దళిత మహిళపై గ్యాంగ్ రేప్!
- సంగారెడ్డిలో ఘటన..
- బాధితురాలి కథనంతో బహిర్గతం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/నర్సాపూర్: ఓ దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిపిన ఘటన మెదక్ జిల్లా సంగారెడ్డిలో కలకలం రేపింది. బస్సుకోసం ఎదురు చూస్తున్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులోనే అత్యాచారం జరిపినట్టు తెలిసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక సదరు మహిళ తీవ్ర రక్తస్రావంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి చేరింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కథనం ప్రకారం.. కౌడిపల్లి మండలం జగ్గంపేటకు చెందిన దళిత మహిళ శుక్రవారం రాత్రి స్వగ్రామానికి వెళ్లేందుకు నర్సాపూర్ బస్టాండ్‌లో నిలబడింది.
అదే సమయంలో కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు తాము కూడా అటు వైపే వెళ్తున్నామని చెప్పి అందులోకి ఎక్కించుకున్నారు. అనంతరం ఆ కారును జగ్గంపేట వైపునకు కాకుండా సంగారెడ్డి వైపునకు తీసుకెళ్లారు. అరిస్తే చంపుతామని ఆ మహిళను బెదిరిం చారు. సంగారెడ్డి శివారులోని ఓ ఆలయం సమీపంలో ఉన్న పొదల్లోకి కారును తీసుకెళ్లి అందులోనే ఐదుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారం జరిపారు. సామూహిక అత్యాచారంతో మహిళకు తీవ్రంగా రక్తస్రావమైంది. దుండగులు ఆమెను సంగారెడ్డి ఆస్పత్రి వద్దకు తీసుకొచ్చి.. వదిలేసి వెళ్లిపోయారని బాధితురాలు పేర్కొం ది. సదరు మహిళ వాంగ్మూలం ఆధారంగా సామూహిక అత్యాచార కేసులు నమోదు చేశామని నర్సాపూర్ ఎస్‌ఐ వెంకటరాజుగౌడ్ తెలిపారు.
సామూహిక అత్యాచారం కాదు: పోలీసులు
బాధితురాలు చెప్పినట్టు సామూహిక అత్యాచారం జరిగి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు మహిళ వద్ద నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులోని నంబర్ల ఆధారంగా ఆరా తీశారు. ఓ గిరిజన యువకుడిని గుర్తించి, ఆ దిశగా విచారణ జరపగా ఆసక్తికరమైన వివరాలు వెలుగు చూశాయి. పోలీసుల కథనం ప్రకారం.. కౌడిపల్లి మండలం జగ్గంపేటకు చెందిన దళిత మహిళకు శివ్వంపేట మండలంలోని ఓ తండాకు చెందిన గిరిజన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి వారిద్దరూ నర్సాపూర్ నుంచి పటాన్‌చెరుకు బైక్‌పై వెళ్లి, బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జిలో దిగారు. రూ.900 చెల్లించి సదరు వ్యక్తి పేరుపై ఓ గది బుక్ చేసుకున్నారు. ఇద్దరూ కలిసి బిర్యానీ తిన్నారు. ఆపై వారు సన్నిహితంగా మెలిగారు. ఈ దశలోనే ఆమెకు రక్తస్రావమైంది.చికిత్స చేయించుకుంటే వివాహేతర సంబంధం బయట పడుతుందన్న భయంతోనే వారు ఈ కట్టుకథ అల్లారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆ మహిళకు రక్తస్రావం తీవ్రం కావడంతో సదరు యువకుడే బైక్‌పై ఆమెను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వదిలేశాడని పోలీసులు చెబుతున్నారు.
టీఆర్‌ఎస్ హయాంలోనే దాడులు పెరిగాయి
కాంగ్రెస్ పార్టీ నేతలు సునీతా లక్ష్మారెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. సామూహిక అత్యాచారానికి గురైన నర్సాపూర్‌కు చెందిన మహిళను సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో శనివారం మాజీ మంత్రులు సునీతా లకా్ష్మరెడ్డి, గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితో కలసి మాట్లాడుతూ..తెలంగాణలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయని, పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదని విమర్శించారు. కాగా, బాధితురాలు కోలుకుంటోందని, ప్రాణహాని లేదని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.