
సీఎం కేసీఆర్‌ను కలిసిన బాలకృష్ణ
హైదరాబాద్: ఇటీవల విడుదలైన తన సినిమా 'డిక్టేటర్' చాలా బాగుందని, ఈ చిత్రాన్ని చూడటానికి రావాలని సీఎం కేసీఆర్ ను ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ ఆహ్వానించారు. ఇది తన 99 వ చిత్రమని, త్వరలో తన కుమారుడు మోక్షజ్ఞను వెండితెరకు పరిచయం చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ 100 వ సినిమాపై కేసీఆర్ ఆరా తీయగా.. ఆదిత్య 369 కు సీక్వెల్ గా సినిమా చేస్తున్నట్టు చెప్పారు. తాను అప్పట్లో ఎన్టీఆర్, ఏయన్నార్ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
బాలకృష్ణ సోమవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్ రోగులకు అందుతున్న సేవలను వివరించారు. రోగుల సౌకర్యార్ధం ఆసుపత్రి ఆవరణలో పలు నిర్మాణాలు చేపట్టామని , వాటిని బీఆర్ఎస్ కింద క్రమబద్ధీకరించాలిన బాలకృష్ణ కోరారు. అందుకు కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. సేవా దృక్పథంతో రోగులను ఆదుకుంటున్న క్యాన్సర్ ఆసుపత్రి విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తుందని సీఎం తెలిపారు.
రోగులతో పాటు, వారికి సహాయకులుగా వచ్చే వారికోసం కూడా కనీస సౌకర్యాలు అందించే విషయంలో శ్రద్ధ చూపాలని సూచించారు. సహాయకులు ఉండటానికి షెల్టర్లు, కనీస వసతులు ఏర్పాటు చేయాలన్నారు. నగరంలోని అన్ని ఆసుపత్రుల వద్ద ఇలాంటి సదుపాయాలు ఉండేలా చూస్తామని చెప్పారు. ఈ విషయంపై ఆసుపత్రుల యాజమాన్యాలతో త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని కేసీఆర్ వెల్లడించారు.