హోంగార్డులు ఆందోళన విరమించాలి: డీజీపీ
హైదరాబాద్: సమస్యల పరిష్కారానికి ఉద్యమబాట పట్టిన హోంగార్డులు వెంటనే విధుల్లో చేరాలని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ సూచించారు. హోంగార్డుల సమస్యలను పోలీసు శాఖ అర్థం చేసుకుంటుందని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన వెల్లడించారు. యూనిఫామ్ ఉద్యోగాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ఆందోళనల బాట పట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. హోంగార్డులు ప్రస్థావించిన సమస్యలను చీఫ్ సెక్రెటరీ, సీనియర్ అధికారులు పరిశీలిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హోంగార్డుల కోసం దేశంలోనే అత్యధిక వేతనం ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా డీజీపీ గుర్తుచేశారు. ఆందోళనలు ముగించి విధుల్లో చేరకపోతే చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
గురువారం సీఎస్ రాజీవ్‌శర్మతో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో.. హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. ఇందిరాపార్కు నుంచి ర్యాలీగా వచ్చిన హోంగార్డులు సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హోంగార్డులను అడ్డుకున్నారు. ఓ హోంగార్డు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్యోగ భద్రతపై సీఎం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలని హోంగార్డులు డిమాండ్ చేస్తున్నారు.