంత ఉపశమనం కలిగించవచ్చునేమో కానీ, ధరల సమస్యను పరిష్కరించదు.
సారంపల్లి మల్లారెడ్డి
వ్యాసకర్త అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, 94900 98666
Comments
Please login to add a commentAdd a comment