మోదీకి ‘పనికొచ్చే మూర్ఖులు’ | Shekhar Gupta Article On Narendra Modi | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 4 2018 12:43 AM | Last Updated on Tue, Sep 4 2018 8:50 AM

Shekhar Gupta Article On Narendra Modi - Sakshi

ముస్లింను శత్రువుగా చిత్రించే అసలు ఫార్ములా పాతబడింది. అందుకే దేశ ఉనికికి ముప్పు కలిగించే మరో శత్రువును ‘కనిపెట్టాల్సిన’ అవసరం ఏర్పడింది. మావోయిస్టుల్ని అలా చూపించవచ్చు. వారికి ఇస్లామిక్‌ తీవ్రవాదంతో సంబంధం అంటగడితే మరీ మంచిది. ఉద్యోగాలు అడిగే యువతను ‘అవతల దేశం నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంటే ఇలాంటివి అడుగుతారా... మీ దేశభక్తి ఏమైంద’ని ప్రశ్నిస్తే సరి! అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సాధించింది అంతంత మాత్రమే. నిజంగా ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు కనపడుతూ మళ్లీ గెలిపించమని ప్రజలను కోరడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం. జనం కూడా శక్తిమంతమైన శత్రువును ‘చూపిస్తే’ పాలకపక్షం వైఫల్యాన్ని మన్నిస్తారు.

బోల్షివిక్‌ విప్లవం సమయంలో తమకు అనుకూలంగా మాట్లాడే కమ్యూనిస్టులు కాని నవ ఉదారవాదులను సోవి యెట్‌ విప్లవ నేత లెనిన్‌ ‘పనికొచ్చే మూర్ఖులు’ అని పిలిచేవారని చెబు తారు. ఇండియాలో గత రెండు దశాబ్దాలుగా పట్టణప్రాంతాలకు చెందిన వామపక్ష, ఉదారవాద మేధావులను హిందుత్వ మద్దతుదారులైన బుద్ధిజీవులు ఇలాగే (యూజ్‌ఫుల్‌ ఇడియట్స్‌) పిలుస్తున్నారు. వారికి ‘అర్బన్‌ నక్సల్స్‌’ అనే కొత్త పేరు పెట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం పాక్షిక విజయమే సాధించింది. వారు అర్బన్‌ నక్సల్సా, కాదా అనే విషయం పక్కన పెడితే, ఈ మేధావులను బీజేపీ/ఆరెస్సెస్‌ పనికొచ్చే మూర్ఖులు అనడం సబబేనని ఇప్పుడందుతున్న సమాచారం చెబుతోంది. అయితే ‘గొప్ప భారత విప్లవానికి’ వారు పనికొచ్చే మూర్ఖులు కాదు. వారిలో అతికొద్ది మంది మాత్రమే ఇంకా రెండు మూడు కేంద్ర విశ్వ విద్యాలయాలకే పరిమితమై కనిపిస్తున్నారు. అలాగే, బస్తర్‌ వంటి ఆదివాసీలు నివసించే ఒకట్రెండు అటవీ ప్రాంతాల్లో కొద్దిమంది మరింత ప్రమాదకరమైన రీతిలో ఉంటున్నారు. ఇలాంటి చోట్ల వారు బీజేపీకి ఉపయోగపడే మూర్ఖులుగా కనిపిస్తున్నారు. 

పట్టణ నక్సల్‌ లేదా గ్రామీణ నక్సల్‌ అంటూ ఎవరూ ఉండరు. నక్సలైట్‌ నక్సలైటే గాక మావో యిస్టు కూడా. అలా ఉండటం ఏమీ నేరం కాదు. ఎలాంటి నమ్మకాలున్నా, ఆ విశ్వాసాల గురించి బహిరంగంగా ప్రకటించినా ఏ చట్టంగాని, చట్టవ్యతి రేక కార్యకలాపాల నిరోధక చట్టంగాని ఎవరినీ భారత జైళ్లలో పెట్టలేవు. కశ్మీర్‌ను ఇండియా చట్ట వ్యతిరేకంగా ఆక్రమించుకుందని లేదా మన ప్రజాస్వామ్యం బూటకమని మీరు బాహాటంగా చెప్పవచ్చు. అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన బీజేపీ సాధించింది అంతంత మాత్రమే. నిజంగా ప్రమాదకరమైన శక్తులకు వ్యతిరేకంగా పనిచేస్తు న్నట్టు కనపడుతూ మళ్లీ గెలిపించమని ప్రజలను కోరడం ఒక్కటే బీజేపీ ముందున్న మార్గం. జనం కూడా శక్తిమంతమైన శత్రువును ‘చూపిస్తే’ పాల కపక్షం వైఫల్యాన్ని మన్నిస్తారు. దేశాన్ని కాపాడటానికి ఓటేస్తారు. అందుకే 1984లో సిక్కు ఉగ్రవాదాన్ని దృష్టిలో పెట్టుకుని ‘రాజీవ్‌గాంధీకా ఎలాన్‌/నహీ బనేగా’ అనే నినాదం కాంగ్రెస్‌ను గెలి పించింది. 

