సాక్షి, హైదరాబాద్: ఆయన ఆత్మ విశ్వాసం ముందు అంగవైకల్యం ఓడిపోయింది. పట్టుదలతో సాధించిన విజయం యువతకు స్ఫూర్తిగా నిలిచింది. బతుకుదెరువు కోసం అటెండర్‌గా పని చేసిన ఆయన ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి అర్హత సాధించారు. ఆయనే సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలా నికి చెందిన దళిత యువకుడు పిట్ల నర్సింహులు. మంత్రి కె.తారకరామారావు ఇచ్చిన చేయూతే నర్సింహులు జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడాయనకు మంత్రి మరింత భరోసా కల్పించారు. రూ. 2 లక్షలు నగదు అందించారు. గుడిసెలో నివాసం ఉంటున్న వారి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు.
పేదరికం కారణంగా..
పిట్ల నర్సింహులుకు పుట్టుకతోనే అంగవైకల్యం. అయినా విధిరాతకు ఎదురొడ్డి పీజీ వరకు చదువుకున్నారు. ఆపై చదవాలనుకున్నా పేదరికం అడ్డుపడింది. వయసైపోయిన తల్లిదండ్రులు, పెళ్లీడుకొచ్చిన నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. దాంతో ఏదో ఒక ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఎంత ప్రయత్నించినా ఏ ఉద్యోగమూ దొరకలేదు. దాంతో ఒక రోజు గ్రామ సభకు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కలసి తన గోడు వెళ్లబోసుకున్నాడు.
జీవితంలో ఏదో సాధించాలన్న నర్సింహులు తపనను గుర్తించిన మంత్రి కేటీఆర్.. సిరిసిల్లలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఉద్యోగం ఇప్పించారు. పైచదువులు చదవాలని, సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. దీంతో నర్సింహులు అటు కుటుంబాన్ని పోషిస్తూనే ఇటు చదువుకున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష (జేఆర్‌ఎఫ్)లో ఉత్తీర్ణత సాధిం చారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్.. శుక్రవారం నర్సింహులును తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. ఆయ న విజయాన్ని అభినందించి, రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందించారు.
గుడిసెలో ఉంటున్న నర్సింహులు కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వచ్చే దసరా నాటికి ఆ కొత్త ఇంట్లో భోజనం చేస్తావని నర్సింహులుకు మాటిచ్చారు. ‘‘అంగవైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో జయించిన నర్సింహులు గెలుపు అందరికీ స్ఫూర్తినిస్తుంది. యువతకు నర్సింహులు రియల్ ఇన్‌స్పిరేషన్. స్పష్టమైన లక్ష్యంతో ప్రయత్నిస్తే కష్టాలెన్ని ఎదురొచ్చినా కలను నెరవేర్చుకోవచ్చన్న నిజం మరోసారి స్పష్టంగా తెలిసింది..’’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక అటెండర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన నర్సింహులును చూసి తాము గర్వపడుతున్నామని నర్సింహులుకు ఉద్యోగం ఇచ్చిన వెన్నెల జూనియర్ కాలేజీ ప్రిన్సి పాల్ చైతన్యకుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment