ఇక కూల్చుడే!
111 జీఓ పరిధిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై జిల్లా యంత్రాంగం కొరడా ఝళిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన కట్టడాలను కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరిధిలోని 83 గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి ఆక్రమణల జాబితా రూపొందించిన జిల్లా యంత్రాంగం.. వాటిని నేలమట్టం చేసే దిశగా కార్యాచరణ రూపొందించింది.
అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలి. అక్రమార్కుల భరతం పట్టని పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ విస్తరణా అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం. - అరుణ, జిల్లా పంచాయతీ అధికారి
హైదరాబాద్ నగర ప్రజల దాహర్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతం నుంచి వరద జలాలు వచ్చేలా.. కాలుష్యాన్ని నియంత్రించేందుకు తీసుకొచ్చిందే
111 జీఓ. ఈ జీఓను తుంగలో తొక్కుతున్న రియల్టర్లు, బడాబాబులు, పారిశ్రామిక వేత్తలు, విద్యాసంస్థల యాజమాన్యాలు అడ్డగోలుగా సాగర గర్భంలోనే నిర్మాణాలు చేపట్టారు. అనధికారికంగా వెలిసిన 426 లేఅవుట్లను తొలగించాలని, అక్రమంగా పుట్టుకొచ్చిన 12,446 నిర్మాణాలను కూల్చివేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. 111 జీఓ ఉల్లంఘనులపై యంత్రాంగం కొరడా అక్రమ కట్టడాలను తొలగించేందుకు కార్యాచరణ ఆక్రమణలను కూల్చని కార్యదర్శులపై కఠిన చర్యలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జంట జలాశయాల అస్థిత్వానికి ముప్పుగా పరిణమించిన నిర్మాణాలను తొలగించాల్సిందేనని.. జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేయడంతో వాటిని కూల్చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని ఆదేశిస్తూ జిల్లా పంచాయతీ అధికారి ఆరుణ ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమార్కుల భరతం పట్టని పంచాయతీ కార్యదర్శులు, పంచాయతీ విస్తర్ణాధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ నగర ప్రజల దాహర్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పరీవాహక ప్రాంతం నుంచి వరద జలాలు వచ్చేలా.. కాలుష్యబారిన పడకుండా నియంత్రించేందుకు ప్రభుత్వం 111 జీఓ జారీ చేసిన సంగతి తెలిసిందే.
అయితే, కాలక్రమంలో ఈ జీఓను తుంగలో తొక్కుతున్న రియల్టర్లు, బడాబాబులు, పారిశ్రామిక వేత్తలు, విద్యాసంస్థల యాజమాన్యాలు అడ్డగోలుగా సాగర గర్భంలోనే నిర్మాణాలు చేపట్టారు. బహుళ అంతస్తుల భవనాలు, విల్లాలు, లేఅవుట్లు వేస్తూ జీఓ సహాజ సూత్రాన్ని విస్మరించారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కొందరు నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. జీఓ అమలులో అక్రమాలు జరుగుతున్నాయని ట్రిబ్యునల్‌కు నివేదించారు. గ్రీన్ ట్రిబ్యునలేకాకుండా హైకోర్టులో కూడా పలు పిటిషన్లు దాఖలవుతుండడంతో జిల్లా యంత్రాంగం కదిలింది. తలనొప్పిగా మారిన 111 జీఓ అమలుపై సీరియస్‌గా దృష్టి సారించాలని నిర్ణయించింది.
దీనికి అనుగుణంగానే ఇటీవల క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి ఆక్రమణల చిట్టా తయారు చేసింది. వీటన్నింటిపై ఉక్కుపాదం మోపే దిశగా కార్యాచరణ తయారు చేసింది. అనధికారికంగా వెలిసిన 426 లేఅవుట్లను తొలగించాలని సంకల్పించింది. అక్రమంగా పుట్టుకొచ్చిన 12,446 నిర్మాణాలను కూడా కూల్చివేయాలని నిర్ణయించింది. 111 జీఓ ఆంక్షలను ఉల్లంఘించి వెలిసిన పరిశ్రమలు, రైస్‌మిల్లులు, శీతల గిడ్డంగులు, ఇటుకబట్టీలు, మార్బుల్, ఫర్నిచర్ యూనిట్లు, విద్యాసంస్థల బహుళ అంతస్తు భవనాల పని పట్టే దిశగా అడుగులు వేస్తోంది.