ముస్లింను శత్రువుగా చిత్రించే కాషాయపక్షం అసలు ఫార్ములా పాతబడిపోయింది. ముస్లిం అంటే పాకిస్థాన్‌–అంటే కశ్మీర్‌ వేర్పాటువాది–అంటే ఉగ్ర వాది–అంటే లష్కరే తోయిబా/అల్‌కాయిదా/ ఐసిస్‌ అనే సూత్రంతో వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రాగలమన్న విశ్వాసం బీజేపీకి లేదు. అదీగాక, హిందువులం దరూ కులం వంటి అంశాలను విస్మరించి ముస్లిం లంటే భయపడిపోయే పరిస్థితుల్లో లేరు. ముస్లింలపై వ్యతిరేకత కొనసాగేలా చేయ డానికి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఉండేలా చూస్తూ, పాక్‌ సైనికులపై మెరుపు దాడులు చేయడం అంత తేలిక కాదు. పాక్‌పై భారత్‌ విరుచుకుపడితే దాన్ని ఆదుకోవడానికి చైనా సిద్ధంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆధారపడే పరిస్థితి లేదు. 

కాబట్టి, భారతదేశ ఉనికికి ముప్పుగా కనిపించే మరో శత్రువును కనిపెట్టాల్సిన అవసరం బీజేపీకి ఏర్పడింది. మావోయిస్టులను అలా చూపించవచ్చు. ఇస్లామిక్‌ తీవ్రవాదంతో వారికి సంబంధం అంటగడితే మరీ మంచిది. ఇలా చేశాక ‘దేశాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతుంటే మీరు ఉద్యోగాల కల్పన గురించి మాట్లాడుతున్నారు. మీ దేశభక్తి ఏమైంది’ అంటూ పాలకపక్షం నేతలు ప్రశ్నించే అవకాశం ఉంది. 1980ల ఆఖరులో రాజీవ్‌గాంధీ పలుకు బడి తగ్గిపోయాక ‘కులం వల్ల విడిపోయిన ప్రజ లను కలపడానికి మతాన్ని బీజేపీ ఉపయోగించు కోగలదా?’ అనే ప్రశ్న తలెత్తింది. అయోధ్యతో ఎల్‌కె ఆడ్వాణీ ఆ పనిచేశారు. 2004 ఎన్నికలనాటికి బీజే పీకి జనాదరణ తగ్గిపోయింది. పదేళ్ల తర్వాత నరేంద్రమోదీ బీజేపీని గెలిపించారు. ఆయన వ్యక్తిగత విజయాలు, జనాకర్షణ శక్తి హిందూ ఓటర్లను ఆకట్టుకున్నాయి. బలమైన సర్కారు, వికాసం అందిస్తానన్న వాగ్దానం ఆచరణలో సాధించింది సగమే. అందుకు పాలకపక్షానికి కొత్త శత్రువు అవసరమైంది. ముస్లింలకు మావోయిస్టులను కలపడం ద్వారా 2019 ఎన్నికల్లో విజయం సాధించాలని పాలకపక్షం భావిస్తోంది. ‘దేశం తీవ్ర ప్రమాదంలో ఉంద’నే ప్రచారంతో ఈ ఎన్నికల్లో గెలవాలని ఆశిస్తోంది.

మావోయిస్టు అనే ఒక్క మాటతోనే ప్రజలను భయపెట్టి కాషాయపక్షంవైపునకు మళ్లించడం కుదరని పని. కాలేజీల్లో ఏమాత్రం ప్రమాదకరంగా కనిపించని మావోయిస్టులను మనం చూశాం. అయితే, నక్సలైట్లు ఆయుధాలతో తిరుగుతారు కాబట్టి వారిని చూస్తే భయమేస్తుంది. కాని, మనకు వారు కనపడరు. టీవీ స్క్రీన్లు, ట్విటర్లో కూడా కనిపించరు. నక్సల్స్‌ పేరుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో జనాన్ని బెదరగొట్టలేం. అందుకే అర్బన్‌ నక్సల్‌ అనే ప్రాణి పుట్టుకొచ్చింది. 

