సగం సిటీ.. చెరువైంది!
ఈదురు గాలులతో భారీ వర్షం
జలమయమైన రహదారులు స్తంభించిన ట్రాఫిక్
బంజారాహిల్స్‌లో పిడుగుపాటుకు పేలిన ట్రాన్స్‌ఫార్మర్
పలు చోట్ల నిలిచిపోయిన విద్యుత్
అంధకారంలో కాలనీలు
సిటీబ్యూరో: నగరంలో శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. కొన్నిచోట్ల పిడుగుపాటు సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో దాదాపు సగం నగరం చెరువులా మారింది. పలు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనచోదకులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పలు మోటార్ సైకిళ్లు మొరాయించాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఉన్న ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోయాయి. భారీ ఎత్తున ఈదురుగాలులు వీచాయి. దీంతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపోయి లైన్‌లపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆయా కాలనీల్లో గంటల తరబడి చీకట్లు అలుముకున్నాయి. రోడ్లు జలమయం అవడంతో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఎస్‌ఆర్‌నగర్, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఎల్‌బీనగర్, ఉప్పల్, బోడుప్పల్, హబ్సిగూడ, నాగోల్, విద్యానగర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కోఠి, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, కర్మన్‌ఘాట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సరూర్‌నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, చంపాపేట్, ఆస్మాన్‌ఘడ్, కొత్తపేట్, రామంతాపూర్, రాజేంద్రనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోరుుంది. ప్రజలు అవస్థలు పడ్డారు.
పిడుగుపాటుతో పేలిన ట్రాన్స్‌ఫార్మర్
ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి తోడు పిడుగు పడటంతో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కళింగ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న హైటెన్షన్ స్తంభానికి మంటలు అంటుకుని వైర్లు తెగి రోడ్డుపై పడ్డాయి. శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తతతోపాటు వాహనదారులను భయాందోళనకు గురిచేసింది. ఒకవైపు గాలిదుమారం, ఇంకో వైపు ఉరుములు మెరుపులతో భారీ వర్షం.. తెగి పడిన వైర్లు...మంటలు అంటుకున్న ట్రాన్స్‌ఫార్మర్‌తో బీభత్స వాతావరణం నెలకొంది. విద్యుత్ సరఫరా ఉండగానే కరెంట్ వైర్లు తెగి పడటంతో ప్రమాదం చోటుచేసుకోకుండా ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. తెలంగాణ భవన్ వద్ద నాలుగు వైపులా ట్రాఫిక్‌ను నిలిపివేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసిన తర్వాత వాహనాలను అనుమతించారు. అయితే అప్పటికే బంజారాహిల్స్ రహదారులన్నీ ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకున్నాయి.