హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
- చిలకలగూడలో అత్యధికంగా 2.5 సెం.మీ భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో మంగళవారం నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. చిలకలగూడలో రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా 2.5 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 1.8, ఉప్పల్‌లో 1.6, చార్మినార్‌లో 1.3, ఫీవర్ ఆస్పత్రి వద్ద 1.3, షేక్‌పేట్‌లో 1.2, మల్కాజ్‌గిరిలో 1.1, నారాయణగూడలో 1.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పలు చోట్ల కురిసిన వర్షానికి రహదారులపై వరదనీరు పోటెత్తింది. సాయంత్రం వేళ కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు, విద్యార్థులు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. మరో 48 గంటలపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేటలోని వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు మోస్తరు వర్షాలు...
రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులపాటు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డెరైక్టర్ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అలాగే రెండ్రోజుల్లో బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 21, 22, 23 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. గడచిన 24 గంటల్లో మణుగూరులో 7 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ఆత్మకూరు, గూడూరుల్లో 6 సెంటీమీటర్ల చొప్పున, సిర్పూరు, హైదరాబాద్, గుండాలల్లో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.