సరిహద్దు తేలలేదు..!
► కొత్త జిల్లాల స్వరూపంపై అయోమయం
► సరిహద్దుల విషయంలో నెలకొన్న అస్పష్టత
► ఇప్పటికీ తయారు కాని జిల్లాల మ్యాప్‌లు
► అన్ని విభాగాల్లోనూ అరకొరగా సమాచారం
► క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న గందరగోళం
సాక్షి, హైదరాబాద్: దసరా రోజున రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను అట్టహాసంగా ప్రారంభించినా.. వాటి సరిహద్దుల విషయంలో అస్పష్టత నెలకొంది. ఏ జిల్లా పరిధిలోకి ఏయే గ్రామాలు వస్తాయి.. వాటి సరిహద్దులేమిటనే గందరగోళం క్షేత్రస్థాయిలో కొనసాగుతోంది. పునర్‌వ్యవస్థీకరణకు అనుగుణంగా కొత్త నైసర్గిక స్వరూపాన్ని సూచించే జిల్లాల రేఖా చిత్రపటాల(మ్యాప్‌లు)ను ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో కొత్త జిల్లాలకు వెళ్లిన అధికారులు సైతం అరకొర సమాచారంతో ఇబ్బంది పడుతున్నారు.
ఆగస్టులో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదాను ప్రకటించిన సందర్భంలో ప్రభుత్వం 27 జిల్లాల మ్యాప్‌లను సైతం విడుదల చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌లో వీటిని పొందుపరిచింది. తీరా కొత్త జిల్లాలు కొలువు దీరిన తర్వాత మ్యాప్‌ల ప్రస్తావన లేకుండా వెబ్‌సైట్‌లో నుంచి పాత మ్యాప్‌లను సైతం అధికారులు తొలిగించారు. మ్యాప్‌ల తయారీ బాధ్యతలను రెవెన్యూ, సీసీఎల్‌ఏ విభాగం తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్(ట్రాక్)కు అప్పగించింది.
ఇప్పటికీ అధికారికంగా రాష్ట్ర చిత్రపటంతో పాటు జిల్లాల మ్యాప్‌లను సైతం ట్రాక్ విడుదల చేయలేదు. పాత జిల్లాల్లో ప్రతి జిల్లాకో వెబ్‌సైట్ ఉంది. అందులో ఆయా జిల్లాకు సంబంధించిన విశేషాలు, వివిధ రంగాల విశిష్ఠతలు, అధికారులు, ప్రజాప్రతినిధుల వివరాలన్నీ పొందుపరిచారు. కొత్త జిల్లాలకు వెబ్‌సైట్‌లను ఏర్పాటు చేసి.. వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచే దిశగా చర్యలు ముందుకు సాగటం లేదు. అలాగే ఏ జిల్లాలో పట్టణ జనాభా ఎంత.. గ్రామీణ జనాభా ఎంత అనేది ఆయా జిల్లా అధికారులు సైతం అంచనా వేసుకోలేని పరిస్థితి నెలకొంది. దాదాపు అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి.
కలెక్టర్లు సహా ఉద్యోగులు అప్ అండ్ డౌన్
అధికారులను ప్రజల చెంతకు చేర్చడంతో పాటు సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. కానీ ఆగమేఘాలపై నిర్ణయం తీసుకున్నందున క్షేత్రస్థాయిలో కనీస సమాచారం అందుబాటులో లేకుండాపోయిందని జిల్లాల్లో బాధ్యతలు చేపట్టిన అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఎక్కువ జిల్లాలున్న వివిధ రాష్ట్రాలకు సీనియర్ అధికారులను పంపి అధ్యయనం చేసిన ప్రభుత్వం ఆరంభంలో ఉండే ఇబ్బందులపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు జిల్లా కేంద్రాల్లో అప్ అండ్ డౌన్ డ్యూటీలకు పరిమితమయ్యారు. రాజధానికి సమీపంలో ఉన్న జిల్లాలకు నియమితులైన కొందరు కలెక్టర్లు హైదరాబాద్ నుంచే వెళ్లి వస్తున్నారు. దీంతో కొత్త జిల్లాల్లో పాలన కుదుటపడలేదు.
కొత్త కలెక్టరేట్లకు ప్రతిపాదనలు
కొత్త జిలాల్లో కలెక్టరేట్లు సహా విభాగాలన్నీ తాత్కాలిక భవనాల్లో సర్దుబాటు చేశారు. దీంతో సమావేశాలకు, సమీక్షలకు కనీస సదుపాయాలు కరవై అధికారులు ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 30 కార్యాలయాలు ఒకేచోట ఉండేలా కలెక్టరేట్ సముదాయం నిర్మిస్తామని పునర్‌వ్యవస్థీకరణకు ముందే సీఎం వెల్లడించారు. దాదాపు రూ.800 కోట్లు ఖర్చుతో వీటిని నిర్మించేందుకు అంచనాలు సైతం సిద్ధం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా తాత్కాలిక అవసరాలకు జిల్లాకో రూ.కోటి విడుదల చేసిన ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ల నిర్మాణానికి సైతం ఫైళ్లు కదుపుతోంది. ఇటీవలే ఒక ప్రైవేటు ఏజెన్సీ రాష్ట్రంలో అవసరమైన జిల్లా కేంద్రాలన్నింటా కలెక్టరేట్ల నిర్మాణానికి ముందుకొచ్చింది. డిజైన్ల తయారీతో పాటు నిర్మాణ పర్యవేక్షణకు అంచనా వ్యయంలో ఒకటిన్నర శాతం ఫీజుగా చెల్లించాలనే ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం ఈ ఫైలు ప్రభుత్వ పరిశీలనలో ఉంది.