పెను దుమారం రేపిన దిగ్విజయ్ ట్వీట్!
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్విట్టర్ లో షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ ఫొటోలో ఇద్దరు ప్రముఖ వ్యక్తుల ముఖాలు అర్ధభాగాలున్నాయి. కుడివైపు ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎడమ అర్ధభాగం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్న ఫొటోను దిగ్విజయ్ షేర్ చేశారు. రెండు మతాల ప్రచారం, అభివృద్ధి కోసం పాటుపడే వీరివల్ల సామాజిక దూరం పెరుగుతుందని దిగ్విజయ్ ట్వీట్ చేయడం సంచలనం సృష్టించింది. తనకు ఓ ఫ్రెండ్ ఈ ఫొటోను షేర్ చేసినట్లు దిగ్విజయ్ చెప్పుకొచ్చారు. అయితే ఆ ఫోటోపై అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా దిగ్విజయ్, ఒవైసీల మధ్య మాటల యుద్ధం నడిచింది.
కాంగ్రెస్ నేత ముస్లింలను అవమానపరిచే విధంగా ప్రవర్తించారని ఒవైసీ వ్యాఖ్యానించారు. తన ఫొటోను అలా చేయడంతో తనకేం సమస్య లేదని అయితే ఈ చర్యతో ముస్లింలందర్నీ అవమానపరిచారని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలన కాలంలో భిన్న మతాల మధ్య సామాజిక దూరం లేదన్న విషయాన్ని ఒవైసీ తెలుసుకోవాలని దిగ్విజయ్ వ్యాఖ్యానించగా... మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బిహార్, అస్సాం రాష్ట్రాలలో మసీదులలో విగ్రహాలు పెట్టలేదా.. బాబ్రీ మసీదు విధ్వంసం తర్వాత అందులోనూ విగ్రహాలు ఉంచడం నిజం కాదా? అని ఒవైసీ ప్రశ్నించారు.
1992 డిసెంబర్, 1993 జనవరిల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ముంబయిలో మత ఘర్షణలు చోటుకున్నాయని, శ్రీకృష్ణ కమిషన్ నివేదిక మీద చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. 1993 బాంబు పేలుళ్ల కేసులో దోషి యాకుబ్ మెమన్ ను ఉరితీయడంతో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మొసలి కన్నీళ్లు కారుస్తుందంటూ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీని నీ ఇంట్లో పెళ్లిళ్లకు ఆహ్వానించడమే కాకుండా, ఆ ఫొటోలను పోస్ట్ చేస్తారంటూ మండిపడ్డారు. ముస్లింలు, దళితులు విద్య, ఉద్యోగం, ఇళ్లు ఇలా ప్రతిరంగాలలో వారి హక్కులను పొందగలిగినప్పుడే దేశంలో లౌకికవాదం బలపడుతుందని ఎంఐఎం ఎంపీ అభిప్రాయపడ్డారు.
The Two Perpetrators of Religious Fanaticism who are destroying Social Fabric of this Country. Image sent by a friend pic.twitter.com/8xWLg5yov6
— digvijaya singh (@digvijaya_28) September 22, 2015