
పాత నోట్లు మార్చేద్దామని..
- రూ. 1.85 కోట్లు కూడగట్టిన 13 మంది నిందితులు
- అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: పాతనోట్ల మార్పిడికి సాధారణ గడువు ముగిసినా ఇంకా కొందరు నల్లబాబుల్లో ‘మార్పిడి’ ఆశలు చావలేదు. ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) కోటాలో భారీ మొత్తం పాత నోట్ల మార్పిడికి ఓ ముఠా కుట్ర పన్నింది. మొత్తం 13 మంది నింది తులు రూ. 1.85 కోట్ల పాత నోట్లు కూడ గట్టారు. దీనిపై సమాచారం అందుకున్న ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు నింది తుల్ని అరెస్టు చేసి, రూ.500, రూ.1,000 డినా మినేషన్‌లో ఉన్న పాత నోట్లు స్వాధీనం చేసు కున్నారు. బేగంబజార్ ప్రాంతానికి చెందిన కమల్ కాబ్రా, కన్హయ్యలాల్ అగర్వాల్, విశాల్ కుమార్ హోల్‌సేల్ వ్యాపారులు.
ఈ మ్గురూ తమ వద్ద ఉన్న రూ. 50 లక్షల పాత నోట్లను మార్చడం కోసం చూస్తున్నారు. ఈ క్రమంలో విశాల్‌కుమార్ తనకు పరిచయస్తుడైన దీపక్ అగర్వాల్‌ను సంప్రదించాడు. తనతో పాటు స్నేహితులైన టి.నరేందర్ అగర్వాల్, వై.అజయ్ కుమార్, మహ్మద్ మజర్, రాజేందర్ అగర్వాల్ రూ.1,01,55,000 పాత నోట్లు కలిగి ఉన్నారని, వారితో కలసి మారుద్దామంటూ చెప్పాడు. దీంతో ఈ ఎనిమిది మంది కలసి పాత నోట్ల మార్పిడి కోసం మార్గాలు అన్వేషించసాగారు.
ఎన్‌ఆర్‌ఐ కోటాలో మారుస్తామని..
రాజేందర్ అగర్వాల్ ద్వారా వీరికి మహ్మద్ ఖమ్రుద్దీన్, ఎం.రాజారావు, మహ్మద్ వసీమ్, ఆర్.ప్రవీణ్‌రాజు, ఎన్.రాజు పరిచయ మయ్యారు. తమకు ఆర్బీఐ అధికారులతో పరిచయాలున్నాయంని.. ఎంత మొత్తం పాత కరెన్సీ అయినా మారుస్తామని నమ్మబలికారు. సాధారణ మార్పిడికి మార్చి 31తో తుది గడువు ముగిసినా... ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐలు) పాత నోట్లను మార్చుకోవడానికి జూన్ 30 వరకు గడువు ఉందని నమ్మించారు. ఈ దళారులు కూడా తమ స్నేహితులు, పరిచయస్తుల నుంచి రూ. 33,45,000 పాత నోట్లు సమీకరించారు.
80% కమీషన్ ఇచ్చేందుకు ఒప్పందం
రూ.లక్ష పాత నోట్లు ఇస్తే 80 శాతం తమ కమీషన్లు పోను రూ.20 వేల కొత్త నోట్లు వస్తాయంటూ వ్యాపారులకు చెప్పారు. దీంతో మొత్తం 13 మందీ ఆదివారం రెండు వాహనాల్లో పాత నోట్లు తీసుకుని బేగంపేట హాకీ గ్రౌండ్స్ వద్ద ‘ఆర్బీఐ’వ్యాన్ల కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ పి.బల్వంతయ్య నేతృత్వంలోని బృందం దాడి చేసి 13 మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.1.85 కోట్ల పాత నోట్లు, రెండు కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును తదుపరి చర్యల నిమిత్తం బేగంపేట పోలీసులకు అప్పగించినట్లు డీసీపీ బి.లింబారెడ్డి వెల్లడించారు.