గ్రేటర్‌లో విలీనంపై పెదవి విరుపు | Greater Hyderabad Municipal Corporation | Sakshi
Sakshi News home page

గ్రేటర్‌లో విలీనంపై పెదవి విరుపు

Published Thu, Sep 12 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

గ్రేటర్‌లో విలీనంపై పెదవి విరుపు

గ్రేటర్‌లో విలీనంపై పెదవి విరుపు

 ‘గ్రేటర్’ హోదా చూసి సంబరపడ్డారు. అందులో కలిస్తే అభివృద్ధిలో వెనక్కి చూసే పనే ఉండదనుకున్నారు. తీరా కలిశాక.. ప్రగతి మాటేమో కానీ పాత దుస్థితి తొలగక అవస్థలు పడుతున్నారు. ఇదీ జీహెచ్‌ఎంసీలో విలీనమైన శివారు ప్రాంత ప్రజల ఘోష. కాగా,  కొత్తగా గ్రేటర్‌లో విలీనమైన గ్రామాల ప్రజలూ పెదవి విరుస్తున్నారు. పన్నుల మోతే తప్ప పనులు జరగవని అంటున్నారు. అప్పట్లో.. నగరంతో సమానంగా శివార్లలో సంపూర్ణ మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 900 కోట్లతో అప్పటి కమిషనర్ సమీర్‌శర్మ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. టెండర్లు పిలవాల్సిన తరుణంలో ఆయన బదిలీ కావడంతో పథకం అటకెక్కింది. శివార్లలో ఎక్కడి సమస్యలక్కడే తిష్టవేశాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఇటీవల గ్రేటర్‌లో విలీనమైన 35 గ్రామాలు శివాలెత్తుతున్నాయి. విలీనానికి ససేమిరా అంటున్నాయి.
 
 నిజాంపేట.. కటకట
 నిజాంపేట: పచ్చటిపైర్ల మధ్య కళకళలాడిన నిజాంపేట.. ఇప్పుడు గ్రేటర్‌లో విలీనం నేపథ్యంలో పన్నుల మోతను తలుచుకుని బెంబేలెత్తుతోంది. ఇప్పటివరకు గ్రామ పంచాయితీలో వంద గజాల అనుమతికి రూ.2 వేలను చెల్లించే వారు. విలీనం తరువాత ఈ ప్రాంతవాసులు బెటర్‌మెంట్ చార్జీల కింద ఒకేసారి రూ.20 వేలు చెల్లించాలి. ఆస్తిపన్ను (ఇంటి పన్ను) సుమారు 200 శాతం పెరగనుంది. ఇప్పటివరకు రూ.వెయ్యి నుంచి రూ.1500 ఆస్తిపన్ను చెల్లించవారు రూ.15 వేలకు మించి చెల్లించాలి. గ్రామంలో జీప్లస్ వన్‌కే అనుమతి ఉంది. చాలా భవనాలు 4-5 అంతస్తుల వరకు ఉన్నాయి. అక్రమ నిర్మాణాలపై గ్రేటర్‌లో 50 శాతం అదనపు పన్ను విధిస్తున్నారు. దీంతో నిజాంపేటలోని పలు భవనాలపై భారం పడనుంది.
 
 రాజేంద్రనగర్.. పరేషాన్
 రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ గతంలో మున్సిపాలిటీ. 2009లో సర్కిల్‌లోని ప్రాంతాలను 4 డివిజన్లుగా విభజించి గ్రేటర్‌లో కలిపారు. అప్పట్లో వేసిన రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి, డ్రైనేజీ వ్యవస్థలే నేటికీ కొనసాగుతున్నాయి. విలీనం తరువాత అభివృద్ధిపై ప్రజలకు నిరాశే మిగిలింది. పన్నుల భారం మాత్రం మిగిలిందని, పనుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు.
 
  తమ గ్రామం గ్రేటర్‌లో కంటే మున్సిపాలిటీలో ఉండగానే నయంగా ఉండేదని బుద్వేలు గ్రామస్తులు అంటున్నారు.
 
  ప్రస్తుతం రాజేంద్రనగర్ మండల పరిధిలోని 13 గ్రామాలు గ్రేటర్‌లో కలిశాయి. నిన్నటి వరకు పంచాయతీ ఆధీనంలో ఉన్న కిస్మత్‌పూర్ చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించింది. విలీనం తరువాత ప్రగతి అనుమానమేనని గ్రామ ప్రజలు అంటున్నారు.
 
