లక్కీ బస్తీలు..
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా...
‘అల్లాఉద్దీన్ కోఠి’ బాధ్యతలు సీఎంకు...
‘మక్తా’లకు ఇన్‌చార్జిగా గవర్నర్?
అధ్వాన బస్తీలపై అధికారుల దృష్టి
సిటీబ్యూరో: అల్లాఉద్దీన్ కోఠికి.. అద్భుత ఠీవి రానుందా..? ఇప్పుడీ ప్రశ్నకు కారణముంది. అల్లాఉద్దీన్ కోఠి అధ్వాన్నపు ప్రాంతంగా ప్రసిద్ధి. పేరుకుపోయిన చెత్తకుప్పలు.. కలుషిత జలాలు నిత్య సమస్యలు. వీటికి తోడు చీకటి పడితే గాఢాంధకారం. నగరంలోని అధ్వాన్నపు బస్తీల్లో ముందు వరుసలో ఉండే దీనికి ఇన్‌చార్జిగా సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వ్యవహరించనున్నారా.. ? అంటే అనధికార సమాచారం మేరకు అవుననే వినిపిస్తోంది. ఈనెల 16 నుంచి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్‌ను 400 యూనిట్లుగా విభజిస్తామని, వాటిల్లో ఒక యూనిట్‌కు తాను కూడా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తానని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం తెలిసిందే.
అందుకనుగుణంగా ఆయన సనత్‌నగర్ సమీపంలోని ఈ ప్రాంతాన్ని స్వీకరించవచ్చుననే అంచనాలున్నాయి. అధికారులు ఈ బస్తీ గురించి ఆయన దృష్టికి తేనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా వంటి అధ్వాన్నపు ప్రాంతాలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ వంటివారు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. ఈ బస్తీలకు ఇన్‌ఛార్జిలుగా వీరి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. వారి అనుమతితో వారికి ఆ యూనిట్ల ఇన్‌చార్జిలుగా ప్రకటించనున్నారు.