
'అసెంబ్లీ సెక్రటరీ విద్యార్హతలపై నివేదిక ఇవ్వండి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ సత్యనారాయణ విద్యార్హతలపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీనిపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. పిటిషనర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫున లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ విచారణకు ప్రభుత్వ తరఫు న్యాయవాది హాజరుకాలేదు.
దీనిపై రెండు వారాల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశించింది. లేకుంటే చీఫ్ సెక్రటరీ కోర్టుకు రావాల్సి వస్తుందని హెచ్చరించింది. అసెంబ్లీ సెక్రటరీ సత్యనారాయణకు లా డిగ్రీ లేదని...ఆయన ఆ పదవికి అనర్హుడంటూ ఎమ్మెల్యే ఆర్కే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.