డేటాను ఒడిసిపట్టి, విశ్లేషించే.. బిజినెస్ ఎనలిస్ట్ | data, analyze .. Business Analyst | Sakshi
Sakshi News home page

డేటాను ఒడిసిపట్టి, విశ్లేషించే.. బిజినెస్ ఎనలిస్ట్

Published Sat, Aug 23 2014 12:07 AM | Last Updated on Fri, Jun 1 2018 7:37 PM

డేటాను ఒడిసిపట్టి, విశ్లేషించే..  బిజినెస్ ఎనలిస్ట్ - Sakshi

డేటాను ఒడిసిపట్టి, విశ్లేషించే.. బిజినెస్ ఎనలిస్ట్

టాప్ స్టోరీ
 
ఎనలిటికల్ స్కిల్స్ : అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి, దాన్ని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా క్లుప్తీకరించడానికి ఎనలిటికల్ టూల్స్ అవసరం. వీటికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి.

బిజినెస్ స్కిల్స్ : ఓ కంపెనీ కార్యకలాపాలు, లక్ష్యాలు, సమస్యలను అర్థం చేసుకునే నైపుణ్యం అవసరం. అప్పుడే సంబంధిత బిజినెస్ డెరైక్టర్లకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచగలరు.

క్రియేటివ్ స్కిల్స్: సృజనాత్మకంగా ఆలోచించడం ప్రధానం. విశ్లేషణ నివేదికలను బార్/లైన్ గ్రాఫ్స్; సర్క్యులర్ గ్రాఫ్స్ తదితర రూపాల్లో అందించాల్సి ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా గ్రాఫికల్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి.
 
ఒక కంపెనీ/సంస్థ కొత్త ప్రణాళికలను రూపొందించు కునేందుకు డేటా ఎనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కంపెనీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో ఎనలిటిక్స్ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారు. ఉదాహ రణకు ఒక కంపెనీ నగరంలో రిటైల్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే వ్యాపారానికి అవకాశమున్న ప్రాంతం, అందుబాటులో ఉన్న వినియోగదారులు, వారి అభిరుచులు, ఆర్థిక పరిస్థితులు, ఏయే వస్తువులు ఉండాలని కోరుకుం టున్నారు? ఏయే వస్తువులకు డిమాండ్ ఉంది? రిటైల్ రంగంలో ఉన్న ఇతర పోటీదారుల పరిస్థితి ఎలా ఉంది? ఇలా వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించి.. విశ్లేషించి.. సమగ్ర నివేదిక రూపొందించడమే డేటా ఎనలిటిక్స్.
 
ఎనలిటిక్స్ కోర్సులను అందిస్తున్న సంస్థలు
 
ఐఐటీ - హైదరాబాద్
కోర్సులు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ అడ్వాన్స్‌డ్ బిజినెస్ ఎనలిటిక్స్, ఫౌండేషన్స్ ఆఫ్ ప్రిడెక్టివ్ ఎనలిటిక్స్
వ్యవధి: ఐదు రోజులు
వెబ్‌సైట్: www.iith.ac.in/analy/index.html
 
ఐఎస్‌బీ- హైదరాబాద్


హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ (సీబీఏ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల కోర్సు. క్లాస్‌రూం, టెక్నాలజీ ఆధారిత విధానాల ద్వారా బోధన ఉంటుంది.
వెబ్‌సైట్: www.isb.edu
 
ఐఐటీ - బాంబే

కోర్సు: అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్; వెబ్‌సైట్: www.iitb.ac.in
 
 ఐఐఎం- బెంగళూరు


ఎనలిటిక్స్‌లో ఏడాది వ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఇంటర్‌డిసిప్లినరీ పరిశోధనల్లో డేటాను వినియోగించడం కోసం ప్రత్యేకంగా డేటా సెంటర్‌ను, ఎనలిటిక్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది.
 వివరాలకు www.iimb.ernet.in
 
ఐఐఎం- కోల్‌కతా


ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ (ఉ్కఆఅ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు. 50 శాతం మార్కులతో బీఎస్సీ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం. ఏదైనా కంపెనీలో పనిచేస్తుండాలి.
 వెబ్‌సైట్: www.iimcal.ac.in
 
ఐఐఎం-లక్నో

కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియానా యూనివర్సిటీ,
 యూఎస్‌ఏలతో సంయుక్తంగా ఐఐఎం-లక్నో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఆఫర్ చేస్తోంది. క్లాస్‌రూం, ఆన్‌లైన్ విధానాల్లో బోధన ఉంటుంది. వెబ్‌సైట్: www.iiml.ac.in
 