 ఫీర్జాదీగూడ.. గోడు
 ఉప్పల్/బోడుప్పల్: జీహెచ్‌ఎంసీలో తాజాగా విలీనమైన పీర్జాదిగూడలో రోడ్ల విస్తీర్ణం 25 కి.మీ.. ఇప్పటికి 10 కి.మీ. మేర సీసీ రోడ్లు వేయగా, ఇంకా 15 కిమీ మేర సీసీ రోడ్లు వేయాల్సి ఉంది. గ్రామంలో ప్రస్తుతం 50 శాతం వరకే భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టారు. దీంతో గ్రామంలో మురుగు సమస్య తలెత్తుతోంది. చెరువు నుంచి మూసీలో కలపడానికి అవుట్‌లెట్ ఏర్పాటు చేయాల్సి వుంది. వారానికి ఒకరోజే తాగునీరు సరఫరా అవుతోంది. అదీ 45 నిమిషాలే.. చాలామంది నీళ్లు కొనుక్కుని తాగుతున్నారు. విద్యుత్ సమస్య సరేసరి.. గ్రామంలోని ఇళ్లు 5 వేలు. నల్లా కనెక్షన్లు అదే సంఖ్యలో ఉన్నాయి. కొత్తగా గ్రేటర్‌లో కలిసినందున సమస్యలు తీరతాయన్న నమ్మకం గ్రామస్తుల్లో లేదు. పన్నులపై భయపడుతున్నారు.
 
 రామంతా‘పూర్’ డివిజన్

 రామంతాపూర్ డివిజన్‌లోని కొన్ని బస్తీల పరిస్థితి మారుమూల గ్రామాలకన్నా దైన్యం.. ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్ గ్రామ పంచాయితీలు 1987లో మున్సిపాల్టీలుగా మారాయి. 2007లో గ్రేటర్‌లో విలీనమయ్యాయి. కుర్మానగర్, లక్ష్మీనర్సింహకాలని, ఉప్పల్ హిల్స్‌కు ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారానే నీటి సరఫరా జరుగుతోంది. వెయ్యికి పైగా ఇళ్లున్న ఈ బస్తీల్లో మట్టిరోడ్లే గతి. 80 శాతం వరకు రోడ్లు వేయాల్సి ఉంది. డ్రైనేజీ వ్యవస్థదీ అదే దుస్థితి.
 
 మొదట అభివృద్ధి చేసి.. ఆపై విలీనం
 గ్రేటర్ హైదరాబాద్‌లో కలిసిన రామంతాపూర్ డివిజన్ పరిధిలోని ఉప్పల్ హిల్స్, కుర్మానగర్, లక్ష్మీనరసింహ కాలనీలో నేటికీ మౌలిక వసతుల్లేవు. ఈ బస్తీలు అటు పంచాయితీలకు ఇటు గ్రేటర్ హైదరాబాద్‌కు కాకుండా పోయాయి. కనీసం మంచినీటి వసతి లేదు. మొదట సమగ్ర అభివృద్ధి చేసిన తరువాతే ఆయా ప్రాంతాలను గ్రేటర్‌లో విలీనం చేయాలి.
 - పబ్బతి శేఖర్‌రెడ్డి, ఉప్పల్ హిల్స్ కాలనీ అధ్యక్షుడు
 
 ఇప్పటికే గ్రేటర్లో కలిసిన శివారు మునిసిపాలిటీల ప్రజలు ఎలాంటి సదుపాయాల్లేక సమస్యలతో సతమతమవుతున్నారు. వారిపై పన్నుల భారం మోపడం తప్ప చేసిందేమిటి? ఇప్పుడు కొత్తగా 35 గ్రామాల విలీనం జరిగిందో లేదో ఆయా గ్రామాలపై పడి రికార్డులు స్వాధీనం చేసుకోవడం దారుణం. పన్నుల కోసమే గ్రామాల్ని కలుపుకొంటున్నట్టుంది.
 - టి.కృష్ణాగౌడ్, టీడీపీ బీసీ విభాగం నాయకుడు, అంబర్‌పేట
 
  ‘నీటి’ మీద ప్రతిపాదనలు
 శివార్లలోని 30 లక్షల మంది తాగునీటి కోసం అల్లాడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వారానికోసారి, ఇంకొన్ని ప్రాంతాల్లో రెండు వారాలకోసా రి నీళ్లు వస్తున్నాయి. రోజూ నీటి సరఫరాకు స్టోరేజి రిజర్వాయర్లు నిర్మించాలి. శివార్ల దాహార్తి తీర్చేందుకు రూ.2400 కోట్లతో 2008లోనే ప్రతిపాదనలు సిద్ధం చేసినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదు.
 
  కంచికి చేరిన ‘టిప్’
 కోర్ ఏరియాతో సమానంగా ఆస్తిపన్ను చెల్లిస్తున్నా.. శివారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించలేదు. ఈ క్రమంలో సమగ్ర మౌలిక స దుపాయాల కల్పన (టిప్)ద్వారా సౌకర్యాలు కల్పించాలని భావించా రు. అందుకు రూ. 900 కోట్లతో ప్రతిపాదనలు కూడా సిద్ధమై, బ్యాంకు రుణం తీసుకోవాల్సిన తరుణంలో.. పథకాన్ని మార్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement