గోదావరి బరి.. పాతబస్తీ కోడి
సంక్రాంతి సమరానికి సన్నద్ధం
పుంజు ధర రూ.1.5 లక్షలు!
చాంద్రాయణగుట్ట: సంక్రాంతి సమరానికి పాతబస్తీ కోడిపుంజులు కాలు దువ్వుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కత్తులు దూసేందుకు సిద్ధమవుతున్నాయి. పండుగ వేళ పందెంలో మజా పొందాలంటే పాత బస్తీ పుంజులు ఉండాలని పందెం రాయుళ్లు కోరుకుంటారు. కుస్తీ పోటీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చే ఇక్కడి పహిల్వాన్లు.. కోడిపుంజులను సైతం ఎంతో శ్రద్ధగా పెంచుతారు. వాటికి శిక్షణ సైతం ఇస్తారు. అందుకే ఇక్కడి పుంజులంటే అంతే మో జు. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహించడం తెలిసిన విషయమే. ఈ రెండు జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో కూడా పందేలు జరుగుతుంటాయి. కోట్ల రూపాయలు చేతులు మారే పోటీల్లో పందెంరాయుళ్ల పంట పండించే కోడిపుంజులు పాతబస్తీ నుంచి ఎగుమతి కావడం విశేషం. అందుకే పాతబస్తీ కోడి పుంజుకు లక్షల రూపాయలు వెచ్చించేందుకు వెనుకాడరు.
కాస్ట్లీ ఫుడ్డు.. మసాజ్..
పహిల్వాన్లు పెంచే కోడి పుంజులకు విటమిన్స్‌తో కూడిన ఆహారాన్ని అందిస్తారు. బాదం, పిస్తా, ఆక్రోట్స్, కీమా, ఉడికించిన గుడ్ల తెల్లసొన ఆహారంలో భాగం. తిండి పెట్టి సరిపెట్టరు.. ప్రతి కోడికి నిత్యం ప్రత్యేకంగా పందెం శిక్షణ ఇస్తూ కదనరంగంలో దూకేలా తర్ఫీదునిస్తారు. అందుకోసం ప్రత్యేక కోచ్‌లను సైతం నియమిస్తారు. వారు పుంజులకు మసాజ్ చేయడం, పరిగెత్తడం, ఈత వంటి వాటిలో శిక్షణనిస్తారు. బార్కాస్, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాలలోని కొంత మంది ఫహిల్వాన్ల వద్ద మాత్రమే ఇలాంటి కోడిపుంజులున్నాయి. వీరు పరిమిత సంఖ్యలో కోళ్లకు మాత్రమే ఈ శిక్షణనిస్తారు. అందుకే ఇక్కడి పుంజులకు ఎంత రేటైనా పెట్టేందుకు సిద్ధమవుతారు.
నచ్చిందంటే లక్షలు పెట్టాల్సిందే..
కోస్తాంధ్ర, రాయలసీమలో సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల కోసం పందెం రాయుళ్లు బార్కాస్‌లో వాలిపోతుంటారు. ఇక్కడి పహిల్వాన్ల వద్ద నుంచి పుంజు తీసుకెళితే పందెంలో విజయం తథ్యమని చాలామంది నమ్మకం. జాతి, రంగును బట్టి ఒక్కో కోడిపుంజు ధర రూ.50 వేల నుంచి లక్షన్నర రూపాయల వరకు పలకడం విశేషం. అలాగని వీరు కోళ్ల వ్యాపారం చేస్తారనుకుంటే పొరపాటే. ఎంతో దగ్గరి వ్యక్తులకు మాత్రమే ఏడాదికి పరిమిత సంఖ్యలో కోడిపుంజులను విక్రయిస్తుంటారు. ఈ కోళ్ల కోసం ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లు ఏర్పాటుచేసి పెంచుతారు. రెండేళ్ల వయసున్న పుంజులనే పందానికి వినియోగిస్తారు