అదే సీన్ పరేషాన్ | give to the outside of the bus so security | Sakshi
Sakshi News home page

అదే సీన్ పరేషాన్

Published Fri, May 8 2015 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

అదే సీన్  పరేషాన్

అదే సీన్ పరేషాన్

ఒక్క బస్సు బయటకు రావాలంటే ఇంత బందోబస్తు తప్పదు..
 
రోడ్డెక్కిన 531 బస్సులు
అయినా ప్రయాణికులకు తప్పని ఇబ్బందులు
అన్ని డిపోల వద్ద కార్మికుల ఆందోళన
అదనంగా ఎంఎంటీఎస్ సర్వీసులు
యథావిథిగా ప్రైవేటు వాహనాల దోపిడీ

 
మెట్టు దిగని ప్రభుత్వం.. పట్టు వీడని ఆర్టీసీ కార్మికులు.. వెరసి మూడో రోజూ ప్రయాణికులు అవస్థలు పడ్డారు. పోలీసుల రక్షణ మధ్య
 అధికారులు శుక్రవారం కొన్ని బస్సులను డిపోల నుంచి బయటకు తీశారు. అడ్డుకున్న కార్మికులను అరెస్టు చేశారు. నిరసనలు..
 ఆందోళనల మధ్య 531 బస్సులను రోడ్డెక్కించారు. ప్రైవేటు వాహనాల దోపిడీ పర్వం కొనసాగింది.
 
సిటీబ్యూరో: కార్మికుల సమ్మె కారణంగా నిలిచిపోయిన బస్సులు మూడో రోజుకు (శుక్రవారం) కొద్దిగా పెరిగాయి. రాత్రి వరకు సుమారు 531 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. దీంతో ఏపీ ఎంసెట్‌కు హాజరైన విద్యార్థులు, ఉద్యోగులకు కొంత మేర ప్రయాణ సదుపాయం లభించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేట్ సిబ్బంది సహాయంతో ప్రధాన రూట్లలో కొన్ని బస్సులు తిప్పినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు మాత్రం తప్పలేదు. లక్షలాది మంది సెట్విన్ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు, ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఆటోవాలాలు, ప్రైవేట్ వాహనదారులు యథావిథిగా తమ దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. ద.మ.రైల్వే ప్రతి రోజు నడిపే 121 సర్వీసులతో పాటు సికింద్రాబాద్- లింగంపల్లి మార్గంలో మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులు శుక్రవారం అదనంగా నడిపింది. రోజు వారి రాకపోకలు సాగించే లక్షా 60 వేల మందికి తోడు 40 వేల మంది ప్రయాణికులు అదనంగా ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు.

నిరసనలు.. ఆందోళనలు..

మరోవైపు నగరంలోని 28 డిపోలు, ప్రధాన బస్‌స్టేషన్ల వద్ద కార్మిక సంఘాలు ధర్నాలు, ఆందోళనలు చేపట్టాయి. హయత్‌నగర్,  కంటోన్మెంట్, ఉప్పల్, బర్కత్‌పురా తదితర డిపోల్లో జరిగిన ధర్నాల్లో టీఎంయూ నేతలు అశ్వద్ధామరెడ్డి, థామస్‌రెడ్డి తదితరులు పాల్గొని యాజ మాన్య వైఖరిని నిరసించారు. ‘ఎస్మా’ చట్టాలకు వెరవబోమని స్పష్టం చేశారు. ఎండీ సాంబశివరావు తమతో సంప్రదింపులు జరిపేం దుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే  మరోసారి చర్చలకు ఆహ్వానించినట్లు పేర్కొనడం సరికాదన్నారు. ఫలక్‌నుమా డిపో వద్ద కార్మికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర చేశారు. 43 శాతం ఫిట్‌మెంట్ సాధించే వరకు సమ్మె విరమించమని హెచ్చరించారు.
 

ఆగని ప్రైవేట్ దోపిడీ

ఆర్టీసీ సమ్మెను అన్ని రకాల ప్రైవేట్ వాహనాలు సొమ్ము చేసుకున్నాయి. న గరంలో తిరిగే ఆటోరిక్షాలు మీటర్ రీడింగ్‌తో సంబంధం లేకుండా ప్రయాణికులపై దోపిడీ సాగించారు. దూరప్రాంతాలకు వెళ్లే టాక్సీ కార్లు, ఇతర వాహనాలు, ప్రైవేట్ బస్సులు సైతం రెట్టింపు చార్జీలతో జేబులు లూటీ చేశాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, కరీంనగర్, సిద్ధిపేట్, మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట్, ఏపీలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, చిత్తూరు తదితర ప్రాంతాలకు  ప్రైవేట్ బస్సులు, కార్లలో బయల్దేరిన ప్రయాణికులు రెట్టింపు చార్జీలు చెల్లించుకోవలసి వచ్చింది.

 కిక్కిరిసిన రైళ్లు..

ఒకవైపు పెళ్లిళ్లు, మరోవైపు వేసవి సెలవులు కావడంతో నగరవాసులు దూర ప్రాంతాలకు పయనమయ్యారు. అసలే అరకొర రైళ్లు.. ఆకస్మాత్తుగా ఆర్టీసీ సమ్మెతో మూడు రోజులుగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రైవేటు బస్సుల్లో వెళ్లలేనివారు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ నుంచి బయలుదేరే రైళ్లన్నీ కిక్కిరిసి వెళ్తున్నాయి. సమ్మె దృష్ట్యా కాచిగూడ- నిజామాబాద్, సికింద్రాబాద్ -కాజీపేట్, మల్కాజిగిరి- మిర్యాలగూడ రూట్లలో ప్యాసింజర్ రైళ్లను ఏర్పాటు చేశారు. వివిధ మార్గాల్లో నడిచే రెగ్యులర్ రైళ్లలో 2,200 అదనపు సీట్లు, బెర్తులు ఏర్పాటు చేసినట్లు ద.మ. రైల్వే సీపీఆర్వో ఎం. ఉమాశంకర్ కుమార్ తెలిపారు.

టిక్కెట్ సొమ్ము తిరిగి చెల్లింపు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న కార్మికుల సమ్మెను దృష్టిలో ఉంచుకొని అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్ చార్జీలు పూర్తిగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. టిక్కెట్ రిజర్వేషన్ కార్యాలయాల్లో విధులు నిర్వహించేందుకు తగినంత సిబ్బంది లేనందువల్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకున్నవారు తమ మొబైల్‌కు ‘సర్వీస్ కాన్సిల్’ అయినట్లు మెసేజ్ వచ్చిన వెంటనే రెండు రాష్ట్రాల ఆర్టీసీ వెబ్‌సైట్(ఠీఠీఠీ.్చఞటట్టఛిౌజ్ఛీ.జీ), (ఠీఠీఠీ.్టటట్టఛిఛఠట.జీ)కు లాగిన్ అయి టిక్కెట్లు రద్దు చేసుకుంటే వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము జమ అవుతుంది. ఆదరైజ్‌డ్ టిక్కెట్ బుకింగ్ ఏజెంట్లు (ఏటీబీ), ఆర్టీసీ బస్ స్టేషన్ల లోని కౌంటర్లలో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న వారు సమ్మె విరమించిన తేదీ నుంచి 7 రోజుల్లో తమ టికెట్లను రద్దు చేసుకొని సొమ్ము పొందవచ్చు. కాన్సిలేషన్‌కు సంబంధించిన వివరాలకు 1800 200 4599 నంబర్‌లో సంప్రదించవచ్చని అధికారులు విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీ కార్మికుడిపై దాడి

హయత్‌నగర్: ఆర్టీసీ డిపో మేనేజర్‌ను కలిసేందుకు వచ్చిన కార్మికుడిపై తోటి కార్మికులు దాడిచేసిన సంఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీ సుల కథనం ప్రకారం.. హైదరాబాద్-2 డిపోకు చెందిన డ్రైవర్ రాములు హయత్‌నగర్-2 డిపో మేనేజర్‌ను కలిసేం దుకు సంస్థ జీపులో వచ్చాడు. డిపో వద్ద జీపును అడ్డగించిన కార్మికులు రాములుపై దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement