
హెచ్‌సీయూ విద్యార్థులకు భారీ వేతనాలు
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో 47 మందికి ఉద్యోగాలు
ఇద్దరికి 7.20 లక్షల వార్షిక వేతనం
సెంట్రల్ యూనివర్సిటీ: క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో హెచ్‌సీయూ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలలో ప్రతిభ కనబర్చి రూ.7.20 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. 12 ప్రఖ్యాతి గాంచిన కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించగా వివిధ విభాగాలకు చెందిన 490 మంది విద్యార్థులు హాజరయ్యారు. హెచ్‌సీయూ క్యాంపస్ ప్లేస్‌మెంట్ సెల్ సహకారం అందించింది. రూ.3.50 లక్షల వార్షిక వేతనం నుండి మొదలుకుని గరిష్టంగా రూ.7.20 లక్షల వార్షిక వేతనాలిచ్చే ఉద్యోగాలను విద్యార్థులు సాధించారు.
సత్తా చాటిన భావన, ప్రత్యూష
క్యావియం సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఎంటెక్ విద్యార్థినిలు ఏ.భావన, జి.ప్రత్యూషలు రూ.7.20 లక్షల వార్షిక వేతనానికి ఎంపికయ్యారు. ఎంటెక్, ఎంసీఏ విభాగంలో టెరేడాటా, క్యావియం నెట్‌వర్క్స్, మ్యూ సిగ్నా, వన్ కన్వర్వజెన్స్, టీసీఎస్, ఐబీఎం సంస్థలు 25 మంది హెచ్‌సీయూ విద్యార్థులకు ఉద్యోగాల ఆఫర్‌ను ఇచ్చాయి. ఎంబీఏ విభాగంలో లావా మొబైల్స్, టీసీఎస్, డెలాయిట్, ప్రొకర్నా సంస్థలు 13 మందిని ఎంపిక చేశాయి. ఎంటెక్, ఎకనామిక్స్, మ్యాథమ్యాటిక్స్ విభాగంలో హెచ్‌ఎస్‌బీసీ 81 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి 8 మందిని ఎంపిక చేసింది. ఎంసీఏ విభాగంలో వర్చుసా కంపెనీ ఒకరిని ఎంపిక చేసింది.