
కెసిఆర్-తలసాని
తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో దాదాపు గంటసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు.
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుతో దాదాపు గంటసేపు ఏకాంతంగా సమావేశమయ్యారు. తలసాని కూడా టిఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి ఈ భేటీ మరింత బలం చేకూరుస్తోంది. తెలంగాణ శాసనసభ టీడీపీ పక్ష నాయకుడి పదవిని ఆశించిన తలసాని ఆ పదవి లభించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు తెలుస్తోంది. ఆ పదవికి ఎర్రబెల్లి దయాకరరావును ఎంపిక చేసిన విషయం తెలిసిందే. తలసానికి ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు సన్నిహితుడు. ఆయన రాయబారం ఫలితంగా తలసాని టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. తలసానితో పాటు పలువురు టిడిపి నేతలు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం. తలసాని విజ్ఞప్తి మేరకు కెసిఆర్ ఈ సాయంత్రం సనత్ నగర్లోని ఐడిహెచ్ కాలనీ సందర్శించనున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణలో టిడిపికి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర రావు పార్టీకి రాజీనామా చేసి, టిఆర్ఎస్లో చేరనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర్లు, సలీం టిఆర్ఎస్లో చేరిపోయారు. తుమ్మల చేరుతున్నట్లు ప్రకటించారు. తలసాని కూడా చేరితో ఆ పార్టీ పరిస్థితి తెలంగాణలో దిగజారిపోతున్నట్లు భావించాలి.