కారు ప్రమాదానికి గురై ముగ్గురి మృతి
శేరిలింగంపల్లిలో విషాదచాయలు
శేరిలింగంపల్లి: గోదావరి పుష్కరాలకు వెళ్తూ కారు ప్రమాదానికి గురైన సంఘటనలో ముగ్గురు మరణించడంతో శేరిలింగంపల్లిలోని వారి నివాసాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. గోదావరి పుష్కరాల కోసం శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు శేరిలింగంపల్లి ఆదర్శనగర్, గోపినగర్‌లకు చెందిన రెండు కుటుంబాలు వారు కారులో బయలుదేరి వెళ్లారు. కాగా కరీంనగర్ నుంచి పెద్దపల్లి వెళ్లే మార్గంలోని వెల్గటూరు మండలం అంబాజీ పేట వద్ద తెల్లవారుజామున 5.30 గంటలకు జరిగిన కారు ప్రమాదంలో రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే..ప్రకాశం జిల్లా అర్థవీడు మండలానికి చెందిన కాకర్ల గ్రామవాసి కె. అల్లూరయ్య గౌడ్ పటాన్‌చెరులోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో మెకానిక్ పని చేస్తూ శేరిలింగంపల్లి ఆదర్శ నగర్‌లో నివాసముంటున్నాడు. ఆయన భార్య రమణమ్మ(42), అదే ప్రాంతానికి చెందిన రిటైర్డ్ బీహెచ్‌ఈఎల్ ఉద్యోగి టి.నర్సింహులు గోపినగర్‌లో నివాసముంటున్నాడు. ఆయన భార్య వెంకట లక్ష్మీ(45), కుమారుడు శ్రీనివాస్ ఎంటెక్(24)లు సాంత్రో కారులో కరీంనగర్ జిల్లాలోని కోటి లింగాల పుష్కర ఘాట్‌లో స్నానాలు ఆచరించేందుకు బయలుదేరారు.
పుష్కరఘాట్‌కు 10 కి.మీ. దూరం ఉందనగా పెద్దపల్లి మార్గంలో బోలేరో వాహనాన్ని ఢీకొట్టి కారు అదుపు తప్పింది. దీంతో కారు పల్టీలు కొట్టడంతో, కారు డ్రైవింగ్ చేస్తున్న శ్రీనివాస్, రమణమ్మ, వెంకట లక్ష్మీ మృతి చెందారు. రమణమ్మ అక్కడిక్కడే మృతి చెందగా, శ్రీనివాస్, వెంకట లక్ష్మీలను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే క్రమంలోనే మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. అల్లూరయ్య గౌడ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లగా, నర్సింహులుకు తొంటిలో కీలు విరిగిందని తెలిపారు.