- చికాకు పడిన మేయర్
- మధ్యలో నిలిచిన కార్యక్రమం
- ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పలువురి ఫిర్యాదు
సాక్షి,సిటీబ్యూరో: మేయర్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల వేదిక ‘ఫేస్ టూ ఫేస్’ అభాసుపాలైంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజాఫిర్యాదుల్ని పరిష్కరించేందుకు ప్రతినెలా మొదటి శనివారం గంటసేపు నిర్వహిస్తున్నారు. ఇందులో తొలి అరగంట ఫోన్ల ద్వారా వచ్చే ఫిర్యాదుల్ని..అనంతరం వ్యక్తిగతంగా ఇచ్చే ఫిర్యాదుల్ని స్వీకరిస్తారు.
శనివారం కార్యక్రమం ప్రారంభం కావడమే నిర్ణీత సమయం కంటే కొద్దిగా ఆలస్యమైంది. ప్రారంభమయ్యాక కూడా ఫోన్ ద్వారా అందే ఫిర్యాదులు మేయర్‌కు సరిగ్గా వినిపించకపోవడం.. మధ్యమధ్య అవాంతరాలు ఎదురవడంతో చిరాకుకు గురైన మేయర్ టెలిఫోన్ ఫిర్యాదులు ఆపాల్సిందిగా ఆదేశించారు. ప్రతినెలా దాదాపు 20 ఫిర్యాదుల్ని ఫోన్‌ద్వారా స్వీకరించేవారు. అలాంటిది ముగ్గురి ఫోన్‌కాల్స్‌తోనే మేయర్ ఫోన్ కార్యక్రమాన్ని ముగించి, వ్యక్తిగత దరఖాస్తుల్ని స్వీకరించారు.
జీహెచ్‌ఎంసీలో వివిధ విభాగాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేవని ప్రజలు విమర్శిస్తుండ గా..ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ సైతం సక్రమంగా లేకపోవడం జీహెచ్‌ఎంసీ పనితీరుకు అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానించారు. వ్యక్తిగతంగా హాజరైన వారు కూడా ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోయారు. మలేసియా టౌన్‌షిప్‌లో అక్రమ నిర్మాణాల్ని అడ్డుకోవాలని, ప్రజారోడ్డును మూసివేసిన వారిపై ఇంతవరకు ఎలాంటి చర్యల్లేవని గతంలో ఫిర్యాదు చేసిన గోపాలరావు మరోమారు ఫిర్యాదు చేశారు.
ఎన్నిమార్లు ఫిర్యాదు చేసినా కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇచ్చిన నీటి, కరెంటు కనెక్షన్లు తొలగించాల్సిందిగా పదేపదే ఫిర్యాదులు చేసిన సీహెచ్ కృష్ణ సంబంధిత డాక్యుమెంట్లతో మరోమారు విషయాన్ని మేయర్ దృష్టికి తెచ్చారు. ఇకపై ఫేస్ టూ ఫేస్‌కు కాకుండా తన చాంబర్‌కు రావాల్సిందిగా మేయర్ ఆయనకు సూచించారు. దాదాపు 20 ఫిర్యాదులు వ్యక్తిగతంగా అందజేశారు.