'అంబేద్కర్ కు తెలంగాణ రుణపడి ఉంది'
హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్కు తెలంగాణ రాష్ట్రం రుణపడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం గురువారం ఘనంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం కేసీఆర్ పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ... అంబేద్కర్ రూపొందించిన చట్టం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదని కేసీఆర్ అన్నారు. ఈ ఏడాది నుంచి దళిత విద్యార్థుల కోసం 100 సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, 25 బాలికల, 5 బాలుర రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు.
గిరిజన విద్యార్థుల కోసం 50 రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. దళిత విద్యార్థులకు కేటాయించే ఫారెన్ స్కాలర్ షిప్ రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. అంతకుముందు లోయర్ ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ టవర్స్, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనానికి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి, కేసీఆర్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.