రెండున్నరేళ్ల క్రితం ఢిల్లీ జేఎన్‌యూలో జరిగిన ఘటనలు ఇక్కడ ప్రస్తావించాలి. వామపక్ష మేధావులు అభిమానించే ఉర్దూ కవి ఆగా షాహీద్‌ అలీ స్మారక కార్యక్రమం సందర్భంగా అప్పుడు కశ్మీర్‌ స్వాతంత్య్రంపై చర్చించి, మద్దతు ఇచ్చే విషయంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ‘భారత్‌ ముక్కలు ముక్కలవుతుంది, ఇన్షాల్లా– ఇన్షాల్లా’ అని కొందరు యువకులు నినాదాలు చేస్తున్నట్టు చూపే వీడియో హఠాత్తుగా ప్రత్యక్షమైంది. దీంతో ఇద్దరు వామపక్ష విద్యార్థినేతలను (వారిలో ఒకరు ముస్లిం) అరెస్ట్‌ చేసి, వారిపై రాజద్రోహం వంటి కేసులు బనాయించారు. మరిన్ని వీడియోలు పుట్టుకొచ్చాయి. కశ్మీర్‌కు స్వాతంత్య్రం కావాలని డిమాండ్‌ చేస్తున్న తన విద్యార్థులను ప్రశంసిస్తూ ఓ మహిళా ప్రొఫెసర్‌ మాట్లాడుతున్న మరో వీడియో దర్శనమిచ్చింది.

ఇండియాను ముక్కలు ముక్కలు చేయడానికి దేశవ్యతిరేక ముస్లింలతో తీవ్రవాద, వామపక్ష మేధావులు చేతులు కలిపారనే కొత్త సిద్ధాంతానికి ఇలా రూపకల్పన జరిగింది. కశ్మీర్, బస్తర్‌ సంక్షోభాలను న్యూఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణె నగరాల్లోని ఈ శక్తులు కుమ్మక్క య్యాయని, ఢిల్లీలోని జేఎన్‌యూ ఈ కార్యకలా పాలకు కేంద్రస్థానమైందనే ప్రచారం చేశారు. దీనికితోడు కశ్మీరీ వేర్పాటువాదం గురించి మాట్లాడటం ద్వారా తీవ్రవాద వామ పక్ష మేధావులు పరోక్షంగా, సర్కారీ అనుకూల టీవీ చానళ్లు ప్రత్యక్షంగా పాలపక్ష కొత్త ప్రచార వ్యూహం విజయవంతమయ్యేలా చేశాయి.

 నేడు అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఇస్లామిక్‌ తీవ్రవాదం అంతం చేస్తుందని, పూర్వపు సోవియెట్‌ యూనియన్‌ వల్లకాని అనేక పనులు దీనివల్ల పూర్తవుతాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వామపక్షాలు నమ్ముతున్నాయి. ఇండియాలో కూడా ఇలాంటి ఆశలున్నవారు లేకపోలేదు. ఆయుధాలు పట్టిన కశ్మీరీలను, బస్తర్‌ ఆది వాసీలను ప్రభుత్వ సాయుధ బలగాలు చంపేస్తుంటే మాట్లాడేవారు లేరు. భారత సర్కారుతో ఎవరు పోరుకు తలపడినా మనవంటి కొద్దిమంది మేధా వులు మాత్రమే అందుకు ‘మూల కారణాల’ గురించి ఆలోచిస్తారు. కుట్ర పేరుతో ప్రభుత్వం అరెస్టు చేసిన హక్కుల నేతలు కూడా ఈలోగా కోర్టుల జోక్యంతో విడుదలవుతారు.

ఫలితంగా మోదీ సర్కారు నైతికంగానే గాక కోర్టుల్లో కూడా ఈసారి ఓడిపోతుంది. అయినా పాలక పక్షం దిగులుపడదు. ఇది ఇప్పటికిప్పుడు పూర్తి చేయాల్సిన ‘ఆపరేషన్‌ రెడ్‌ హంట్‌’ కాదు. అందుకే ప్రభుత్వ ప్రచార వ్యూహంలో తమకు తెలియకుండానే భాగమైన వామపక్ష మేధావులు చివరికి పాలకపక్షానికి లెనిన్‌ చెప్పినట్టు ‘పనికొచ్చే మూర్ఖులు’గా మారినట్టవుతుంది.


- శేఖర్‌ గుప్తా
వ్యాసకర్త ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌
twitter@shekargupta

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement