అపురూప సంగమం
తెలుగింటే కాదు... భారతమంతా సంక్రాంతి సంబరమే. భిన్న సంసృతులు మిళితమై... విభిన్న సంప్రదాయాల సంగమమై... మినీభారత్‌గా వెలిగిపోతున్న ఈ భాగ్యనగరంలో ఇది ఒక అపురూప వేడుక. దశాబ్దాలుగా నగరంతో మమేకమైన రాజస్థానీ, గుజరాతీ, పంజాబీ, మరాఠీలు ఎంతో ఉత్సాహంగా ఈ సంబరాన్ని జరుపుకొంటున్నారు.
వారికిది లోహ్రీ...
పంజాబీల సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంది. మన కంటే ఒక రోజు ముందుగానే జరుపుకుంటారు. సంక్రాంతి పండుగనే లోహ్రీ ఉత్సవ్ అంటారు. భోగి కంటే ముందు రోజు సాయంత్రం కొత్త బట్టలు ధరిస్తారు. మహిళలు ఆభరణాలు అలంకరించుకుంటారు. భోగి మంటలు వేస్తారు. అగ్ని దేవుడిని పూజిస్తారు. నువ్వులతో చేసిన మిఠాయిలను అగ్నికి ఆహుతి చేస్తారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ... భజనలు చేస్తూ రాత్రంతా గడుపుతారు. నువ్వులు, పల్లీలు, మొక్కజొన్న, నువ్వుల, బెల్లంతో తయారు చేసిన ఐదు రకాల స్వీట్లను తయారు చేసి ప్రసాదంగా పంచుతారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ఉత్సవం చేసుకుంటారు. సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్న పంజాబీలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు.
భోగి పూజ
మరాఠీయులు దీన్ని సంక్రాత్రి అంటారు. భోగి రోజు భోగి కూర, సజ్జ రొట్టెలు నువ్వులతో కలిపి చేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేసి, చెరకు గడలు, రేగు పండ్లు, గెనుసు గడ్డలు, చిలకడ దుంపలు, తమలపాకులు, నవధాన్యాలు, చిన్న చిన్న మట్టి కుండలు పెట్టి భోగి పూజ చేస్తారు. సంక్రాంతినాడు మహిళలందరూ విఠలేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. నువ్వులు, బెల్లం, పసుపు, కుంకుమ, తమలపాకులతో వాయనాలు ఇచ్చిపుచ్చుకుంటూ, సందడిగా గడుపుతారు. రకరకాల మిఠాయిలతో పాటు నువ్వుల లడ్డు తప్పనిసరి.
ఆత్మీయ పండగ
పాతనగరంలో రాజస్థానీయులు అత్యంత ఉత్సాహంగా సంక్రాంతి జరుపుకొంటారు. వీరికిది ఒకరోజు పండుగ. పెళ్లయిన మహిళలు పుట్టింటికి వెళతారు. తల్లిదండ్రులు, సోదరులు ఆత్మీయ బహుమతులు ఇస్తారు. కొత్త బట్టలతో పాటు గేవర్‌గనీ, నువ్వుల లడ్డు వంటి స్వీట్లు ఆడపడచులకు ఇచ్చి దీవిస్తారు. అదే రోజు మట్టి కుండలో బియ్యం, పెసరలు, చెరకు గడలు, రేగి పండ్లు, ముల్లంగి, గెనుసుగడ్డ వేసి... రంగవల్లుల్లో ఉంచుతారు.
దార్ల వెంకటేశ్వరరావు