కాంగ్రెస్, టీడీపీలు ఏకమై...
టీపీసీసీ నేతలతో టీటీడీపీ నాయకుల సమావేశం
హైదరాబాద్
శత్రువు శత్రువు మిత్రుడన్నట్టు... రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. దశాబ్దాల కాలంగా బద్ధశత్రువులైన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనడానికి బద్ధ శత్రువులైన కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యే ప్రయత్నాలు మొదలయ్యాయి. స్థానిక సంస్థల నుంచి ఎన్నికయ్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని పరస్పరం ప్రతిపాదించాయి.
తెలంగాణ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ నెల 2 న ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, మొత్తం స్థానాలను గెలుచుకోవాలని అధికార టీఆర్‌ఎస్ వ్యూహం పన్నుతోంది. ఇటీవల వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ఘోర పరాభవం నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కొత్త పొత్తులపై దృష్టి సారించాయి.
తాజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పనిచేద్దామన్న ప్రాతిపదికన కొన్ని సీట్లను గెలుచుకోవడానికి కలిసి పనిచేద్దామని టీడీపీ నేతలు కాంగ్రెస్ నాయకుల ముందు ప్రతిపాదించారు. తెలంగాణ పీసీసీ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని సోమవారం టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు మరికొందరు నేతలు కలిసి ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై వారు కొద్దిసేపు చర్చలు జరిపినట్టు తెలిసింది. కలిసి పనిచేయడం వల్ల రంగారెడ్డి, మహబూబ్‌నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించవచ్చని, అందుకు ఒక అంగీకారానికి రావాలని టీడీపీ నేతలు కోరారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈనెల 9వ తేదీతో నామినేషన్ల గడువు పూర్తవుతోంది. డిసెంబర్ 27న పోలింగ్ జరుగుతుంది. తెలంగాణలోని స్థానిక సంస్థల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానం, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కాంగ్రెస్, టీడీపీలు కలిస్తే రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లలో ఒక్కో స్థానం గెలుచుకునే అవకాశం ఉన్నందున రెండింటిలో మహబూబ్‌నగర్ స్థానంలో తమకు మద్దతునివ్వాలని టీటీడీపీ నేతలు కోరినట్టు తెలిసింది. ఇదే అంశంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా నేతలను సంప్రదించగా, వారు ఈ ప్రతిపాదనను ఏకగ్రీవంగా వ్యతిరేకించారు. దాంతో ఏం చేయాలో నేతలకు పాలుపోలేదు. నామినేషన్లు దాఖలు చేయడానికి మరో రెండు రోజులు గడువు ఉన్నందున మంగళవారం మరోసారి సమావేశం కావాలన్న నిర్ణయానికి ఆ నేతలు వచ్చినట్టు తెలిసింది.