సాక్షి, సిటీబ్యూరో: రంగారెడ్డి నుంచి హైదరాబాద్ జిల్లాకు బదిలీ పై వచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్‌ల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. తాము కోరిన మండలాల్లో పోస్టింగ్‌లు దక్కకపోవడం పట్ల కొందరు అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నచ్చిన మండలంలో పోస్టింగ్‌ల కోసం గత మూడు రోజులుగా తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
ఎన్నికల బదిలీల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాల్లో పనిచేస్తున్న 8 మంది అధికారులు హైదరాబాద్ జిల్లాకు బదిలీ చేయించుకున్న సంగతి తెలిసిందే. వీరంతా జిల్లా, రాష్ట్రస్థాయి రెవెన్యూ అసోసియేషన్లలో కీలకపాత్ర పోషిస్తున్నవారే కావడం గమనార్హం. నచ్చినచోట పో స్టింగ్ దక్కనివారు విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. స్థానికంగా ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులతోనే కాకుండా ముఖ్యమంత్రి పేషీ నుంచీ సిఫార్సులు చేయిస్తుండడంతో ఏంచేయాలో పాలుపోక జిల్లా కలెక్టర్ తలపట్టుకుంటున్నట్లు సమాచారం.
సికింద్రాబాద్ డివిజన్లోనే...
రాష్ట్రస్థాయి తహశీల్దార్ల సంఘం నేత ఒకరు జిల్లాలో అత్యంత విలువైన భూములున్న మండలానికి రెవెన్యూ మంత్రితో కలెక్టర్‌కు సిఫార్సు చేయించుకున్నారు. అయితే.. అదే మండలంలో పోస్టింగ్ కోసం ఏకంగా ముఖ్యమంత్రితో కలెక్టర్‌కు చెప్పించుకున్న అధికారికి పోస్టింగ్ దక్కింది. ఫలితంగా రాష్ట్ర స్థాయి నేతకు సికింద్రాబాద్ డివిజన్లోనే ఓ చిన్న మండలంలో పోస్టింగ్ ఇచ్చారు.
అసంతృప్తితోనే బాధ్యతలు స్వీకరించిన పెద్ద లీడర్, డివిజన్లోనే ఎక్కువ ప్రభుత్వ స్థలాలున్న మండల తహశీల్దారు పోస్టు ఇటీవలే ఖాళీ కావడంతో దానిపై కన్నేశాడు. ఈ మేరకు పెద్ద స్థాయిలోనే సిఫార్సు లేఖను కలెక్టర్‌కు పంపించాడు. ఇప్పటికే ఒక అధికారికి తాను బదిలీ అయివచ్చిన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే మరలా పోస్టింగ్ ఇచ్చిన కలెక్టర్ నానా విమర్శలు పాలయ్యారు. అయితే.. కోరింది పెద్దలీడరు, సిఫార్సు చేసింది ముఖ్యనేత కావడంతో.. ఏంచేయాలో అర్థంకాక ఆ ఫైలును తనవద్దనే అట్టిపెట్టుకున్నట్లు తెలిసింది.
ఆశించేదేమిటో..!
‘జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు ఏ మండలంలో పోస్టింగ్ ఇస్తే.. అక్కడ పనిచేయడమే తెలుసు. అంతేగానీ, నాకు ఈ మండలం నచ్చలేదని, ఆ మండలమే కావాలని కోరుకోవడం వింతపరిణామమే’ అని రెవెన్యూ ఉద్యోగులు అంటున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చిన తహశీల్దార్లు నచ్చిన మండలంలో పో స్టింగ్‌ల కోసం ఇంతగా పైరవీలు కొనసాగిస్తున్నారంటే.. వారు ఏమి ఆశిస్తున్నారో అర్థం కావట్లేదంటున్నారు.
ఈ మండలం నాకు నచ్చలే!
Published Sun, Feb 16 2014 6:04 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 AM
Advertisement
Advertisement