
ఏకపక్ష నిర్ణయాలు మానుకోండి
వర్సిటీలపై ఏపీ, తెలంగాణకుహైకోర్టు హితవు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పునర్విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న విశ్వవిద్యాలయాల విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకునేంత వరకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఆయా వర్సిటీల విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం మానేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది.సేవల విషయంలో తమతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోలేదన్న కారణంతో విశాఖపట్నంలో ని వరాహ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్ అఫిలియేషన్‌ను రద్దు చేస్తూ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. ఒప్పందం చేసుకోలేదన్న కారణంతో ఒక రాష్ట్రానికి అందిస్తున్న సేవలను అర్ధంతరంగా నిలిపేయడం సరికాదంది. వరాహ కాలేజీ అఫిలియేషన్‌ను రద్దు చేస్తూ జేఎన్‌ఏఎఫ్‌ఏయూ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేసింది.
ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు నోటీసులు జారీచేస్తూ కౌంట ర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ఈమే రకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులిచ్చిం ది. తమ కళాశాల అఫిలియేషన్ రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ వరాహ కాలేజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పునర్విభజన చట్టం నిబంధనలకు విరుద్ధంగా జేఎన్‌ఏఎఫ్‌ఏయూ నిర్ణయం తీసుకుందని పిటిషనర్ తరఫు న్యాయవాది శివరాజు శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. ఈ చట్ట ప్రకారం ఏపీ ప్రభుత్వం తమ సేవలు పొందాలంటే తమ రాష్ట్రం(తెలంగాణ)తో ఒప్పందం చేసుకోవాలని, ఇప్పటిదాకా అలాంటిదేమీలేదని వర్సిటీ తరుపు న్యాయ వాది తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ... ఈ కారణంతో ఎవరి ఇష్టానుసారం వాళ్లు వ్యవహరిస్తామంటే ఎలా అని ప్రశ్నించింది.
మీరెలా నోటిఫికేషన్ ఇస్తారు?
వర్సిటీ వీసీ నిమాయకానికి తెలంగాణ నోటిఫికేషన్ ఇచ్చిన విషయాన్ని శ్రీనివాస్ కోర్టుకు తెలుపగా... రెండు రాష్ట్రాలకు సేవ లందిస్తున్న వర్సిటీకి తెలంగాణ ఎలా నోటిఫికేషన్ ఇస్తుందని కోర్టు ప్రశ్నించింది.