జీహెచ్‌ఎంసీ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 7802 పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు కనీస మౌలికసదుపాయాల కోసం ప్రత్యేకచర్యలు చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి డా.బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, టెంట్లు, వికలాంగుల కోసం ర్యాంపులు, టాయ్‌లెట్లు తదితర సదుపాయాలు సమకూరుస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికి దాదాపు 2వేల పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లు పూర్తయ్యాయని, మిగతా కేంద్రాల్లోనూ మరో రెండు మూడు రోజుల్లో పూర్తిచేస్తామన్నారు.
27న బ్యాలెట్ పేపర్ల తనిఖీ
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల జాబితాతో కూడిన బ్యాలెట్‌పత్రాల ముద్రణ పూర్తయిందని కమిషనర్ తెలిపారు. ఈనెల 27న వాటిని తనిఖీ చేయాల్సిందిగా రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, పోటీ చేస్తున్న అభ్యర్థులు/ వారు ప్రతిపాదించే ఏజెంట్ల సమక్షంలో ఈ తనిఖీలు నిర్వహించాల్సిందిగా డిప్యూటీ కమిషనర్లకు సూచించారు. ఈనెల 28వ తేదీన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల పనితీరు, నిర్వహణపై కూడా తనిఖీ నిర్వహించాల్సిందిగా సూచించారు.
యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న 70 వేల మంది
ఓటర్లు తమ పోలింగ్ కేంద్రాన్ని తెలుసుకునేందుకు జీహెచ్‌ఎంసీ రూపొందించిన ప్రత్యేక యాప్‌ను ఇప్పటి వరకు 70 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారన్నారు. ఈ యాప్‌ద్వారా 69 వేలమంది తమ ఓటరుస్లిప్‌లు డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ద్వారా 3.12 లక్షల మంది ఓటరుస్లిప్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారని, తమ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి వ్యక్తిగతంగా 40 శాతం మంది ఓటర్లకు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేశారన్నారు.
ఎన్నికల సిబ్బంది ఫిబ్రవరి 1నే చేరుకోవాలి
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఫిబ్రవరి ఒకటో తేదీ ఉదయం 7 గంటలకు సంబంధిత డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో రిపోర్ట్ చేయాల్సిందిగా జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్,కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉద్యోగులను ఎన్నికల విధులకు నియమించామన్నారు.
ఓటర్లకు అన్ని వసతులు
Published Tue, Jan 26 2016 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM
Advertisement
Advertisement