‘సుభోజనం’.. సంతోషదాయకం
బోయిన్‌పల్లిలో ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
సాక్షి,హైదరాబాద్: నగర ప్రజలకు ‘అన్నం’ పెడుతున్న అన్నదాతలకే భోజనం పెట్టడం తమకు సంతోషంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖల మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. బోయిన్‌పల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్ యార్డు ఆవరణలో రూ.5కే భోజనాన్ని అందించే ‘సుభోజన’ పథకాన్ని మంత్రులు నాయిని నరసింహారెడ్డి, పద్మారావులతో కలసి ఆయన గురువారం ప్రారంభించారు.
రైతు విశ్రాంతి భవనంలో సదుపాయాల కల్పన, హమాలీల విశ్రాంతి భవనానికి శంకుస్థాపనతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ మార్కెటింగ్ పనులకు వచ్చే రైతులకు తక్కువ ధరకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలన్న ఉద్దేశంతోనే ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. హమాలీలకు అనువైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మాట్లాడిన ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు అన్నారు. ఆటోలకు, ట్రాలీలకు చలానాలు విధించే సమయంలో కాస్త సంయమనం పాటించాలని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఈ సందర్భంగా సూచించారు.
రైతులకు భోజనం.. దేశంలోనే తొలిసారి
రైతులకు భోజనం పెట్టే పథకం దేశంలోనే తొలిసారని పథనిర్వాహకుడు, హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షుడు సత్యగౌరీ చందన్ అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 23 ప్రాంతీయ కేంద్రాల ద్వారా పదివేల పాఠశాలల్లో సుమారు 23 లక్షల మంది విద్యార్థులకు భోజనాన్ని అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మార్కెటింగ్ శాఖ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.