బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం.3 ఖైరతాబాద్ మండల పరిధిలోని పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో నిర్మించిన అక్రమ కట్టడాలను శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. శ్మశాన వాటికలో అమ్మవారి గుడిని అడ్డుగా పెట్టుకొని నిర్మించిన పది గదులను నేలమట్టం చేశారు. కొంతకాలంగా అమ్మవారి గుడి పక్కన అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తుండగా పంజగుట్ట హిందూ శ్మశానవాటిక కమిటీతోపాటు స్థానికులు కొందరు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. గత నాలుగేళ్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించలేదు. ఇటీవల నాలాలు, చెరువుల ఆక్రమణలను కూల్చివేయాలని స్వయంగా మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఇదే అదనుగా జీహెచ్‌ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు శ్మశాన అక్రమ నిర్మాణాల తొలగింపుకు రంగంలోకి దిగారు.
బంజారాహిల్స్ పోలీసులు వంద మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా అధికారులు బుల్డోజర్లు, జేసీబీల సహాయంతో గదులన్నింటిని నేలమట్టం చేశారు. అమ్మవారి గుడికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు ఒకరిద్దరు ప్రయత్నించగా పోలీసులు వారిని వారించారు. మూడు రోజుల నుంచి శ్మశానంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నించగా స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వాయిదా పడుతూ వచ్చినా ఎట్టకేలకు కూల్చివేతల కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు ఫెన్సింగ్ వేసి రక్షిస్తారా, మళ్లీ గాలికొదిలేస్తారా అన్నది చూడాల్సి ఉంది.
పంజగుట్టలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
Published Sat, Oct 1 2016 5:03 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement
Advertisement