
‘డబ్బా’లతో దోచేస్తారు..!
* ‘ఏటీఎం కేంద్రం’గా కొత్త తరహా మోసం
* డబ్బు వచ్చే చోట ‘డబ్బా’లు పెడుతున్న వైనం
* జోరుగా ఫోన్‌కాల్స్ ద్వారా మోసాలు
* అప్రమత్తంగా ఉండాలంటున్న సైబర్ క్రైమ్ కాప్స్
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ఓ వినియోగదారుడు అబిడ్స్ ప్రాంతంలోని ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. నగదు డ్రా చేసుకునేందుకు మిషన్‌లో కార్డు పెట్టడంతో పాటు మిగిలిన తతంగం పూర్తి చేశాడు. అయితే ఎంత సేపు వేచి చూసినా... డబ్బుతో పాటు స్లిప్ కూడా రాలేదు. సాంకేతిక సమస్యగా భావించి వెనుదిరిగాడు.
ఇది కేవలం సాంకేతిక సమస్య మాత్రమే కాకపోవచ్చు... ఏటీఎం కేంద్రాలను అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్ల కొత్త ఎత్తు కూడా కావచ్చునని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. ఉత్తరాదిలో జోరుగా సాగుతున్న ఈ తరహా మోసాలు నగరంలోనూ చోటు చేసుకునే అవకాశం ఉందని, వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కేవలం ప్రత్యేకంగా తయారు చేసిన డబ్బా, ట్రాన్స్‌పరెంట్ టేప్‌లను ఆధారంగా చేసుకునే నేరగాళ్లు తమ ‘పని’ ఎలా పూర్తి చేసుకుంటున్నారన్న దానిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సీసీలు( కెమెరాలు, సెక్యూరిటీ) లేని కేంద్రాలే లక్ష్యం
చేతిలో ఇమిడిపోయే స్కిమ్మర్లు, కెమెరాలను ఏర్పాటు చేసి ‘ఏటీఎం ఫ్రాడ్స్’ చేయాలంటే నేరగాడికీ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. పైగా ఇందుకు పెట్టుబడి కూడా ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుంది. ‘డబ్బా ఫ్రాడ్’కు పాల్పడే వారికి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడి అవసరం లేకుండానే పని పూర్తవుతోంది. ప్రధానంగా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు లేని, జనసమర్థ ప్రాంతాలు, ప్రధాన రహదారులకు దూరంగా ఉన్న ఏటీఎంలనే వీరు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
‘డబ్బా’ తయారీలోనే ప్రత్యేకం...
ఏటీఎం మిషన్ నుంచి నగదు బయటకు వచ్చే ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు వీరు ప్రత్యేకమైన డబ్బాను రూపొందిస్తున్నారు. ఇది ఓ వైపు మిషన్‌కు ఉన్న మాదిరిగానే క్యాష్ స్లాట్‌ను తలపించేలా ఉంటూ, మరో వైపు ఖాళీగా ఉంటుంది. దీన్ని మిషన్ నుంచి నగదు బయటకు వచ్చే ప్రాంతంలో చాకచక్యంగా అతికించేయడంతో వినియోగదారుడికి ఏటీఎం మిషన్‌లో భాగంగానే కనిపిస్తుంది. ప్రధానంగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు నివసించే ప్రాం తాల్లోని ఏటీఎంలను లక్ష్యంగా ఎంచుకున్న నేరగాళ్లు ప్రతి నెలా మొదటి వారంలోనే ఏటీఎం మిషన్లకు డబ్బాలను అమరుస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారు.
స్లిప్ రాకుండా టేప్...
క్యాష్ స్లాట్ దగ్గర డబ్బాను ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు... బ్యాలెన్స్ స్లిప్ సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వినియోగదారులకు డబ్బు రాకుండా, స్లిప్ వస్తే వారు అనుమానించి, తక్షణం బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. లేదా ఏటీఎం మిషన్‌ను పరిశీలిస్తాడు. వీటిని ఆస్కారం లేకుండా చేసేందుకు నేరగాళ్లు స్లిప్ సైతం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకుగాను స్లిప్ బయటకు వచ్చే భాగంలో ట్రాన్స్‌పరెంట్ టేప్‌ను అతికించేస్తున్నారు.
డబ్బు ‘డబ్బా’లోనే
ఈ ‘ఏర్పాట్లు’ చేసిన ఏటీఎం కేంద్రంలోకి వెళ్లిన వినియోగదారులు కార్డు పెట్టడం నుంచి నగదు ఎంత కావాలో ఎంటర్ చేయడం వరకు అన్నీ పక్కాగా చేసినా... డబ్బు బయటకు రాదు. మిషన్ నుంచి డ్రా అయ్యే సొమ్ము నేరగాళ్లు ఏర్పాటు చేసిన డబ్బాలో పడిపోతుంది. టేప్ ఉన్న కారణంగా స్లిప్ సైతం బయటకు రాదు. దీంతో మిషన్ పని చేయట్లేదని భావించే వినియోగదారులు మరో ఏటీఎంకు వెళ్లిపోతాడు. కాస్త దూరంలో ఉంటూ దీన్ని కనిపెట్టే నేరగాళ్లు వెంటనే వచ్చి డబ్బాలో పడిన నగదు తీసుకుంటారు.
ఎస్సెమ్మెస్ వచ్చినా..
వినియోగదారులు ఏటీఎం మిషన్లను వినియోగించినప్పుడు నగదు బయటకు రాకపోయినా... డ్రా అయినట్లు సంక్షిప్త సందేశం (ఎస్సెమ్మెస్) వచ్చేస్తోంది. దీనిపై సదరు బ్యాంక్ కాల్ సెంటర్‌ను సంప్రదిస్తే 24 గంటల్లో నగదు తిరిగి ఖాతాలోకి వెళ్లిపోతుందని చెప్తున్నారు. సాంకేతిక సమస్యలతో పాటు అనేక సందర్భాల్లో అలానే జరుగుతోంది కూడా. అయితే ‘డబ్బా ఏటీఎం’ను వినియోగించినప్పుడూ వినియోగదారులకు వచ్చే ఎస్సెమ్మెస్‌లు ఈ తరహాకు చెందినవిగానే భావించి నష్టపోతున్నారు.
జోరుగా కాల్స్ మోసాలు
ఫోన్‌కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం తెలుసుకుని టోకరా వేస్తున్న నేరగాళ్లకూ కొదవ లేకుండా పోతోంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులకు రోజుకు కనీసం మూడు ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు వినియోగదారులకు ఫోన్లు చేసి బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుంటున్నారు. డెబిట్ కార్డును ఆధార్‌తో లింకు చేయాలనో, క్రెడిట్ కార్డు వివరాలు అప్‌డేట్ చెయ్యాలంటూ సీవీవీ కోడ్, ఓటీపీలనూ తీసుకుంటున్నారు. ఆపై ఆన్‌లైన్ షాపింగ్స్, క్లోన్డ్ కార్డులతో డబ్బు డ్రా చేసేస్తున్నారు.
అప్రమత్తతే పరిష్కారం
‘ఏటీఎం కేంద్రాల్లో డబ్బాల ద్వారా చేసే నేరాలు, ఫోన్ కాల్స్ ద్వారా జరిగే ఫ్రాడ్స్ బారిన పడకుండా ఉండాలంటే అప్రమత్తతే పరిష్కారం. సెక్యూరిటీ గార్డు, సీసీ కెమెరాలు ఉన్న ఏటీఎం కేంద్రాలనే ఎంచుకోవడం ఉత్తమం. ఆధార్ లింకేజ్ లేదా అప్‌గ్రేడ్ కోసం ఏ బ్యాంకు ఫోన్లు చేయదని గుర్తుంచుకోవాలి. పేపర్లో ప్రకటన ఇవ్వడం, వ్యక్తిగతంగా బ్యాంకునకు రమ్మని కోరతాయి తప్ప ఫోన్ ద్వారా రహస్య వివరాలు అడగవు’
- విజయ్ ప్రకాష్ తివారీ, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్, సీసీఎస్