ఐఐఎం- అహ్మదాబాద్


మేనేజ్‌మెంట్ నిపుణుల కోసం అడ్వాన్స్‌డ్ ఎనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో కోర్సులను అందిస్తూ విశేష ఆదరణ పొందిన మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సెస్ (మూక్).. తన ప్రొవైడర్స్ ఎడెక్స్ (www.edx.org), కోర్సెరా (www.coursera.org) ద్వారా ఎనలిటిక్స్‌లో ఎన్నో సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇవేకాకుండా ఐఐటీ - ఖరగ్‌పూర్, ఐఐటీ - రూర్కీ.. బిజినెస్ ఎనలిటిక్స్‌లో స్వల్పకాలం వ్యవధి ఉన్న కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఎన్‌ఐఐటీ లిమిటెడ్.. బిజినెస్ ఎనలిటిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
 
ఎవరు అర్హులు?


కొన్ని సంస్థలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంజనీరింగ్/బిజినెస్ మేనేజ్ మెంట్/సైన్స్/కామర్స్/ మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో బ్యాచిలర్‌‌స డిగ్రీని అర్హతలుగా పేర్కొంటున్నాయి. మరికొన్ని మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశిస్తున్నాయి. పని అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే విశ్లేషణా సామర్థ్యం, అకడమిక్స్‌లో మంచి ప్రతిభ ఉంటే ఫ్రెషర్స్‌కు కూడా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
 
 
నగరంలో ఎన్నో ఉద్యోగాలు


సిటీలో ఎన్నో బహుళజాతి సంస్థలు, స్వదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఐటీ సర్వీసెస్; ఎడ్యుకేషన్; మ్యానుఫ్యాక్చరింగ్; మార్కెటింగ్; ట్రావెల్ అండ్ టూరిజం; హెల్త్‌కేర్, బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ సంస్థల వరకు ఎన్నో నగరంలో కొలువుదీరాయి. ఇవి వ్యాపారాభివృద్ధికి బిజినెస్ ఎనలిటిక్స్ నిపుణులపైనే ఆధారపడ్డాయి. ఇందుకోసం భారీ స్థాయిలో జీతాలు ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి నగరంలో బిజినెస్ ఎనలిస్టులకు అవకాశాలు కోకొల్లలు. ఔత్సాహికులు ఫ్రెషర్స్‌గా లేదా రెండు-మూడేళ్ల పని అనుభవంతో బిజినెస్ ఎనలిటిక్స్‌లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు.. జూనియర్ బిజినెస్ ఎనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్; సీనియర్ బిజినెస్ ఎనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్; అసిస్టెంట్ మేనేజర్ (బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమర్ ఎనలిటిక్స్); డేటా మోడలర్(బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనలిటిక్స్); బిజినెస్ కన్సల్టెంట్ (ఫైనాన్షియల్ ఎనలిటిక్స్); బిజినెస్ కన్సల్టెంట్ (బీపీవో/కేపీవో/ఐటీఈఎస్); ప్రాజెక్టు మేనేజర్ (ఎనలిటిక్స్); టీమ్ లీడర్.
 
 వేతనాలు


ప్రతిభ ఉన్న ఎనలిటిక్స్ నిపుణులకు కార్పొరేట్ కంపెనీలు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్ చేస్తున్నాయి.
 
స్కిల్డ్ ఎనలిస్ట్‌లకు భారీ డిమాండ్


‘‘మార్కెటింగ్‌లో ఊహించని మార్పులను విశ్లేషించి చెప్పగలిగే నిపుణులే.. ఎనలిస్ట్‌లు. గతం, వర్తమాన, భవిష్యత్తు అంశాలను విశ్లేషించగలిగే నేర్పు, ఓర్పులే ఎనలిస్ట్ కావాలనుకునే వారికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ప్రస్తుతం జాబ్‌మార్కెట్‌లో స్కిల్డ్ ఎనలిస్ట్‌లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ సరిపడినంత నిపుణులు లేరు.  ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలను కుంటే మ్యాథమెటిక్స్, అల్గారిథమ్, స్టాటిస్టిక్స్, గ్రాఫ్ థియరీ, అపరేషన్ రీసెర్చ్ వంటి అంశాల్లో పరిజ్ఙానం పెంచుకోవాలి. ఐఐటీ ముంబై, కాన్పూర్, చెన్నై, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో డేటా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా ఎనాలసిస్‌లో పూర్తిస్థాయి నైపుణ్యం సంపాదిస్తే అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు’’

 - ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి, ఐటీఆర్‌ఏ ప్రోగ్రాం డెరైక్టర్, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement