పదో తరగతి పరీక్షకు 5నిముషాలు వెసులుబాటు | All set for 10th class exams | Sakshi
Sakshi News home page

పదో తరగతి పరీక్షకు 5నిముషాలు వెసులుబాటు

Published Sat, Mar 19 2016 7:03 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

ఈ నెల 21వ తేదీ నుంచి మొదలుకానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : మార్చి 21వ తేదీ నుంచి మొదలుకానున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సురేందర్‌ రెడ్డి తెలిపారు. నిముషం ఆలస్యమైనా అనుమతించబోమన్న నిబంధనను సడలిస్తున్నట్లు వెల్లడించారు. పరీక్ష ఉదయం 9.30 గంటలకు ప్రారంభం అవుతుందని, మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందన్నారు. ద్వితీయ భాష పరీక్ష మాత్రం ఉదయం 9.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు ఉంటుందన్నారు. అయితే, విద్యార్థులను ఉదయం 9.35 గంటల వరకు పరీక్ష హాల్లోకి అనుమతించే వెసులుబాటు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకుమించి ఆలస్యమైతే ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించేది లేదన్నారు. విద్యార్థులను గంట ముందుగానే (ఉదయం 8.30 గంటలకే) పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని తెలిపారు.

స్కూల్ యూనిఫామ్లో రావద్దు..
'విద్యార్థులు పరీక్షలకు పాఠశాల యూనిఫామ్ వేసుకుని వెళ్లరాదు. యూనిఫామ్ వేసుకుని వస్తే అనుమతించరు. ఇతర దుస్తులు ధరించాలి. ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగ్‌లు, పుస్తకాలను పరీక్ష హాల్లోకి అనుమతించరు. బ్లాక్ లేదా బ్లూ పెన్నుతోనే పరీక్షలు రాయాలి. జవాబు పత్రాల లోపల ఎలాంటి గుర్తులు పెట్టరాదు. హాల్‌ టికెట్ నెంబరు, ఫోన్‌నెంబరు వంటి రాయకూడదు. అలా రాస్తే ఆ జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయరు. ఏదైనా సహాయం అవసరం అయితే ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యాలయంలో ఏర్పాటు చేసే హెల్ప్‌లైన్ కేంద్రానికి (040-23230942) ఫోన్ చేసి సహాయం పొందవచ్చు.

అలాగే డీఈవో కార్యాలయాల్లో ఏర్పాటు చేసే హెల్ప్ కేంద్రాలకు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు. విద్యార్థులకు కేటాయించిన కేంద్రంలోనే పరీక్ష రాయాలి. ఆలస్యం అయిందన్న కారణంతో సమీపంలోని కేంద్రానికి వెళితే అనుమతించరు. మాల్‌ప్రాక్టీస్‌కు సహకరిస్తే ఇన్విజిలేటర్లపైనా చర్యలు ఉంటాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇన్విజిలేటర్లు కొంత మంది ప్రైవేటు స్కూళ్ల టీచర్లను తీసుకున్నాం. 425 కేంద్రాల్లో ఫర్నిచర్ కొరత ఉంటే ఇతర స్కూళ్ల నుంచి తెప్పించి సర్దుబాటు చేశాం. జిల్లాకు ఒక సెంటర్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 5 మార్కులు కలిగిన ఆబ్జెక్టివ్ పేపరును చివరి అరగంట సమయంలో ఇస్తారు.'

కెమెరాలేని సెల్ ఫోన్లే!
పరీక్ష కేంద్రంలో చీఫ్ సూరింటెండెంట్ మినహా మరెవరూ సెల్‌ఫోన్లు వాడటానికి వీల్లేదు. చీఫ్ సూరింటెండెంట్లు కూడా కెమెరా లేని సెల్‌ఫోన్లనే వినియోగించాలి. 392 కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్స్... 144 ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.

వికలాంగులు 20 మార్కుల కే పాస్
అంధ, మూగ, చెవిటి, అంగవైకల్యం కలిగిన విద్యార్థులు ఉత్తీర్ణత మార్కులు కాకుండా 20కి తగ్గించారు. వీరికి జంబ్లింగ్ విధానం ఉండదు. వారు మూడు లాంగ్వేజెస్ పేపర్లకు బదులు ఒక్క భాష పేపరు రాస్తే చాలు. డిస్‌లెక్సియాతో బాధపడే వారు ఇంగ్లిషు పేపరు రాయాల్సిన అవసరం లేదు. 9వ తరగతి విద్యార్థిని సహాయకునిగా ఇవ్వడంతోపాటు గంట అదనంగా సమయం ఇస్తారు.

ఏప్రిల్ 11 నుంచి స్పాట్
జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఏప్రిల్ 11 నుంచి ప్రారంభిస్తారు. 5 ఏళ్ల సర్వీసు ఉన్న వారినే మూల్యాంకన విధులకు తీసుకుంటారు. మూల్యాంకనం ప్రారంభం అయ్యాక 7 వారాల తరువాతే ఫలితాలను వెల్లడించేందుకు వీలు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement