
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి రద్దీని తట్టుకోలేక రైల్వే యంత్రాంగం బెంబేలెత్తిపోతోంది. హైదరాబాద్ నుంచి పండక్కి స్వస్థలాలకు వెళ్లేందుకు భారీ ఎత్తున తరలి వస్తున్న జనానికి సరిపడేన్ని రైళ్లు నడిపే వెసులుబాటు లేకపోవడంతో యంత్రాంగం నిస్సహాయత వ్యక్తంచేస్తోంది. ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి ఒకటి నుంచి 14వ తేదీ వరకు అదనంగా 12 లక్షల మంది ప్రయాణించారని దక్షిణ మధ్య రైల్వే లెక్కలేసింది. 147 ట్రిప్పుల ప్రత్యేక సర్వీసులు, రోజువారీ రైళ్లకు అదనంగా ఏర్పాటు చేసిన బోగీలలో ఈ అదనపు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్టు తెలిపింది.
అయితే ప్రత్యేక రైళ్లు ఏ మూలకూ చాలక ప్రయాణికులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. దీంతో శుక్రవారం స్వయంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ సికింద్రాబాద్, కాచీగూడ స్టేషన్‌లకు వచ్చి జనం కష్టాలను పరిశీలించారు. కానీ అనుకున్నంత వేగంగా కొత్త లైన్లు నిర్మించలేకపోవటం, చాలినన్ని బోగీలు, అదనపు ఇంజన్లు సిద్ధంగా లేకపోవటంతో ఇంతకుమించి రైళ్లను నడిపే పరిస్థితి లేదని దక్షిణమధ్య రైల్వే వర్గాలు అంటున్నాయి.