హైడొలైట్
కేరళ వాసి సి.ఎస్.మనోజ్, తమిళనాడు వాసి కెప్టెన్ ఆనంద్‌లకు సిటీకి చెందిన ఎ.వి.రామకృష్ణతో స్నేహం. ఇతర రాష్ట్రాలవారైనా చాలా కాలంగా ఇక్కడే స్థిరపడిన వీరికి ఈ నగరంలోని అణువణువుతో పరిచయముంది. ‘‘ ఈ సిటీపై అభిమానమే సిటీ కోసం ఒక ఆర్ట్ ఫెస్టివల్‌ను నిర్వహించాలనే ప్రేరణ ఇచ్చింది. మరెందరినో ఈ సిటీకి అభిమానులుగా మార్చాలనిపించింది. అందుకు తగ్గట్టుగానే దీనికి హైదరాబాద్, ఫేవరెట్ కలిపి ‘హైడొరైట్’గా పేరు పెట్టాం’’ అంటూ చెప్పారు ఆనంద్. ఇది లాంగెస్ట్ ఫెస్ట్. ఈ స్థాయిలో 100 రోజుల ఫెస్టివల్ ప్రపంచంలోనే లేదు. దీని గురించి మాట్లాడుతూ ‘‘ఈ ఆలోచన చెప్పినప్పుడు చాలా మంది అసాధ్యం అన్నారు. అయితే మేం రెండు సీజన్‌లను విజయవంతం చేశాం. 3వ సీజన్‌లోకి అడుగుపెట్టాం’’ అంటూ సంతోషంగా చెప్పారు మనోజ్.
చేదు అనుభవాలూ ఉన్నాయి...
ఒక నగరంలో విభిన్న వేదికలపై 100 రోజుల ఆర్ట్ ఫెస్ట్ అంటే చాలా పెద్ద కార్యక్రమం. అత్యంత వ్యయప్రయాసలు దీనిలో ఇమిడి ఉన్నాయి. ‘‘మేమంతా మధ్యతరగతి వాళ్లమే. అయితే మాకున్న పరిచయాలు, మాలాగే చాలా మందిలో సిటీ అంటే ఉన్న అభిమానం... వీటినే నమ్ముకుని ముందడుగు వేశాం’’ అంటూ చెప్పిన ప్రిస్మ్ మేగ్‌జైన్ వ్యవస్థాపకులు ఎ.వి.రామకృష్ణ... తమకు తగిలిన ఎదురు దెబ్బల గురించి చెబుతూ ‘‘తొలి ఏడాదే వాతావరణం అనుకూలించని కారణంగా శివమణి ఈవెంట్ రద్దు కావడం లాంటి పెద్ద సమస్యలతో పాటు చిన్నా చితకా ఎదురు దెబ్బలూ తక్కువేం లేవు. అయితే సీజన్ సీజన్‌కి పబ్లిక్ నుంచి వస్తున్న రెస్పాన్స్, పెరుగుతున్న స్పాన్సరర్ల మద్ధతు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్ అభిమానుల అభినందనలు... అవన్నీ మరచిపోయేలా చేస్తున్నాయి’’ అంటారు.
ఈ ఏడాది అన్నీ ప్రత్యేకమే...
తెలంగాణ ఏర్పడ్డాక జరుగుతున్న తొలి అతిపెద్ద ఆర్ట్ ఫెస్టివల్ ఇది. అంతేకాకుండా 52 వారాల పాటు నిర్వహిస్తున్న హ్యాపెనింగ్ హైదరాబాద్‌లోనూ ఇది భాగం.
‘‘ హ్యాపెనింగ్ హైదరాబాద్‌లో మా కార్యక్రమమే మేజర్ పార్ట్ పోషిస్తోంది. ఈసారి ప్రభుత్వం కూడా మాకు మద్ధతుగా నిలిచి పలు వేదికల్ని ఉచితంగా అందిస్తూ ప్రోత్సహిస్తోంది’’ అంటూ రామకృష్ణ చెప్పారు. వారాంతాల్లో జరిగే 14 ఈవెంట్లలో పాల్గొనేందుకు అతిరథ మహారథులు అనదగ్గ కళాకారులు విభిన్న ప్రాంతాల నుంచి వస్తున్నారు. ప్రేక్షకుల్ని సైతం పార్టిసిపేట్ చేసేలా సాగే ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ ఈవె ంట్లన్నింటికీ ఫ్రీ ఎంట్రీ. ‘‘ఇచ్చిన పాసుల తప్పనిసరిగా వినియోగించుకోవాలి. లేదా తిరిగి అప్పజెప్పాలి అనేది మా నిబంధన. ఎందుకంటే ఉచితం కాబట్టి తీసేసుకుని వాటిని నిరుపయోగం చేయకూడదని మా ఆలోచన’’ అన్నారు మనోజ్.
స్పెయిన్‌లోని లా టొమాటినా ఫెస్టివల్‌లా, బెల్జియంలోని టుమారో ల్యాండ్ ఈవెంట్‌లను మించి హైడొరైట్ పాప్యులర్ కావాలని, మా తర్వాత కూడా చిరస్థాయిగా కొనసాగాలని కోరుకుంటున్న ఈ మిత్రత్రయం... ఈ ఏడాది నుంచి దీన్ని ఒక పూర్తిస్థాయి ట్రస్ట్‌గా మారుస్తున్నామని చెప్పారు. అలాగే ఒక పూర్తిస్థాయి కల్చరల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు కల్పించనున్నామన్నారు. వీరి కల సాకారమై, న‘వన’గరంలో మరెన్నో కళా సుమాలు పరిఢవిల్లేందుకు కారణం కావాలని కళాభిమానులు కోరుకుంటున్నారు. హైదరాబాద్... జిందాబాద్.
..:: ఎస్.సత్యబాబు