ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష
విపక్షాలవి అర్థం లేని ఆరోపణలు: మంత్రి లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్ : పాలమూరు ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసరంగా నోరు పారేసుకుంటున్నాయని, మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటే ఉలిక్కి పడుతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలమూరు ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ప్రాజెక్టుల గురించి అసలు పట్టించుకోలేదని విమర్శించారు. జిల్లాలో ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్ ఉనికి కోల్పోతుందన్నారు.
కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు మానుకుని అభివృద్ధికి కలసి రావాలని మంత్రి హితవు పలికారు. జిల్లా ప్రాజెక్టుల విషయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారని, తమ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల వల్ల 4.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు పాలమూరు జిల్లా ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించారని దుయ్యబట్టారు. కాం గ్రెస్ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసింది కానీ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని మంత్రి లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.